కులాలు మతాలు లేవు మనమంతా ఒక్కటే. కుల మతాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం ! అందరం అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండాలి అంటూ పదే పదే ఉపన్యాసాలు ఇస్తుంటారు రాజకీయ నాయకులు. అదంతా నిజం అనుకుంటే పొరపాటే. కులాలు మతాలు జనాలకు అవసరం ఉన్నా లేకపోయినా, రాజకీయం అనే చట్రంలో ఉన్న వారికి మాత్రం కులాలే కావాలి. కులాల చిచ్చు రేగకపోతే రాజకీయ పబ్బం గడుపుకునే అవకాశం ఉండదు. కుల రాజకీయం చేయకపోతే రాజకీయం ఇప్పడు నడవడం కష్టం అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. కులమే రాజకీయం బలం అన్నట్టుగా ఇప్పుడు రాజకీయాలు తయారయ్యాయి. ఇక విషయంలోకి వచ్చేస్తే... ! ఏపీలో మళ్లీ కులాల చిచ్చు రాజుకుంది. అధికార పార్టీని ఇబ్బంది పెట్టడమే ఏకైక లక్ష్యంగా జనసేన, టీడీపీలో మాస్టర్ స్కెచ్ వేసినట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

 

IHG


ఏపీలో ఇప్పుడు రాజకీయాలు అన్ని కులాలు చుట్టూనే తిరుగుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా వైసీపీకి అనుకూలంగా, అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఓట్లు వేయడంతో, 151 సీట్లతో, వైసిపి ఎవరూ ఊహించని విధంగా అధికారం దక్కించుకుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో.. ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. ఆ జిల్లాలో మొదటి నుంచి కాపులు, బీసీలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండేవారు. 2014 ఎన్నికల ప్రచార సమయంలో కాపులను బీసీల్లో చేరుస్తామంటూ తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా, ఆ సంగతి పూర్తిగా పక్కన పెట్టడంతో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఉద్యమం మొదలైంది. కాపులను బీసీల్లో చేరుస్తామంటూ టీడీపీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినా, అప్పట్లో ఆ వ్యవహారాన్ని పట్టించుకోకపోగా, పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించడం, అల్లర్లు జరగడం, రైలు దహనం వరకు వ్యవహారం వెళ్ళింది. 

 

IHG


ఇక 2019 ఎన్నికలకు ముందు హడావుడిగా ఈ బీసీ కోటాలో కాపులకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ప్రకటించినా, అది వర్కౌట్ కాకపోవడం, టిడిపిని కాపులు పూర్తిగా పక్కన పెట్టేయడం వంటివి జరిగాయి. పోనీ ఆ కాపు సామజిక వర్గం ఓట్లు జనసేన వైపు మళ్ళాయా అంటే అదీ లేదు. తాను కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి చంద్రబాబులా మోసం చేయలేను అని, అది తన చేతుల్లో లేదని, కేంద్రం ఇస్తాను అంటే తాను అడ్డు చెప్పను అంటూ వైసీపీ అధినేత జగన్ అప్పటి పాదయాత్ర సమయంలో చెప్పడంతో, వైసిపి పని అయిపోయిందని, కాపులంతా ఆగ్రహంతో ఉన్నారని, టిడిపి జనసేన పార్టీలు సంబరపడ్డాయి. కానీ అనూహ్యంగా ఆ సామాజిక వర్గం ఓట్లు జనసేన ఖాతాలో పడడంతో ఈ రెండు పార్టీలకు మింగుడుపడలేదు. తాజాగా కాపు నేస్తం పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించి అర్హులైన కాపు మహిళల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా సొమ్ములు జమ చేస్తుండడం, కాపులు వైసీపీకి దగ్గర అవుతున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తుండడంతో, ఆకస్మాత్తుగా టిడిపి జనసేన లు అలెర్ట్ అయ్యాయి.

 

IHG


 అంతకు ముందు వరకు కులాలు లేని సమాజం కావాలంటూ హడావుడి చేసిన జనసేన అధినేత పవన్ ఇప్పుడు కాపుల అంశాన్ని పూర్తిగా భుజానికి ఎత్తుకున్నారు. కాపులకు జనసేన మద్దతు ఉంటుంది అన్నట్టుగా, ఆయన వ్యవహరిస్తున్నారు. కాపులను బీసీల్లో చేర్చాలని,కాపులకు అన్యాయం జరిగితే తాను ఊరుకోను అంటూ ఇప్పుడు పవన్హడావుడి చేస్తున్నారు. మిగతా కులాల్లో పట్టు సాధించలేకపోయినా, సొంత సామాజిక వర్గంలో పట్టు సంపాదించాలి అనే విధంగా జనసేన ముందుకు వెళుతోంది. అయితే ఇదంతా టిడిపి అధినేత చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతున్నట్లుగా అనుమానాలు బయలుదేరుతున్నాయి. కాపుల అంశాన్ని టీడీపీ తలకెత్తుకోకుండా, జనసేన ద్వారా ఆ వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలని చూస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

IHG


తెలుగుదేశం పార్టీ మాత్రం బీసీల అంశాన్ని తెరమీదకు తీసుకు వచ్చి బీసీలను తమవైపు తిప్పుకోవడం ద్వారా, జగన్ కు చెక్ పెట్టాలని చూస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ కు దగ్గరైన ఈ సామాజిక వర్గాల వారిని, మళ్లీ తమ వైపు తిప్పుకోవాలి అన్నట్లుగా తెలుగుదేశం, జనసేన పార్టీలు వ్యవహరిస్తున్నాయి అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమకు కులాలు, మతాలు లేవని, సరికొత్త రాజకీయాలు చేసేందుకు తాను పార్టీ పెట్టాను అని గొప్పగా చెబుతున్న పవన్ కూడా ఇప్పుడు టిడిపి ట్రాప్ లో పడి కుల నాయకుడిగా ముద్ర వేయించుకునేందుకు సైతం సిద్ధపడుతున్నారు. పరోక్షంగా ఇది కూడా చంద్రబాబుకు మేలు కలిగించే అంశంగానే కనిపిస్తోంది. 

 

 ఈ కులాల చిచ్చు రాజేయ్యడం ద్వారా టిడిపి జనసేన పార్టీ లు లాభపడేది పెద్దగా లేకపోయినా, వైసిపి మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. మరి ఈ కులాల చిచ్చు జగన్ ఏ విధంగా ఆర్పుతారో, ఈ కులాల చిచ్చు రాజేసి చలి కాచుకోవాలి అని చూస్తున్న టిడిపి జనసేన పార్టీలను కట్టడి చేసి అందరివాడిగా జగన్ ఎలా నిరూపించుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: