దివంగత వైఎస్సార్, టీడీపీ అధినేత చంద్రబాబు స్నేహితులన్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు. ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చిన ఈ దిగ్గజ నాయకులు...కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. 1978 ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు తొలిసారి ఎన్నికల బరిలో అదిరిపోయే విజయాలు అందుకున్నారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేసి గెలిస్తే, వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల బరిలో దిగి విజయం సాధించారు.

 

అయితే తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన వైఎస్సార్, చంద్రబాబులకు వెంటనే మంత్రి పదవులు కూడా దక్కాయి. చంద్రబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ దక్కగా, వైఎస్సార్‌కు వైద్య,ఆరోగ్య శాఖ దక్కింది. అయితే మంత్రులుగా చంద్రబాబు కంటే వైఎస్సార్‌నే అద్భుతమైన పనితీరు కనబర్చారు. చంద్రబాబు సినిమాటోగ్రఫీ మంత్రిగా కాస్త హడావిడి చేసేవారట. ఎక్కువ సినిమాల ఓపెనింగ్ కార్యక్రమాలకు వెళ్ళేవారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడే ఆయనకు ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇక ఆ సాన్నిహిత్యం ఎక్కడ వరకు వచ్చిందనే విషయం అందరికీ తెలుసు.

 

కానీ స్వతహాగా డాక్టరైనా వైఎస్సార్...వైద్య, ఆరోగ్య శాఖని సమర్ధవంతంగా నడిపించారు. అయితే ఆ తర్వాత వరుసగా ముఖ్యమంత్రులు మారడంతో, వైఎస్సార్ శాఖలు కూడా మారుతూ వచ్చాయి. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, ఎక్సైజ్ మంత్రిగా, విద్యా శాఖ మంత్రిగా సేవలందించారు. అయితే ఏ శాఖ వచ్చినా కూడా, వైఎస్సార్ అద్భుతమైన పనితీరు కనబర్చారు.

 

మంత్రిగా చంద్రబాబు కంటే కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి మార్కులే సంపాదించారు. అలా మంత్రిగా రాజకీయ జీవితంలో మెట్లు ఎక్కడం మొదలుపెట్టిన వైఎస్...ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీగా పలుసార్లు గెలిచారు. అలాగే పీసీసీ అధ్యక్షుడుగా పని చేశారు. తొలిసారి 1983 నుంచి 1985 వరకు, రెండో పర్యాయం 1998 నుంచి 2000 వరకు ఆ పదవిలో ఉన్నారు.  1999 నుంచి 2004 వరకు శాసనసభలో ప్రతిపక్షనేతగానూ వ్యవహరించారు. ఇక 2004-2009 వరకు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: