ప్రజల మనిషి, ప్రజలు మెచ్చిన మనిషి దివంగ‌త నేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. చరిత్ర చూడని, భవిష్యత్తులో రాని మహా మనిషి రాజన్న. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్. రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివి. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు.. ఆయన తుడిచిన కన్నీళ్ళు.. ఆయన మరణంతో ఆగిన గుండెలు ఎన్నో.. ప్రజా సంక్షేమమే శ్వాసగా, అభివృద్ధే ధ్యాసగా పాలన సాగించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా  ఆయన్ని స్మరించుకుంటూ రాసిన ఒక ప్రత్యక కథనం.

 

1949 జూలై 8న జయమ్మ, రాజారెడ్డి దంపతులకు కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించిన వైయ‌స్ఆర్ పూర్తి పేరు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చదివిన ఆయన.. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల నుంచి హౌస్ సర్జన్ పట్టా పొందారు. ఆ తర్వాత 1973లో తన తండ్రి పేరిట 70 పడకల చారిటబుల్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు వైయ‌స్ఆర్. అక్కడ పేదప్రజలకు అండగా ఉంటూ.. సరైన వైద్యం అందిస్తూ.. మంచి డాక్టర్ గా గుర్తింపు పొందారు. అయితే చదువుకునే రోజులనుంచే ప్రజాసేవ పట్ల ఆసక్తి, నాయకత్వ లక్షణాలు ఉండటంతో వైయ‌స్ఆర్ అడుగు రాజకీయాల వైపు మళ్ళింది. విద్యార్ధి నాయకుడిగా మొదలైన ఆయన ప్రస్థానం.. అంచలంచలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి స్థాయితో ముగిసింది.

 

1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎంపీగా నాలుగుసార్లు, ఎమ్మెల్యేగా ఆరుసార్లు ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా పేరుతెచ్చుకున్నారు వైయ‌స్ఆర్. 1983లో తొలిసారి పీసీసీ చీఫ్‌గా ఎన్నికయ్యారు. తర్వాత 1998లో మళ్లీ పీసీసీ అధ్యక్షుడయ్యారు. వైయ‌స్ రాజశేఖర రెడ్డి 1999 నుంచి 2004 వరకు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. అనంతరం పార్టీ బాధ్యతలని భుజానికి ఎత్తుకున్న వైయ‌స్ రాజశేఖర రెడ్డి.. 2003లో మండువేసవిలో దాదాపు 1467 కి.మీ. దూరం పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేశారు.

 

ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, 108 అంబులెన్స్ సేవలు లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలకు వైఎస్ శ్రీకారం చుట్టారు. దీంతో 2009లో మరోసారి ఆయన సీఎంగా ఎన్నికయ్యారు. వైఎస్ సీఎంగా ఎన్నికైన ఆనందం ఎంతో కాలం నిలవలేదు. సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమం కోసం బయల్దేరిన ఆయన ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన మరణం రాష్ట్ర ప్రజలను కలచివేసింది. ఆయన మరణ వార్తతో ఎన్నో గుండెలు ఆగిపోయాయి. ఒక డాక్టర్ గా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక మనసున్న నేతగా ప్రజల మనసులో చెరగని ముద్రగా మిగిలిపోయారు రాజన్న.

మరింత సమాచారం తెలుసుకోండి: