ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో 2009 ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవి. ఓ వైపు సినిమాల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి సరికొత్త సంచలనాలు సృష్టించాలని చూస్తే, మరోవైపు రాజకీయ చాణక్యుడు చంద్రబాబు సరికొత్త వ్యూహాలతో అధికారం చేజిక్కించుకోవాలని కాచుకుని కూర్చున్నారు. అసలు వైఎస్సార్‌కు ఏ మాత్రం అవకాశం లేకుండా చేయాలని బాబు అదిరిపోయే ఎత్తుగడలు వేశారు.

 

అందుకే కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్‌తో పాటు, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. మహాకూటమి పేరిట ఎన్నికల బరిలో దిగారు. అయితే అప్పుడు చంద్రబాబు తెలివిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో యువ సంచలనమైన నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్‌ చేత ప్రచారం చేయించాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ కూడా తన తాత పెట్టిన టీడీపీ కోసం ఎన్నికల ప్రచార బరిలో దిగారు. తాత మాదిరిగానే ఖాకీ దుస్తులు ధరించి, ప్రచారం చేశారు.

 

ఎన్టీఆర్ ప్రచారం మొదటి రోజే జనం ఉప్పెనలా వచ్చారు. ఇక అక్కడ నుంచి ఎన్టీఆర్ పర్యటించిన ప్రతిచోటా జన ప్రవాహం నడిచింది. ఎన్టీఆర్ కూడా తన వాక్చాతుర్యంతో ప్రజలని విపరీతంగా ఆకట్టుకున్నారు. వైఎస్‌తో పాటు మిగతా కాంగ్రెస్ నాయకులని ఏకీపారేస్తూ మాట్లాడారు. అయితే మధ్యలో కారు ప్రమాదం జరగడంతో ఎన్టీఆర్ ప్రచారానికి దూరమయ్యారు. కానీ హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఎన్టీఆర్ టీడీపీ గెలుపు కోసం ప్రచారం చేశారు.

 

దీంతో ఎన్నికల్లో టీడీపీ ఆధ్వర్యంలోని మహాకూటమి గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు.  మరోవైపు చిరంజీవి ప్రజారాజ్యం వల్ల కాంగ్రెస్ ఓట్లు చీలిపోయి, వైఎస్సార్‌కు భారీ షాక్ తగులుతుందని ఊహించారు. అయితే ఎవరెన్ని అంచలనాలతో దిగినా...వైఎస్సార్ మాత్రం...ప్రజల మీద నమ్మకం పెట్టుకుని, తను అందించిన పథకాల మీద ఆధారపడి ఎన్నికలకు వెళ్లారు. ఇక వైఎస్సార్ నమ్మకం వమ్ముకాలేదు. 2009 ఎన్నికల్లో వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 294 సీట్లకు గాను 156 సీట్లు తెచ్చుకుని మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైఎస్సార్ రెండోసారి సీఎం పీఠం మీద కూర్చుని సంచలనం సృష్టించారు. ఆ విధంగా 2009 ఎన్నికల్లో బుడ్డోడు(ఎన్టీఆర్) కూడా పెద్దాయన(వైఎస్సార్)కు చెక్ పెట్టలేకపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: