ఎంపిగా గెలిచిన దగ్గర నుండి పార్టీని ధిక్కరించాడు. ఊరుకున్నారు. పార్టీలో తిరుగుబాటు లేవదీశాడు. అయినా ఊరుకున్నారు. కానీ ఎప్పుడైతే పార్టీ అధినేతనే సవాలు చేశాడో అప్పుడే స్పాట్ పెట్టాలని డిసైడ్ చేశారు. ఇపుడిదే పార్టీలో సంచలనంగా మారింది. ఈ పాటికే అర్ధమైపోయుంటుంది నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు వ్యవహారం గురించే అని.  ఎంపిపై మంత్రి, ఎంఎల్ఏలు ఎదురు కేసులు పెడుతున్నారు. ముందు ఎంఎల్ఏలపై ఎంపి కేసులు పెట్టిన ఫలితంగా ఇపుడు ఎంపిపైనే ఎదురు కేసులు నమోదవుతున్నాయి. దాంతో తనను పోలీసులు అరెస్టు చేస్తారో అనే టెన్షన్ ఎంపిలో పెరిగిపోతోంది.  ఈ మొత్తానికి కారణం ఏమిటంటే తనను తాను చాలా ఓవర్ గా ఊహించుకోవటమే అని తెలిసిపోతోంది.

 

సరిగ్గా ఎన్నికలకు ముందు కృష్ణంరాజు వైసిపిలో చేరాడు. చివరి నిముషంలో టికెట్ తెచ్చుకుని గెలిచాడు. గెలిచిన దగ్గరనుండి పార్టీ లైనుకు కట్టుబడుకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాడు. ప్రభుత్వ విధానాలపై బాహాటంగానే వ్యతిరేకంగా మాట్లాడాడు. ఉద్దేశ్యపూర్వకంగానే ఎల్లోమీడియాతో మాట్లాడి రచ్చ చేశాడు. తనకు ఎల్లోమీడియా ఇస్తున్న ప్రాధాన్యతను చూసుకుని ఇదంతా తన గొప్పతనమే అని భ్రమపడ్డాడు. దాంతో బహిరంగంగానే జగన్ ఇమేజిపైనే ఆరోపణలు, విమర్శలు చేశాడు. జగన్ వల్ల తాను గెలవలేదని, తాను పోటీ చేయబట్టే వైసిపి గెలిచిందంటూ పార్టీనే ఎగతాళి చేశాడు. టికెట్ ఇస్తానని తనను కాళ్ళా వేళ్ళా బతిమలాడుకుంటునే తాను వైసిపిలో చేరానంటూ నోటికొచ్చింది మాట్లాడాడు. . ఎల్లోమీడియా కూడా తన అవసరాల కోసం ఎంపి రచ్చను బాగా హైలైట్ చేసింది.

 

ఎలాగూ పార్టీతో వివాదం బహిర్గతమైపోయింది కాబట్టి ఎంఎల్ఏలపైనా కొందరు నేతలపైనా కేసులు పెట్టాడు. దాంతో ఎంపిపై అనర్హత వేటుకు పార్టీ నాయకత్వం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ఇచ్చింది. అంటే ఎంపిని  పార్టీ వదిలేసుకున్నట్లే అనుకోవాలి. దాంతో ఇపుడు ఎంఎల్ఏలకు స్వేచ్చ దొరికినట్లైంది. అందుకనే మంత్రి శ్రీ రంగనాధరాజుతో పాటు ఎంఎల్ఏలు కొందరు ఎంపిపై ఎదురు కేసులు పెడుతున్నారు. ఎంపి ప్రోదల్బంతోనే కొందరు తమ దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారని, తమకు ప్రాణభయం ఉందంటూ ఏకంగా ఎంపిపైనే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఎప్పుడైతే మంత్రి, ఎంఎల్ఏల నుండి ఫిర్యాదులు అందుతున్నాయో వెంటనే పోలీసులు కూడా ఎంపిపై కేసులు నమోదు చేస్తున్నారు.

 

ఎంఎల్ఏలపై ఎంపి ఇచ్చిన ఫిర్యాదు వేరేసంగతి.  అదనపు భద్రత కోసం ఎంపి పెట్టుకున్న రిక్వెస్టు కూడా ఇక్కడ అప్రస్తుతమే. ఇక అనర్హత వేటు గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే ఇపుడు పార్టీకి లేదు. ఇపుడు అధికారపార్టీ ముందున్న విషయం ఏమంటే ఎంపిని అరెస్టు చేయటమే. ఎంపిని అరెస్టు చేయటం ప్రభుత్వం చేతిలో పనే. కాబట్టి ముందు ఈ పని చేసేస్తారనే ప్రచారం పార్టీలో జోరందుకున్నది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే దీనికే ఎక్కువ అవకాశం ఉందని అనిపిస్తోంది. మరి పార్టీ టికెట్ మీద గెలిచి, జగన్ ఇమేజి వల్ల అతికొద్ది మెజారిటితో బయటపడిన కృష్ణంరాజు వాస్తవాన్ని మరచిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎందుకు ఊరుకుంటారు ?

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: