న్యాయమూర్తులపై జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదుకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. తాజాగా ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపి షా మాట్లాడుతూ న్యాయమూర్తులపై జగన్ చేసిన ఫిర్యాదులను తేలిగ్గా తీసుకోకూడదన్నారు. వెంటనే సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డే స్పందించి విచారణకు ఆదేశించాలని సూచించారు.  జగన్ చేసిన ఆరోపణలను రెండు విధాలుగా చూడాలంటూ షా అభిప్రాయపడ్డారు.  ఒక రాజ్యాంగబద్దమైన వ్యవస్ధ మరో రాజ్యాంగబద్దమైన వ్యవస్ధపై ఫిర్యాదులు చేసినపుడు అందిన ఫిర్యాదులపై కచ్చితంగా విచారణ జరిపించాల్సిందే అంటూ బల్లగుద్ది మరీ చెప్పటం గమనార్హం. జగన్ చేసిన ఆరోపణలపై గోప్యత పాటించాల్సిన అవసరం ఎతమాత్రం లేదని షా స్పష్టంగా తేల్చిచెప్పారు. ఫిర్యాదులపై విచారణ బహిరంగంగానే జరగాలంటూ షా చేసిన సూచనలు సంచలనంగా మారియి. 




జగన్ చేసిన ఫిర్యాదులపై వెంటనే అంతర్గత విచారణ లేదా స్వయంగా చీఫ్ జస్టిస్సే విచారణ జరపాలని గట్టిగా కోరారు.  జగన్ చేసిన ఆరోపణలు రెండు విధాలుగా ఉన్నాయంటూ షా చెప్పారు. మొదటిదేమో సుప్రింకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ కూతుర్లు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడటం. ఇక రెండోదేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశ్యపూర్వకంగా  హైకోర్టు వ్యవహారాల్లో రమణ జోక్యం చేసుకోవటంగా షా గుర్తుచేశారు.  ఇప్పటికే రమణ కూతుర్లిద్దరిపైనా ఏసిబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కారణంగా విచారణపై ఉన్న స్టేని ఎత్తేసి విచారణకు అనుమతించాలంటూ గట్టిగా బాబ్డేని కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్వీ రమణతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు మరో ఆరుగురు జడ్జీలపై ఆధారాలతో కూడిన ఫిర్యాదులు చేసిన విషయాన్ని షా గుర్తుచేశారు.




న్యాయమూర్తులపై జగన్ చేసిన ఫిర్యాదును తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. అలాగే అభ్యంతరం పెట్టాల్సినంత అవసరం ఉందని తాను అనుకోవటం లేదని కూడా షా  అభిప్రాయపడ్డారు. పైగా ఆరోపణలపై వెంటనే విచారణ జరిపిస్తేనే న్యాయవ్యవస్ధ ప్రతిష్ట పెరుగుతందని కూడా సలహా ఇచ్చారు. ప్రజల్లో ఉన్న అనుమానాలనే జగన్ తన లేఖలో ఫిర్యాదుల రూపంలో సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్ళినట్లు అభిప్రాయపడ్డారు. ఇక ఏసీబీ విచారణపై గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటాన్ని కూడా అసాధారణ చర్యగా షా చెప్పారు. ఆరోపణలు చేస్తు జగన్ రాసిన లేఖను తప్పుపట్టినంత మాత్రాన ఉపయోగం ఉండదన్నారు. పైగా జనాల్లో అనుమానాలు మరింతగా పెరిగిపోవటం ఖాయంగా షా ఆందోళనవ్యక్తం చేశారు.




మొత్తంమీద జగన్ చేసిన ఫిర్యాదుకు వ్యతిరేకంగా ఎల్లోమీడియా కొందరితో అదేపనిగా మాట్లాడిస్తుంటే మరికొందరు రిటైర్డ్ జస్టిసులు మాత్రం జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్న విషయం గమనార్హం. రోజురోజుకు జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్న జస్టిస్ లు , న్యాయవాదులు పెరిగిపోతున్నారు. ఏదేమైనా జగన్ ఫిర్యాదుపై  అనుకూలంగాను, వ్యతిరేకంగాను వాదనలు పెరిగిపోతున్నారు. అయితే స్పందించాల్సిన బాబ్డే మాత్రం దాదాపు రెండువారాలైనా బహిరంగంగా  స్పందించలేదు. మరి బాబ్డే మనసులో ఏముందో ? కేంద్రప్రభుత్వం ఏమి ఆలోచిస్తోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. చూద్దాం ఈ అంశంపై ఇంకా ఎన్నిరోజులు సస్పెన్సు కంటిన్యు అవుతుందో .

మరింత సమాచారం తెలుసుకోండి: