గీతం భూ అక్రమాలపై రెండు, మూడు రోజులుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చివరకు గీతం దీనిపై హైకోర్టుకు వెళ్లి కూల్చివేతలపై నవంబర్ 30 వరకూ స్టే తెచ్చుకుంది. అయితే గీతం అక్రమాలపై మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఐవైఆర్ కృష్ణారావు సీసీఎల్‌ఏగా ఉండగా.. ఆ భూమి సొంతం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసిందట. ఈ విషయాన్ని అప్పట్లో ఐవైఆర్ తన ఫేస్‌ బుక్‌లో రాసుకున్నారు. ఇప్పుడు గీతం వివాదం నేపథ్యంలో అది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఐవైఆర్‌ ఏం రాసుకున్నారో యథాతథంగా..

‘‘ఎంవిఎస్ మూర్తికి చెందిన గీతం యూనివర్సిటీ భూమి. నేను సిసిఎల్ఏ గా ఉన్న సమయంలో యూనివర్సిటీ నుంచి ఒక అభ్యర్థన వచ్చింది. ‘తమ యూనివర్సిటీకి అనుబంధంగా 34 ఎకరాల భూమి ఉన్నది. మాకు కేటాయిస్తే మా సంస్థ బాగా అభివృద్ధి అవుతుంది’ అని కోరారు. అప్పటికి రాష్ట్ర విభజనపై ఆమోద ముద్ర పడింది. సాధారణంగా అయితే ఈ భూమి విలువ చాలా ఉంది కనుక దాన్ని అలా కేటాయించడం సాధ్యపడదు. ఇక రాజధాని ఎక్కడో నిర్ణయం కాలేదు కనుక భూమిని వివిధ సంస్థలకు కేటాయించేందుకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయినా దాన్ని భూకేటాయింపుల కమిటీకి నివేదించాం. కమిటీ గీతం అభ్యర్థనను తిరస్కరించింది.

ఈ భూమి ప్రజా ప్రయోజనాలకు అవసరం కనుక కేటాయించేందుకు కుదరదని స్పష్టం చేశాం. ఎంవిఎస్ మూర్తి నాపై ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. నేను లొంగలేదు. ఒకరోజు ఒక జర్నలిస్టు మూర్తి తరఫున రాయబారానికి వచ్చారు. అంతే కాదు, సిఎం ఆఫీసు నుంచి ఒత్తిడి పెరగడం ప్రారంభమయ్యింది. ఒక సీనియర్ కాంగ్రెస్ నేత కూడా నాపై ఒత్తిడి తెచ్చాడు. ‘మీరేమైనా రాయండి. కాని ఫైలు మాత్రం సిఎం ఆఫీసుకు పంపండి’ అని కోరారు. డబ్బు దగ్గర రాజకీయ ప్రయోజనాలు ఉండవు. మనీ ఈజ్ సెక్యులర్.

నాకు తెలుసు ఈ ప్రభుత్వం మూడు నెలల కంటే ఎక్కువ ఉండదని. ఎంవిఎస్ మూర్తికి ఈ భూమి రావడానికీ రాకపోవడానికీ మధ్య ఈ ఫైలు మాత్రమే ఊగిసలాడింది. ఎంత ఒత్తిడి తెచ్చినా నేను ఫైలు పంపలేదు. ఈ విషయంలో శాశ్వతంగా బుద్ధి చెప్పాలని భావించి, హైదరాబాద్‌లో సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్‌ను, ఆదాయపన్ను కమిషనర్‌ను, కస్టమ్స్ కమిషనర్‌ను, ఇతర డిపార్ట్‌మెంట్ వాళ్లను పిలిచాను. ‘మీకు విశాఖలో ఏమైనా భూమి కావాలా?’ అని అడిగాను. వారికి నిజంగా అవసరం ఉన్నది. సెంట్రల్ ఎక్సైజ్ వాళ్లు మూడు ఎకరాలు అడిగారు. ఆదాయపన్ను వాళ్లు మరో రెండెకరాలు అడిగారు. సామాజిక సంక్షేమ శాఖ హాస్టల్ నిర్మాణానికి ఒక ఎకరం కావాలంది. ఇలా రకరకాల శాఖలు తమ అవసరాలను వెల్లడించాయి. ప్రభుత్వ భూమిని, ప్రభుత్వ శాఖలకు కేటాయించేందుకు ఎవరి అనుమతి తీసుకోనవసరం లేదు…

అందుకే ఈ 34 ఎకరాలు ఫలానా ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తున్నానని నేనే ఉత్తర్వులు జారీ చేసి, ప్రభుత్వానికి రాటిఫికేషన్ కొరకు పంపాను. ఫలానా ఫలానా విభాగాలు తమ అవసరాలకు భూమి కావాలని అడిగాయని, అందుకు తగ్గట్లుగా భూమిని కొలిచి, ఆయా శాఖలకు కేటాయించి భూమిని స్వాధీనపరచవలసిందిగా నేను విశాఖ కలెక్టర్‌కు గట్టిగా చెప్పాను.

ఈలోపు గీతం యూనివర్సిటీ వాళ్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తాను యూనివర్సిటీ కోసం ఆ భూమిని అడిగానని, తనకివ్వకుండా ఉండేందుకే ఈ ప్రభుత్వ శాఖలకు కేటాయించారు అన్నది ఆయన అప్పీల్. కాని అప్పటికే భూమిని ప్రభుత్వ సంస్థలకు స్వాధీనం చేయడం జరిగిపోయింది. ఆ సంస్థలేవీ నిర్మాణాలు చేయలేదు. ఎందుకంటే స్టే ఉన్నదని ఆగిపోయాయి.

తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వమే చూసుకుంటుందని నేను మిన్నకుండిపోయాను. మూర్తి ఒకటి రెండు సార్లు నా చుట్టూ తిరిగారు. జిల్లా కలెక్టర్ ‘ఏమి చేద్దాం సార్’ అని అడిగారు. ‘నీవు ఏం చేయగలిగితే అది చేయ్’ అన్నాను ఎందుకంటే నేను కేసు బలంగా బిగించి పెట్టాను. దాన్ని సులభంగా విస్మరించలేరని నాకు తెలుసు.

నా ఛీఫ్ సెక్రటరీ పదవీకాలం పూర్తయ్యాక మళ్లీ కదల్చే ప్రయత్నం చేశారు. 2017 మే 17న కేబినెట్‌లో ఈ విషయం తీసుకువచ్చి ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూమిని రద్దు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రభుత్వానికి చెందిన భూములను కేటాయించేందుకు మార్గదర్శక సూత్రాలున్నాయి. ఒకటి – ప్రభుత్వ విభాగాలకు ప్రాధాన్యతనీయాలి. రెండవది- ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యతనీయాలి. మూడవది. అర్హులైన ప్రైవేట్ పార్టీలకు ఇవ్వాలి.

ఇలా మార్గదర్శక సూత్రాలున్నప్పుడు ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రభుత్వ విభాగాలకు ఇచ్చిన భూమిని రద్దు చేసి ఇంకొకరికి కేటాయించాలని ప్రయత్నం చేయడం ఎంత ఘోరం. మొదట చంద్రబాబు ఈ భూమిని ప్రభుత్వ రంగ సంస్థలకు రద్దు చేసి, గీతంకు ఇవ్వాలన్న మూడ్‌లోనే కేబినెట్‌కు తీసుకువెళ్లాడు. గీతం తరఫున వాదించారు. ‘మీకు తెలుసు కదా. గీతం యూనివర్సిటీ ఎంత ప్రతిష్ఠాత్మకమైనదో. ఆయన ప్రక్కనే ఉన్న భూమిని అడిగితే రాజశేఖర్ రెడ్డి కావాలని కక్ష కట్టి టార్గెట్ చేసి, ఆ భూమి రాకుండా చేశారు’ అని చంద్రబాబు చెప్పారని తెలిసింది.

దీనికి రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అడ్డుపడ్డారు. ‘మీరంటున్నది కరెక్టు కాదు సార్. ఇది రాజశేఖర్ రెడ్డి పీరియడ్‌లో జరిగింది కాదు. కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు దాన్ని మార్చి మనం ఇవ్వడానికి ప్రయత్నించడం బాగుండదు. కరెక్టు కాదు’ అని చెప్పారు. సిఎం ఏమీ అనలేకపోయారు. ‘కనీసం కేటాయింపులను రద్దు చేద్దాం’ అని రద్దు చేయించారు. గీతంకు ఇవ్వలేదు కాని ప్రభుత్వ సంస్థలకు భూమి ఇవ్వడాన్ని రద్దు చేశారు.

తమ వ్యాపారాలను అక్రమంగా విస్తరించేందుకే కాపాడుకునేందుకే చాలా మంది రాజకీయాల్లో చేరుతారు.
-ఐవైఆర్ కృష్ణారావు, మాజీ ఐఏఎస్ అధికారి.

మరింత సమాచారం తెలుసుకోండి: