అందరు అనుమానించినట్లుగానే  స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ వ్యవహారం సాగిందా ? వాయిదాపడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించే విషయంలో నిమ్మగడ్డ ఎన్నికల కమీషన్ ఆఫీసులో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. అధికార వైసీపీ బహిష్కరించిన ఈ సమావేశానికి మిగిలిన పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు 18 పార్టీలు హాజరైన సమావేశంలో గతంలో జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేసి మళ్ళీ ఎన్నికల ప్రక్రియను మొదటి నుండి మొదలుపెట్టాలన్న డిమాండే ఎక్కువగా వినిపించాయి. సమావేశంలో రాజకీయ పార్టీలు ఇలాగే డిమాండ్ చేస్తాయన్న విషయాన్ని చాలామంది ముందునుండి అనుమానిస్తునే ఉన్నారు.  ఎందుకంటే మెజారిటి రాజకీయ పార్టీలు చెప్పినట్లు నిమ్మగడ్డ నడుచుకుంటున్నారా ? లేకపోతే నిమ్మగడ్డ చెప్పినట్లే రాజకీయపార్టీలు మాట్లాడుతున్నాయా అన్న విషయంలో ఇఫ్పటికే చాలా అనుమానాలున్నాయి.




దానికి తగ్గట్లే టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, బీజేపీ ప్రతినిధి సత్యనారాయణ, బీఎస్పీ నేత బచ్చలకూర పుష్పరాజ్ తదితరులు మాట్లాడుతూ ఏకగ్రీవాలైన ఎన్నికలను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల ప్రక్రియను మొదటి నుండి ప్రారంభించాలన్నారు.  ఎన్నికల సమయంలో గతంలో జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బలగాలను తీసుకురావాలని సూచించారు. ఎప్పుడు ఎన్నికలను పెట్టిన పోటీ చేయటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చాలా పార్టీల ప్రతినిధులు స్పష్టంగా చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహించటాన్ని వైసీపీ మాత్రమే వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే ఒకే ఒక్క కేసు మాత్రమే ఉన్నపుడు ఎనిమిది నెలల క్రితం ఇదే నిమ్మగడ్డ కరోనా వైరస్ ను బూచిగా చూపించి ఎన్నికల ప్రక్రియను అర్ధాంతరంగా వాయిదావేశారు. అలాంటిది ఇపుడు రోజుకు సుమారు 4 వేల కేసులు రిజస్టర్ అవుతున్నపుడు ఎన్నికలను ఎలా నిర్వహిస్తారంటూ వైసీపీ అడుగుతోంది. అయితే నిమ్మగడ్డ వీళ్ళ  ప్రశ్నకు సమాధానం చెప్పటం లేదు.




ఇదే విషయమై వైసీపీ ఎంఎల్ఏ అంబటి రాంబాబు మాట్లాడుతూ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించటంలో నిమ్మగడ్డ ఉద్దేశ్యం తమకు అర్దమైపోయిందని మంగళవారమే ప్రకటించారు. దురుద్దేశ్యంతో నిర్వహిస్తున్న సమావేశానికి తాము హాజరయ్యేది లేదని ముందే చెప్పేశారు. ఇదే సమయంలో సుప్రింకోర్టు ఆదేశాలను కూడా నిమ్మగడ్డ ఉల్లంఘిస్తున్నారంటు అంబటి చేసిన ఆరోపణలకు ఇంతవరకు నిమ్మగడ్డ సమాధానమే ఇవ్వలేదు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ చూసిన తర్వాత మెజారిటి పార్టీల అభిప్రాయాల ప్రకారం అనే ముసుగులో నిమ్మడ్డ వ్యవహరిస్తారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  ఎటూ స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో ఇప్పటికే నిమ్మగడ్డ ఓ అభిప్రాయానికి వచ్చేసిన తర్వాత నిర్వహించే సమావేశంలో పాల్గొనటం కూడా దండగే అని వైసీపీ అనుకున్నది.




ఇక రాజకీయపార్టీలతో సమావేశం తర్వాత నిమ్మగడ్డ ఏమి చేయబోతున్నరన్నదే కీలకమైంది. ఇందుకు రెండు అవకాశాలున్నాయి. మొదటిది ప్రభుత్వంతో చర్చలు జరిపి మెజారిటి పార్టీల అభిప్రాయం ఏమిటో చెప్పటం. ప్రభుత్వంతో సమావేశం తర్వాత తన నిర్ణయం ఏమిటో ప్రకటించేయటం. ఇక రెండోది ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా నేరుగా తన అభిప్రాయాన్ని కోర్టుకే తెలియజేయటం. నిమ్మగడ్డ వరస చూస్తుంటే రెండో మార్గంలో వెళ్ళటానికే ఎక్కువ అవకాశాలున్నట్లు అనుమానంగా ఉంది.  సరే నిమ్మగడ్డ ఏ మార్గంలో వెళ్ళినా మళ్ళీ ప్రభుత్వంతో ఘర్షణ అయితే తప్పేట్లు లేదు. మరి చూద్దాం నిమ్మగడ్డ వ్యవహారం ఎలా వెళుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: