2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరాతి ఘోరంగా ఓటమి చెందింది. తెలుగుదేశం పార్టీ పుట్టి పెరిగిన తర్వాత ఈ స్థాయిలో ఓటమి చవి చూడకపోవడంతో తో, అసలు ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది అనే లెక్కలు వేసుకునే పనిలో చంద్రబాబు ఉంటూ వచ్చారు. టిడిపి ప్రభుత్వ హయాంలో అమరావతి, పోలవరం రెండిటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే అమరావతి వ్యవహారం మాత్రం బాగా వైరల్ అయింది. విభజన తర్వాత, పదేళ్ల పాటు యధేఛ్ఛగా హైదరాబాదులో ఉమ్మడి రాజధానినీ కొనసాగిస్తూ, తీరిగ్గా ఏపీలో రాజధాని నిర్మాణం చేపట్టే అవకాశం ఉన్నా, చంద్రబాబు తనపై నమోదైన ఓటుకు నోటు కేసు భయంతో, హడావుడిగా అమరావతిలో అడుగుపెట్టారు. అయితే ఆ తర్వాత రాజధాని అమరావతి ని ప్రకటించడం ,అక్కడ భారీ బడ్జెట్ తో అమరావతి నిర్మాణం పూర్తి చేసేందుకు వీలుగా, పెద్ద ఎత్తున హడావుడి చేసారు. 


దీనికోసం వ్యవసాయ భూములు పెద్ద ఎత్తున సేకరించి, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల రాజధాని నమూనాలను ఎప్పటికప్పుడు ప్రకటించి, ఇదే ఏపీ రాజధాని అంటూ హడావుడి చేశారు. అలాగే దేశ విదేశాలకు చెందిన ఎన్నో సంస్థలను తీసుకొచ్చి ఒక్కో సందర్భంలో ఒక్కో సంస్థ ద్వారా రాజధాని నమూనాను ప్రదర్శిస్తూ, హడావుడి చేశారు. రాజధాని నిర్మాణం కోసం సుమారు 33 వేల ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించడమే కాకుండా, వారికి ప్రతి ఏడాది కౌలు పేరుతో భారీగా నిధులు ఖర్చయ్యే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టడం, నిత్యం అమరావతి అంటూ కలవరించడం, వంటి వ్యవహారాలు ఎన్నో నడిచాయి . దీంతో మిగతా ప్రాంతాల్లో టీడీపీ పై అసంతృప్తి రేకెత్తించింది. బాబు ఐదేళ్ల పాలనలో అమరావతి నిర్మాణం మొదలు కాకపోగా, కేవలం కొన్ని కొన్ని తాత్కాలిక భవనాలతో సరిపెట్టి, ఇదే రాజధాని అన్నట్లుగా బ్రమ కల్పించడం వంటి ఎన్నో వ్యవహారాలు చోటుచేసుకున్నాయి. 



అప్పటికే రాజధాని నిర్మాణం పై శివరామకృష్ణ కమిటీ ని బాబు నియమించారు. అయితే వ్యవసాయ భూముల్లో రాజధాని నిర్మాణం తగదని, ప్రభుత్వ భూముల్లో రాజధాని ఏర్పాటు చేసుకోవాలని, అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి పనికిరాదని నివేదిక ఇచ్చి నా,దానిని పక్కనపెట్టి , పార్టీ నాయకులతో సొంతంగా కమిటీని వేసి, అమరావతిలో రాజధాని నిర్మాణానికి బాబు నడుం బిగించారు. కానీ అక్కడ హడావుడి జరిగింది తప్ప, రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏ డెవలప్మెంట్ జరగలేదు. కేవలం కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసమే అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టారు అనే విమర్శలు ఎన్నో బాబు ఎదుర్కొన్నారు. ఇక 2019 ఎన్నికల్లో, టిడిపి అతి ఘోరంగా ఓడిపోవడమే కాకుండా, అమరావతి ప్రాంతంలోనూ ఓటమిని చవిచూసింది. అంటే ఐదేళ్ల కాలంలో చెప్పిందంతా వట్టిదే అనే విషయం అర్థమైంది. 



ఇప్పటికీ, బాబు ఆ పార్టీ నాయకులు, అమరావతి అంటూ హడావుడి చేస్తున్నారు. దీనికి కారణం మిగతా ప్రాంతాలలో టిడిపికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇవన్నీ తెలిసినా, బాబు మాత్రం అమరావతి జపం చేస్తూనే పార్టీని చేజేతులా నాశనం చేసుకుంటున్నట్లు గా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: