తాజాగా స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వైసీపీ నేతలు అన్నారని కాదుకానీ నిమ్మగడ్డ వ్యవహార శైలి గురించి అందరిలోను ఇపుడిదే చర్చ పెరిగిపోతోంది. వాయిదాపడిన స్దానికసంస్ధల ఎన్నికలను నిర్వహించే విషయమై బుధవారం నిమ్మగడ్డ తన ఆఫీసులో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు.  19 పార్టీలను సమావేశానికి రమ్మంటూ ఆహ్వానించిన నిమ్మగడ్డ ప్రతిపార్టీకి విడివిడిగా వేర్వరుగా  కొంత సమయాన్ని కేటాయించారు. సరే సమావేశానికి వచ్చిన పార్టీలేవో వచ్చాయి రానివి రాలేదు. వచ్చిన పార్టీలు కూడా తమ అభిప్రాయాలను చెప్పి వెళ్ళిపోయాయి. వెళిపోయేముందు కొన్ని పార్టీల నేతలు మీడియాతో మాట్లాడి తాము నిమ్మగడ్డకు చెప్పిన అభిప్రయాలను, సూచనలను చెప్పేశారు. అంతా బాగానే ఉంది కానీ ఆ తర్వాత నిమ్మగడ్డ మీడియా సమావేశం పెట్టడంలో ఉంది అసలు పాయింటంతా.




ఇంతకీ విషయం ఏమిటంటే రాజకీయ పార్టీలతో ఎప్పుడు కూడా విడివిడిగా సమావేశాలు పెట్టింది లేదు.  హాజరైన అన్నీ పార్టీలతో కలిపి ఓ రౌండు టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. కాబట్టి ప్రతి పార్టీ చెప్పే అభిప్రాయాన్ని మిగిలిన అన్నీ పార్టీలు తెలుసుకుంటాయి. ఇదే  సందర్భంలో ఎలక్షన్ కమీషనర్ కూడా మాట్లాడుతాడు కాబట్టి  కమీషన్ అభిప్రాయం ఏమిటో అందరికీ తెలిసిపోతుంది. కానీ తాజా సమావేశంలో అలా జరగకుండా విడివిడిగా మాట్లాడారు. ఇదే విషయాన్ని మీడియా ప్రస్తావించింది. దానికి నిమ్మగడ్డ బదులిస్తు కరోనా వైరస్ నేపధ్యంలో కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలను పాటించినట్లు చెప్పారు. ఒకేసారి అందరితో ఒకే చోట సమావేశం అవ్వటం కరోనా వైరస్ కారణంగా సాధ్యం కాదుకాబట్టే ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. ముందుజాగ్రత్తలు తీసుకున్నందకు నిమ్మగడ్డను అందరు అభినందించాల్సిందే. ఇందులో తప్పు పట్టాల్సిన పనిలేదు.




మరి ఇదే ముందు జాగ్రత్తలు నిమ్మగడ్డ ఓటర్ల విషయంలో ఎందుకు తీసుకోవటం లేదు ? అన్నదే ఇఫుడు ప్రధానమైన ప్రశ్న. ఒక్కో పార్టీ తరపున హాజరైన ఒక్కో ప్రతినిధితోనే సమావేశమయ్యేందుకు విడివిడిగా టైం స్లాట్లు కేటాయించిన నిమ్మగడ్డ ఇదే విధంగా ఓట్లు వేసేందుకు వచ్చే  ఓటర్లకు కేటాయించగలరా ? ఒకేసారి 20 మందితో కూర్చుని మాట్లాడేందుకే ఇంతగా భయపడిన నిమ్మగడ్డ మరి ఒకేసారి పదుల సంఖ్యలో  ఎన్నికల సిబ్బందిని ఒకేచోట గంటల తరబడి కూర్చుని పనిచేయమని ఎలా చెప్పగలడు ? ఎన్నికల సిబ్బంది డ్యూటిని పక్కన పెట్టేస్తే కోట్లసంఖ్యలో ఓటర్లు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడితే ప్రాబ్లం రాదా ?  దీనికన్నా ముందు  పార్టీల అభ్యర్ధులు, నేతలు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం కోసమని గుంపులు గుంపులుగా తిరుగుతారు కదా. మరి అప్పుడు వాళ్ళకు కరోనా వైరస్ సోకదా ? వాళ్ళంతా కలిసి ఓటర్లను కలుస్తారు కదా ? అప్పుడు మామూలు జనాలకు కరోనా వైరస్ సోకితే బాధ్యత ఎవరిది ?



కేవలం పదికేసులున్నపుడే ఎన్నికలను మార్చిలో వాయిదా వేసిన నిమ్మగడ్డ మరిపుడు వేల సంఖ్యలో కేసులు రిజస్టర్ అవుతున్నపుడు ఎన్నికలను ఎలా నిర్వహిద్దామని అనుకుంటున్నారు ?  అంటే కరోనా వైరస్ విషయంలో తన ప్రాణాలైతే ఒక ఎత్తు ప్రజల ప్రాణాలంటే మరో ఎత్తా ? తనకు కరోనా వైరస్ సోకకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకున్న నిమ్మగడ్డ మరి ఎన్నికల సిబ్బంది,  అభ్యర్ధులు, రాజకీయ పార్టీల నేతలు,  ఓట్లేసే ప్రజల ప్రాణాల విషయంలో ఏమి జాగ్రత్తలు తీసుకుంటారో మాత్రం చెప్పలేదు. నిజంగా ఓట్లేయటానికి స్లాట్ ఇవ్వటం మన దగ్గర జరిగేపనేనా. ప్రతీ ఓటరుకు ప్రత్యేకంగా స్లాట్ ఇచ్చి ఓట్లేయించాలంటే పోలింగ్ ఎన్ని వారాల పాటు జరగాలో నిమ్మగడ్డ ఏమైనా ఆలోచించారా ?  మనసులో ఏదో పెట్టుకుని హడావుడిగా ఎన్నికలను నిర్వహించేయాలన్న ఆలోచన లేకపోతే ముందుగా చర్చించాల్సింది ప్రభుత్వంతోనే అన్న విషయం నిమ్మగడ్డకు తెలీదా ?  చూద్దాం తాజాగా మొదలైన రెండో ఇన్నింగ్స్ ఎలా ముగుస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: