జగన్మోహన్ రెడ్డి జాతీయ రాజకీయాల్లోకి వెళతాడా ? అంటూ ఎల్లోమీడియా ‘సర్కారు వారి భజన పాట’ అనే హెడ్డింగ్  తో ఓ బ్యానర్ స్టోరీని అచ్చేసింది. అందులో ఏముందంటే రూ. 8.5 కోట్లతో జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వ ఇమేజిని ఢిల్లీలో  పెంచటం కోసమే టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఏపి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందట. ఆ ఒప్పందం ప్రకారం టైమ్స్ పత్రికలో జగన్ గురించి పాజిటివ్ భజన చేయించుకుంటున్నారంటూ తెగ బాధపడిపోయింది. సొంత భజన చేయించుకునేందుకు ప్రజాధనాన్ని ఎలా వృధా చేస్తారంటూ ఒకటే గోల మొదలుపెట్టేసింది. అసలిదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఢిల్లీ స్ధాయిలో తన ఇమేజి దెబ్బ తినేసిందట. సుప్రింకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు మరో ఆరుగురు జడ్జీలపై జగన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే కదా. దానిపై జాతీయపత్రికలు జగన్ను దుమ్ము దులిపేశాయట. దాంతో జగన్ తో పాటు ఏపి ప్రభుత్వం పరువు కూడా పోయిందట. అందుకనే పోయిన ఇమేజిని కవర్ చేసుకోవటం కోసం కోట్ల రూపాయలతో కాంట్రాక్టులు చేసుకున్నారంటూ తెగ ఏడ్చేస్తోంది ఎల్లోమీడియా.




ఇక్కడ ఎల్లోమీడియా మరచిపోయిన విషయం ఏమిటంటే  జడ్జీలపై జగన్ చేసిన ఫిర్యాదు విషయంలో ఏ జాతీయ పత్రిక కూడా జగన్ను తప్పుపట్టలేదు. పైగా జగన్ ఫిర్యాదు అంశాన్ని ఆరోజు సుమారు 19 ఇంగ్లీషు డైలీలు ప్రముఖంగా ప్రచురించాయి.  తర్వాత జగన్ లేఖపై పాజిటివ్ గాను నెగిటవ్ గాను  కామెంట్లు వచ్చాయి. అంతేకానీ జగన్ చేసిన ఫిర్యాదు వల్ల ఎవరి పరువు పోలేదు. జగన్ తన  ఫిర్యాదులో చెప్పిన న్యాయమూర్తుల గురించే జాతీయస్ధాయిలో చర్చ జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంపైనే జగన్ పై మండిపోయిన ఎల్లోమీడియా పనికట్టుకుని నెగిటివ్ కామెంట్లను అచ్చెసిన విషయం అందరికీ తెలిసిందే. జగన్ కు వ్యతిరేకంగా ఢిల్లీ బార్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శితో మాట్లాడించగానే అక్కడ అంతర్గత విభేదాలు మొదలయ్యాయి.




సరే జగన్ చేసిన ఫిర్యాదును పక్కనపెట్టేద్దాం. టైమ్స్ పత్రికతో జగన్ ప్రభుత్వం రూ. 8.5 కోట్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటే మధ్యలో ఎల్లోమీడియాకు ఎందుకింత కడుపుమంటో అర్ధం కావటం లేదు.  చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు సదరు ఎల్లోమీడియా తీసుకున్న వందల కోట్ల రూపాయల యాడ్ల మాటేమిటి ? తన సర్క్యులేషన్ కు రావాల్సిన యాడ్లకన్నా చాలా ఎక్కువే తీసుకున్నదనే ఆరోపణలకు సమాధానం చెప్పిందా ? అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల హక్కులని, ప్రభుత్వ కార్యక్రమాలకు  లైవ్ కవరేజీ అని ఎంత డబ్బులు తీసుకున్నదో చాలామందికి తెలిసిందే. చంద్రబాబు హయాంలో  తన అర్హతకు మించే వందల కోట్లరూపాయలను వివిధ రూపాల్లో దోచేసుకునేదన్న ఆరోపణలకు కొదవేలేదు.  మరిపుడు తనకు అవకాశం లేదు కాబట్టి ఇతరులపై పడి ఏడిస్తే ఉపయోగం ఏమిటి ? పత్రికల్లో కనబడే యాడ్లన్నీ ప్రభుత్వానికి భజనే అన్న విషయం ఎల్లోమీడియా మరచిపోయిందా ?




సరే  ఈ విషయాన్ని వదిలేస్తే చంద్రబాబునాయుడు హయాంలో జరిగిందేమిటి ? ముంబాయ్ కేంద్రంగా పనిచేసే గ్రూప్ ఎం మీడియా ప్రైవేటు లిమిటెడ్ అనే యాడ్ కంపెనీకి 2017-18లో కోట్ల రూపాయలు దోచిపెట్టలేదా ? మరి అప్పుడు ఇదే ఎల్లోమీడియా చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు ? ఇపుడు జగన్ చేస్తున్నది తప్పంటే అప్పుడు  చంద్రబాబు చేసింది కూడా తప్పే కావాలి కదా. ఎందుకంటే ఇద్దరు దోచిపెడుతున్నదీ ప్రజల డబ్బులే. ఒకరు చేస్తే తప్పు, మరొకరు చేస్తే ఒప్పయిపోతుందా ?  ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే ఎల్లోమీడియాకు ప్రభుత్వం నుండి యాడ్లు రావటం లేదు. దాంతో బాగా ఉక్రోషం పెరిగిపోతున్నట్లుంది. అందుకనే ప్రభుత్వం మీద ఇంతలా గోల చేసేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: