తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ మహా శక్తి.. తెలంగాణలోనే కాదు.. దేశంలోనే అత్యంత శక్తివంతులైన ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ ఒకడు.. సంపూర్ణ మెజారిటీ.. సాటి వచ్చే అవకాశంలేని ప్రతిపక్షాలు.. పార్టీలో పోటీ లేని పరిస్థితి.. ఇలా అన్ని అంశాలు కలిసివచ్చాయి కేసీఆర్ కు.. అందుకే ఆయన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోగలుగుతున్నాడు. అయితే ఇటీవల ఆయన ఏపీ ఆర్టీసీ బస్సుల విషయంలో పెద్దగా పట్టించుకోకపోవడం విమర్శల పాలవుతోంది.

దేశమంతా కరోనా కారణంగా ఆగిపోయిన అంతర్‌ రాష్ట్రాల రవాణా మళ్లీ మొదలైనా.. ఏపీ, తెలంగాణ మధ్యమాత్రం ఇంకా బస్సు సర్వీసులు ప్రారంభం కాలేదు. ప్రైవేటు బస్సులకు ఓకే చెప్పినా.. ఆర్టీసీ బస్సులు మాత్రం తిరగడం లేదు. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ ఆర్టీసీ బస్సు సర్వీసుల విషయంలో సమన్వయం సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారన్న టాక్ వినిపించింది.  తెలుగు ప్రజలకు దసరా ఎంత ముఖ్యమైన పండుగో అందరికీ తెలిసిందే. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున జనం తమ సొంత గ్రామాలకు వెళతారు. అలా వెళ్లే వాళ్లలో ఎక్కువగా ఆంధ్రా ప్రజలే ఉంటారన్న సంగతి తెలిసిందే.

వాళ్లంతా పండక్కి ప్రైవేటు బస్సులతోనే సరిపెట్టుకున్నారు. ఆంధ్ర బస్సు సర్వీసులు తెలంగాణలో ఎక్కువ తిరుగుతున్నాయన్న కారణంతో ఆ వ్యవహారం తేలే వరకూ తెలంగాణలో ఏపీ సర్వీసులకు అనుమతి ఇవ్వకూడదని తెలంగాణ నిర్ణయించుకుంది. ఈ విషయంపై ఆంధ్రా అధికారులతో చర్చలు జరిపింది. హైదరాబాద్ సర్వీసులతోనే ఎక్కువ ఆదాయం పొందే ఏపీ.. ఈ విషయంలో మొదట ససేమిరా అన్నా తెలంగాణ పట్టుబట్టడంతో అడుగు వెనక్కి వేయక తప్పలేదు. చివరకు సర్వీసులు తగ్గించుకునేందుకు, కిలోమీటర్లు తగ్గించుకునేందుకు కూడా ఏపీ అంగీకరించింది.

ఇది జరిగి చాలా రోజులు అవుతోంది. కానీ.. ఇంకా తెలంగాణ ఆర్టీసీ బస్సుల విషయంలో తేల్చడం లేదు. ఇప్పటికీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల మధ్య ఇంతవరకు ఆర్టిసీ బస్ ల రాకపోకలు జరగకపోవడం బాధాకరమే. దీని వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాల వారిపై అదనపు భారం పడుతోంది. ఆంధ్రా వారు ప్రయాణ సదుపాయాలు లేక ఇబ్బంది పడితే తెలంగాణ ప్రభుత్వానికి కలిసి వచ్చేదేమీ ఉండదు. అందువల్ల సాధ్యమైనంత త్వరగా మనసు మార్చుకుని రెండు తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సులు తిరిగేందుకు సహకరించాలని జనం కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: