పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహకరిస్తుందన్న అంచనాలు రోజురోజుకూ తలకిందలవుతున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం నిర్మించాల్సిన బాధ్యతను తమకు అప్పగించాలని కోరారు. ఇదిగో..అదిగో 2018కే పూర్తి చేస్తామంటూ చెప్పిన చంద్రబాబు సర్కారు.. 2019 వరకూ అధికారంలో ఉన్నా పూర్తి చేయలేకపోయారు.. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక కొంతకాలం రివర్స్ టెండరింగ్ వ్యవహారం నడిచింది. ఇప్పుడు అనూహ్యంగా కేంద్రం మొండి చేయి చూపుతోంది.

అసలు కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును రాష్ట్రం చేతుల్లో పెట్టేసి.. నామ్‌ కే వాస్తేగా నిధులిస్తామంటోంది. గతంలో ఇస్తామన్న వాటిలోనూ కోతలు పెడుతోంది. తాజా లెక్కల ప్రకారం చూస్తే.. ఏకంగా 30 వేల కోట్ల రూపాయల వరకూ ఎగ్గొట్టే ఆలోచనలో ప్రస్తుతం కేంద్రం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో బీజేపీతో దోస్తీ ఉందంటున్న పవన్ కల్యాణ్ పార్టీ మాత్రం కప్పదాటు వైఖరి అవలంభిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ, 2019 వరకూ పాలించిన టీడీపీ స్వార్థపూరితంగా వ్యవహరించడం వల్లే ప్రతిష్టంభన నెలకొందని చెబుతోంది.

ఆ రెండు పార్టీలు తమతమ వాదనలతో దోబూచులాడుకొంటూ అసలు ప్రాజెక్టును పక్కనపెడుతున్నాయంటోంది. పోలవరం ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేసే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలన్నారు. గత ప్రభుత్వ కాలంలోనూ, ఇప్పటి ప్రభుత్వం కాలంలో అధికారంలో ఉన్న పార్టీలు కమీషన్ల కోసం చూసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ- నిధులు కేంద్రం ఇస్తే నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని కేంద్రాన్ని ఒప్పించిందని చెబుతోంది. 2019లో  అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ పనుల్లో అవినీతి చోటు చేసుకొంది అని నిర్మాణం ఆపివేసిందంటోంది. ఇదంతా ఓకే.. మరి పోలవరం కోసం పవన్ ఏం చేస్తారో అది మాత్రం చెప్పడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: