ప్రభుత్వానికి, స్టేట్ ఎలక్షన్ కమీషన్ కు మధ్య మొదలైన తాజా వివాదంతో కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గిలగిల్లాడిపోతున్నారు.  జిల్లాల కెలక్టర్లు, అధికారులతో నిమ్మగడ్డ జరపాలని అనుకున్న  వీడియో కాన్ఫరెన్సు రెండుసార్లు రద్దయ్యింది. మొన్నటి బుధ, గురరువారాల్లో వీడియో కాన్ఫరెన్సుంటుందని ఎలక్షన్ కమీషన్ అధికారికంగా సమాచారం పంపినా జిల్లాల్లో ఎవరు స్పందించలేదు. చేసేదిలేక నిమ్మగడ్డ తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. తన వీడియో కాన్ఫరెన్సు రద్దయ్యిందన్న మంట నిమ్మగడ్డలో బాగా కనబడుతోంది. అందుకనే చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి ఘాటైన లేఖ రాశారు. ‘జిల్లాల కలెక్టర్లు, అధికారులతో తాను వీడియో కాన్ఫరెన్సు నిర్వహించాలని అనుకుంటే మీకేమిటి బాధ’ ? అంటూ నీలంను నిమ్మగడ్డ సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల తేదీని నిర్ణయించేది ఎన్నికల కమీషనే కానీ ప్రభుత్వం కాదంటు గుర్తుచేశారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలన్నది ఓ ఆలోచనే కానీ నిర్ణయం కాదని తన చర్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. తనతో వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనకుండా అధికారులను అడ్డుకోవటమంటే రాజ్యాగబద్దంగా ఏర్పడిన ఎన్నికల కమీషన్ విధులను అడ్డుకోవటమే అంటు రెచ్చిపోయారు.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల కమీషన్ను ప్రభుత్వం గుర్తించటం లేదని, ఎన్నికల కమీషన్ విధులను ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపణలు చేస్తున్నారు నిమ్మగడ్డ. అయితే  తాను మాత్రం  ప్రభుత్వాన్ని గుర్తించాలని అనుకోవటం లేదు. మొన్నటి మార్చిలో స్ధానిక సంస్ధల ఎన్నికలను ఏకపక్షంగా నిమ్మగడ్డ వాయిదా వేసిన తెలిసిందే. మరి ఎన్నికలను వాయిదా వేయాలని అనుకున్నపుడు ముందుగా ఆ మాటను ప్రభుత్వంతో చెప్పాలని  నిమ్మగడ్డ ఎందుకు అనుకోలేదు ?  ఎన్నికల తేదీలను ప్రభుత్వం నిర్ణయిస్తుందని చీఫ్ సెక్రటరీ ఎప్పుడూ చెప్పలేదు. ఎన్నికల తేదీలను నిర్ణయించటం పూర్తిగా ఎన్నికల కమీషన్ ఇష్టమే అన్నది అందరికీ తెలిసిందే. బాధ్యత కలిగిన కమీషనర్ ఏం చేయాలంటే ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతే తేదీలను ప్రకటిస్తారు. అలాగా ప్రకటించిన తేదీలను మార్చాలన్నా, జరుగుతున్న ఎన్నికలను వాయిదా వేయాలన్నా ముందుగా ప్రభుత్వంతో చర్చిస్తారు. కానీ నిమ్మగడ్డ అటువంటిదేమీ చేయలేదు. అంతా నా ఇష్టం అన్న పద్దతిలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డకు జిల్లాల అధికారులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనకపోవటంతో తట్టుకోలేకపోతున్నారు.




ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయం ఎన్నికల కమీషనరే నిర్ణయిస్తారన్న విషయమే నిజమైతే మరి 2018 ఆగష్టులోనే జరగాల్సిన ఎన్నికలను నిమ్మగడ్డ ఎందుకు నిర్వహించలేదు ? అప్పట్లో నిమ్మగడ్డకు ఎన్నికలు నిర్వహించాలన్న  రాజ్యాంగపరమైన బాధ్యత గుర్తుకురాలేదా ?  అప్పట్లోనే తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేసుంటే ఇపుడీ సమస్య తలెత్తేది కాదు కదా ? మరి అప్పట్లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించటంలో ఎవరు అడ్డుపడ్డారు ? షెడ్యూల్ ప్రకారం ఎన్నికలను నిర్వహించటంలో ఎలక్షన్ కమీషన్ తన బాధ్యతల్లో విఫలమైందని నిమ్మగడ్డ అంగీకరిస్తారా ?  అందుకు బాధ్యత నిమ్మగడ్డ తీసుకుంటారా ?  అప్పట్లో తన బాధ్యతలను మరచిపోయిన నిమ్మగడ్డ ఇపుడు చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు గుర్తు చేయటమే విచిత్రంగా ఉంది. కరోనా వైరస్ కేసుల నియంత్రణలో జిల్లాల యంత్రాంగం బిజీగా ఉన్నారు కాబట్టి ఇపుడు స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు తగిన సమయం కాదని మాత్రమే చెప్పారు. పరిస్దితులు అనుకూలంగా ఉన్నాయని అనుకున్నపుడు ప్రభుత్వం సమాచారం ఇస్తుందన్నారు. అప్పుడు ఎన్నికల నిర్వహణపై చర్చలు జరపచ్చన్నారు. అంతేకానీ ఎన్నికల తేదీలపై చీఫ్ సెక్రటరీ ఎక్కడా ప్రస్తావన తేలేదు. ఈ విషయాన్నే నిమ్మగడ్డ తట్టుకోలేకపోతున్నారు. చూద్దాం కమీషనర్ నెక్ట్స్ స్టెప్ ఏమిటో ?

మరింత సమాచారం తెలుసుకోండి: