వినటానికి విచిత్రంగానే ఉన్నా తెలుగుదేశంపార్టీలో ప్రస్తుతం జరుగుతున్నదిదే. తొందరలో జరగబోయే తిరుపతి ఉపఎన్నిక చుట్టూత టీడీపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. తిరుపతి అభ్యర్ధి విషయంలో  చంద్రబాబునాయుడు ఓ ఎత్తు వేశారు. దాని ఆధారంగా కేంద్రమాజీ మంత్రి పనబాక లక్ష్మిని  క్యాండిడేట్ గా ప్రకటించారు. తిరుపతి లోక్ సభ పరిధిలోని నేతలతో జూమ్ యాప్ ద్వారా సమావేశం నిర్వహించిన చంద్రబాబు హఠాత్తుగా పనబాకను అభ్యర్ధిగా ప్రకటించేశారు. చంద్రబాబు ప్రకటన వినగానే అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నెలల ముందుగానే అభ్యర్ధిని ప్రకటించటం చంద్రబాబు నైజానికి విరుద్ధం. నామినేషన్లకు ఇక ఒకటి రెండు రోజులుందనగా మాత్రమే చంద్రబాబు అభ్యర్ధిని ప్రకటిస్తుంటారు. అలాంటిది ఇన్ని నెలల ముందుగానే పనబాకను ఎందుకు అభ్యర్ధిగా ప్రకటించారో అర్ధంకాలేదు. అయితే రోజులు గడిచేకొద్దీ నేతలకు చంద్రబాబు వ్యూహం ఏమిటో అర్ధమైంది.




ఇంతకీ చంద్రబాబు వ్యూహం ఏమిటంటే పనబాకు టీడీపీకి రాజీనామా చేయకుండా అడ్డుకోవటమే. ఇంతకీ విషయం ఏమిటంటే పనబాక టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరి అక్కడ నుండి తిరుపతి లోక్ సభకు పోటీ చేయాలని పనబాక ప్రయత్నిస్తున్నట్లు టీడీపీలో కూడా ప్రచారం ఉంది. దాంతో ఆమెను టీడీపీకి రాజీనామా చేయనీయకుండా బీజేపీలో చేరే అవకాశం లేకుండా చూడటం కోసమే ముందుగానే ఆమె అభ్యర్ధిత్వాన్ని ప్రకటించేశారు. ఎప్పుడైతే ఈ విషయాన్ని పనబాక గ్రహించారో అప్పటి నుండి ఇప్పటివరకు కనీసం ఒక్క ప్రకటన కూడా చేయలేదు. తాను పోటీ చేస్తానని కానీ చేయనని కానీ ఏమీ మాట్లాడలేదు. కారణం ఏమిటా అని ఆరాతీస్తే తనతో మాటమాత్రం కూడా చెప్పకుండానే తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించటంపై చంద్రబాబుపై ఆమె తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. తిరుపతి సీటులో అధికారపార్టీని కాదని టీడీపీ కాదు కదా మరే పార్టీ కూడా ఇపుడు గెలిచే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఇలాంటి పరిస్ధితుల్లో తాను ఎందుకు టీడీపీ తరపున పోటీ చేయాలన్నది ఆమె లాజిక్. అందుకనే ఆమె కూడా వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు.




ఎప్పుడైతే పనబాక మౌనంగా ఉన్నారో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. ఆమె గనుక పోటీకి నిరాకరించినా లేదా టీడీపీకి రాజీనామా చేసినా పోయేది తన పరువే అని చంద్రబాబుకి బాగా అర్ధమైపోయింది. అందుకనే మద్యవర్తిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని రంగంలోకి దింపారు. హైదరాబాద్ లోని పనబాక ఇంటిలో సోమిరెడ్డి కలిసి వాళ్ళతో చాలా సేపు మాట్లాడారు. అయితే ఎంతసేపు మాట్లాడినా వాళ్ళనుండి సానుకూల స్పందన రాలేదని సమాచారం. గెలుపు అవకాశాలు, ఆర్ధిక పరిస్ధితులు, క్యాడర్ పనిచేయటం లాంటి అనేక అంశాలపై సోమిరెడ్డితో మాట్లాడిన పనబాక దంపతులు పోటీ చేసే విషయంపై మాత్రం హామీ ఇవ్వలేదని తెలిసింది. దాంతో సోమిరెడ్డి వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. ఇపుడు పనబాక ఏమి నిర్ణయం తీసుకుంటారో తెలీక టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు ఎత్తుకు పనబాక పై ఎత్తు వేసినట్లు టీడీపీలో చెప్పుకుంటున్నారు. మరి ఎవరి ఎత్తు పారుతుందో ఎవరు చిత్తవుతారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: