న్యాయవ్యవస్ధ పరిధిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగానికి లోబడే శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్ధలు తమ విధులను నిర్వర్తించాల్సుంటుందని స్పష్టంగా చెప్పారు. మూడు వ్యవస్ధలు కూడా దేనికదే తమ పరిధిలో పనిచేస్తేనే సమన్వయం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఉపరాష్ట్రపతి  మాట్లాడిన మాటలు విన్న తర్వాత బహుశా ఏపిలో జరుగుతున్న వ్యవహారాలను దృష్టిలో పెట్టుకునే వ్యాఖ్యలు చేసినట్లు అర్ధమవుతోంది. కొంత కాలంగా ప్రభుత్వానికి, న్యాయవ్యవస్ధకు మధ్య తీవ్రస్దాయిలో వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకుంటున్న చాలా నిర్ణయాలపై ప్రతిపక్షాలు నేరుగానో లేకపోతే ఎవరి ద్వారానో ప్రజా ప్రయోజనల వ్యాజ్యాలు వేయిస్తున్నాయి. కేసు ఇలా పడటం ఆలస్యం కోర్టు వెంటనే విచారణకు తీసేసుకోవటం, స్టేలు ఇచ్చేయటం, ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో వ్యాఖ్యలు చేసేస్తున్నాయి. దాన్ని ఎల్లోమీడియా ప్రముఖంగా హైలైట్ చేస్తు  ప్రభుత్వంపై బురద చల్లేస్తున్నాయి.




గుజరాత్ లోని స్పీకర్ల సదస్సులో వెంకయ్య మాట్లాడుతూ కొన్నిసార్లు కోర్టులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే న్యాయవ్యవస్ధ దాని పరిధి దాటి వ్యవహరిస్తున్నాయా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. స్వాంతంత్ర్యం వచ్చిన తర్వాత సుప్రింకోర్టుతో పాటు అనేక కోర్టులు అనేక కీలక తీర్పులిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే కొన్ని కోర్టులు మాత్రం కార్యనిర్వాహక, శాసన వ్యవస్ధల అధికారాల్లోకి చొరబడుతున్న విషయంపై ఉపరాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఉదాహరణగానా అన్నట్లు హైకోర్టు, సుప్రింకోర్టులోని కొందరు న్యాయమూర్తులపై సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకి నేరుగా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు విషయం బయటపడగానే దేశంలో పెద్ద సంచలనమైంది. బహుశా ఇటువంటి అనేక విషయాలపైనే వెంకయ్యనాయుడు నేరుగా కాకుండా పరోక్షంగా న్యాయవ్యవస్ధ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.




కొన్ని ఘటనలను గమనిస్తుంటే కొన్ని అంశాలను ప్రభుత్వ శాఖలకే వదిలేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు సర్వత్రా పెరిగిపోతున్నాయంటేనే న్యాయవ్యవస్ధ జోక్యం పెరిగిపోయిందని అర్ధమవుతోందన్నారు. దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చటం, పోలీసుల విచారణపై పర్యవేక్షణ, జడ్జీల నియామకాల్లో కార్యనిర్వహాక వ్యవస్ధను కాదని కొలీజియాలే నిర్ణయాలు తీసుకోవటం, జాతీయ న్యాయ నియామక సంస్ధ ఏర్పాటును తిరస్కరించటం లాంటి అంశాలను వెంకయ్య ప్రస్తావించారు. మొత్తం మీద ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టుల జోక్యం పెరిగిపోతోందన్న విషయంలో అందరిలోను అసంతృప్తి పెరిగిపోతున్న విషయం అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: