గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికలో అన్నీ పార్టీలకు కలిపి ఓటర్లు హోల్ సేల్ గా పెద్ద షాకే ఇచ్చారు.  ఓటర్లు ఈ స్ధాయిలో షాక్ ఇస్తారని ఏ రాజకీయ పార్టీ కూడా ఊహించుండదు. ఓటర్లు ఇచ్చిన షాక్ ఎలాగుందంటే పోలైన ఓట్ల శాతం మహాఉంటే 35 అంటే ఎవరు నమ్మరేమో.  ఎన్నికలు జరిగిన గ్రేటర్ పరిధిలో దాదాపు 85 శాతం అర్బన్ ఏరియానే. అయినా కానీ ఓటర్లు తమ ఓట్లు వేసుకోవటానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు. 400 ఏళ్ళ హైదరాబాద్ చరిత్రలో ఇంత అధ్వాన్నమైన పోలింగ్ ఎవరూ  చూడలేదు. 2015 ఎన్నికల్లో 45 శాతం పోలింగ్ నమోదైంది. ఇంత తక్కువస్ధాయిలో ఓటింగ్ జరగటానికి అనేక కారణాలున్నాయి. ఓటింగ్ విషయంలో ఓటర్లలోని అనాసక్తికి ముందుగా రాజకీయ పార్టీలనే నిందించాలి. ప్రధాన పార్టీల్లో  అధికార టీఆర్ఎస్, ఎంఐఎంతో పాటు బీజేపీ నేతలు చేసిన ఓవర్ యాక్షన్ కూడా లో ఓటింగ్ కు ప్రధాన కారణమనే చెప్పాలి.




ఇక్కడ గమనించాల్సిందేమంటే ఓటర్ల అనాసక్తికి అనేక కారణాలున్నాయి. వాటిల్లో మొదటిదేమో కరోనా వైరస్. రెండోదేమో గ్రేటర్ ఎన్నికల పుణ్యమా అని రాజకీయ పార్టీల మధ్య పెరిగిపోయిన ఉద్రిక్తలు. మూడోదేమో విపరీతమైన చలి. నాలుగోదేమో లాక్ డౌన్ కారణంగా ఊర్లకు వెళ్ళిపోయిన వేలాదిమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తిరిగి హైదరాబాద్ కు రాకపోవటం.  చివరగా పోలింగ్ కు ముందు రోజు అంటే నవంబర్ 30వ తేదీ రాత్రి ఓల్డ్ సిటీలో బీజేపీ-ఎంఐఎం నేతల మధ్య జరిగిన గొడవలు. అలాగే నగరంలోని కొన్నిచోట్ల టీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య జరిగిన గొడవలు కూడా ఓ కారణమే. కరోనా వైరస్ భయం కారణంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి  ఓటర్లు వేయటానికి ఇష్టపడలేదు. ప్రముఖులు వచ్చి ఓట్లు వేశారంటే వాళ్ళకు ప్రత్యేకమైన సెక్యురిటి ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి వేశారు. మరి మామూలు జనాలకు అది సాధ్యం కాదు కాబట్టి కరోనా వైరస్ భయంతోనే రాలేదు.




ఇక ఎన్నికల పుణ్యమాని టీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం పార్టీల నేతల మధ్య బాగా ఉద్రిక్తతలు, గొడవలయ్యాయి. పోలింగ్ రోజున కూడా ఇలాంటి గొడవలు జరిగితే తాము ఎక్కడ ఇరుక్కుంటామో అన్న భయం కూడా ఓటర్లను వెంటాడింది. దానికి తగ్గట్లే నవంబర్ 30వ తేదీ రాత్రి కూడా ఓల్డ్ సిటిలో బీజేపీ-ఎంఐఎం నేతల మధ్య గొడవలయ్యాయి. అలాగే నెక్లెస్ రోడ్డులో  బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ వాహనం మీదకు టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయటంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇది చాలదన్నట్లుగా పోలింగ్ ఉదయం నుండి పై మూడు పార్టీల నేతల మధ్య గొడవలు జరుగుతునే ఉన్నాయి. దాంతో ఓటర్లు భయపడ్డారు. నగరం పరిధిలోని చాలా పోలింగ్ కేంద్రాల్లో వందలాది ఓట్లు గల్లంతైపోయాయి. జియాగూడ పోలింగ్ కేంద్రం 38లో 980 ఓట్లకు 657 ఓట్లు గల్లంతైపోయాయి. ఒక్కసారిగా పెరిగిపోయిన చలి లాంటి అనేక కారణాల వల్ల ఓటర్లు ఓటింగ్ కు రావటానికి ఇష్టపడలేదు. దాంతో దారుణమైన ఓటింగ్ నమోదైంది. మరి ఇంత లో ఓటింగ్ వల్ల ఏ పార్టీపై దెబ్బ పడుతుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: