దశాబ్దాల పాటు ఎదురుచూస్తున్న తలైవా రజనీకాంత్ అభిమానులకు నిజంగా గురువారం పండగ రోజనే చెప్పాలి. ఎందుకంటే జనవరిలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు రజనీ ప్రకటించారు కాబట్టి. తమ తలైవా నుండి ఇటువంటి ప్రకటన రావాలని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకాలని లక్షలాదిమంది అభిమానులు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అలాంటిది జనవరిలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు, డిసెంబర్ 31వ తేదీన పార్టీ విధి విధానాలతో పాటు పార్టీ పేరును కూడా ప్రకటిస్తానని స్వయంగా రజనీకాంతే తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఎప్పుడైతే రజనీ ప్రకటన ట్విట్టర్లో ప్రత్యక్షమైందో తమిళనాడులో సంచలనం మొదలైపోయింది. లక్షలాది మంది అభిమానులు తమ ఆరాధ్య దైవం రాజకీయాల్లోకి దూకాలని ఒకవైపు కోరుకుంటున్నారు. ఇదే సమయంలో ఏ నిర్ణయం తీసుకోకుండానే విషయాన్ని రజనీ సంవత్సరాల తరబడి నానుస్తున్నారు.




రజనీ మనస్తత్వం తెలిసిన వాళ్ళు, సన్నిహితులు తమ తలైవా ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ వచ్చే అవకాశమే లేదని దాదాపు నిర్ణయానికి వచ్చేశారు. మొన్నటికి మొన్న అభిమాన సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులతో జరిగిన సమావేశం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. అప్పుడు కూడా తన నిర్ణయాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తానని సమావేశాన్ని రజనీ ముగించారు. ఎప్పటిలాగే తన నిర్ణయాన్ని రజనీ చెప్పకుండానే దాటేశారని అందరు అనుకున్నారు. ఎందుకంటే ఇటువంటి సమావేశాలు ఇన్ని సంవత్సరాల్లో చాలానే జరిగాయి కాబట్టి. కానీ గురువారం ఉదయం రజనీ చేసిన ట్వీట్ చూసి అందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ట్వీట్ ప్రకారం చూస్తే కొత్తపార్టీ పెట్టబోతున్న రజనీ ఎవరితోను పొత్తులు లేకుండా సొంతంగానే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయబోతున్నట్లు అర్ధమవుతోంది. అభిమానసంఘాల వాళ్ళు కూడా ఎవరితోను పొత్తులు వద్దనే గట్టిగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో  తమ పార్టీనే అధికారంలోకి రాబోతోందని రజనీ ప్రకటించారు. తమిళనాడును సమూలంగా మార్చేస్తానంటు అప్పుడు పెద్ద పెద్ద డైలాగులు కూడా మొదలుపెట్టేశారు.




సరే కొత్తపార్టీ పెట్టబోయే రజనీ అధికారంలోకి వచ్చే విషయాన్ని ఇపుడే ఎవరు చెప్పలేరు. కాకపోతే రాబోయే ఎన్నికల్లో అధికారం తమదే అనుకుంటున్న డిఎంకే సమస్యల్లో పడుతుంది. ఎందుకంటే అధికార ఏఐఏడిఎంకె మళ్ళీ ఎన్నికల్లో గెలిచేది అనుమానమే. అలాగే శశికళ జనవరిలో జైలు నుండి విడుదలైనా రాజకీయంగా నిలుదొక్కుకునే విషయంలో చాలామందికి అనుమానాలున్నాయి. ఇక చిన్నా చితక పార్టీలు చాలానే ఉన్నా అవన్నీ రాష్ట్రంలోని ఏదో ఓ ప్రాంతంలో మాత్రమే ప్రభావం చూపగలవు. మరో సినీనటుడు విజయకాంత్ ఆధ్వర్యంలోని పార్టీ ఏ స్ధితిలో ఉందో కూడా ఎవరికీ తెలీదు. కమలహాసన్ ఆధ్వర్యంలోని పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో ఎవరికీ అంచనాలు లేవు.  ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అని అనుకుంటున్న డిఎంకే కు రజనీ తాజా ప్రకటన మింగుడుపడనిదే అని చెప్పవచ్చు. మరి రజనీ కొత్త పార్టీ తమిళనాడులో సమీకరణలను ఏ విధంగా మార్చేయబోతోందో వెయిట్ చేసి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: