కేసీఆర్ తెలంగాణ సీఎం, జగన్ ఏపీ సీఎం.. ఈ ఇద్దరు నేతల మధ్య సంబంధాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మొదట్లో ఇద్దరిదీ మంచి స్నేహమే.. జగన్ సీఎం కాక ముందు.. సీఎం అయిన కొన్ని రోజుల వరకూ మంచి సంబంధాలే ఉండేవి ఇద్దరి మధ్య. జగన్ సీఎం అయ్యాక కూడా ప్రగతిభవన్‌కు వచ్చి అనేక సార్లు సీఎం కేసీఆర్‌ను కలిశారు.. గంటల తరబడి చర్చించుకున్నారు. ఆంధ్రా, తెలంగాణ భాయీ భాయీ.. మనం ఏ విషయంలోనూ కొట్టుకోవద్దు. సామరస్యంగా ఉందాం అనుకున్నారు.

అంతేనా.. అసలు ఇద్దరు కలిసి కొన్ని కొత్త ప్రాజెక్టులకు కూడా రూపకల్పన చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎక్కడ చెడిందో కానీ.. ఆ ప్రాజెక్టుల ప్రణాళికలన్నీ మూల పడ్డాయి. అంతే కాదు.. అప్పటి వరకూ సామర్యసంగా ఉన్న వాళ్లు.. ఇప్పుడు ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ.. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం చెప్పడం మొదలుపెట్టాయి. ఏపీ నిర్మిస్తున్న పోలవరం, రాయలసీమ ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం చెబుతుంటే.. తెలంగాణ నిర్మిస్తున్న కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులపై అభ్యంతరం చెబుతోంది.

ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడమే కాదు.. కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఇక ఇప్పుడు కేంద్రం రంగంలోకి దిగింది. అసలు మీరు కడుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు అన్నీ సమర్పించమని రెండు రాష్ట్రాలనూ ఆదేశించింది. వాస్తవానికి డీపీఆర్‌లు రెండు రాష్ట్రాలు సమర్పిస్తే.. చాలా చిక్కులొస్తాయి. ఆ చిక్కులు రెండు రాష్ట్రాలకూ వస్తాయి. నిబంధనల ఉల్లంఘనలు లేకుండా సాధారణంగా ఏ ప్రాజెక్టుల నిర్మాణమూ సాధ్యం కాదు.

అందుకే ఇప్పుడు కేసీఆర్, జగన్ కాంప్రమైజ్‌కు వస్తారా.. లేక డీపీఆర్‌లు సమర్పించి తమ జుట్టు కేంద్రానికి అప్పగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలోనూ సీఎం కేసీఆర్ చంద్రబాబుతో ప్రాజెక్టుల విషయంలో కాంప్రమైజ్ అయ్యారు. ఆ తర్వాత జగన్ తోనూ కాంప్రమైజ్‌ అయ్యారు. ఇప్పుడు మళ్లీ కాంప్రమైజ్ అయ్యి చర్చించుకోవడమే రెండు రాష్ట్రాలకూ మంచిదంటున్నారు విశ్లేషకులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: