ఇప్పటివరకు జరిగిన పంచాయితి ఎన్నికల్లో మిత్రపక్షాల్లో బీజేపీతో పోల్చుకుంటే జనసేనే నయమని అనిపిస్తున్నట్లుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల పంచాయితీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ లెక్కల ప్రకారమే సుమారు 500 పంచాయితీల్లో సర్పంచ్ లుగా జనసేన బలపరచిన అభ్యర్ధులే గెలిచారట. అలాగే మరో వెయ్యి వార్డుల్లో జనసేన మద్దతుదారులు గెలిచినట్లు పవన్ ప్రకటించుకున్నారు. మరి పవన్ చేసిన ప్రకటన నిజమేనా ? లేకపోతే అంతా సొల్లేనా ? అన్న విషయం కూడా ఎవరికీ తెలీదు. ఎందుకంటే అధికార వైసీపీ కానీ లేదా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫైట్ బిట్వీన్ వైసీపీ-టీడీపీ మధ్యే మాటల యుద్ధం నడుస్తోంది కాబట్టి జనసేనను కానీ లేదా కాంగ్రెస్ పార్టీని కూడా ఎవరు పట్టించుకోవటం లేదు.




ఇదే సమయంలో బీజేపీ విషయం చూస్తే అసలు ఆ పార్టీ తరపున ఎవరైనా పోటీ చేస్తున్నారా ? పోటీ చేసిన వాళ్ళల్లో ఎవరైనా గెలిచారా ? అన్న విషయాన్ని కూడా కమలనాదుల్లో  ఎవరు ప్రకటించలేదు. బీజేపీ నేతల సంగతిని పక్కన పెడితే మిగిలిన పార్టీల నేతలు విడుదల చేస్తున్న జాబితాల్లో కూడా ఎవరు ప్రస్తావించటం లేదు. కాబట్టి బీజేపీ తరపున గెలిచిన వాళ్ళే ఎవరు ఉన్నట్లు లేరు. అయితే సోషల్ మీడియాలో మాత్రం 0.5 శాతం మంది బీజేపీ తరపున పోటీచేసిన వాళ్ళకు ఓట్లు వచ్చినట్లు కొన్ని లెక్కలు సర్క్యులేషన్లో ఉంది. ఇలాంటి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని చాలెంజులు చేస్తుండటమే విచిత్రంగా ఉంది.




అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం బీజేపీ కన్నా జనసేన పార్టీనే నయమని, బలమైన పార్టీగా మీడియాలో ప్రచారంలో ఉంది. ఈ ఫలితాలు తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల పోటీపై ప్రభావం చూపే అవకాశం ఉంటుదనే అనుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసేది తామే అంటే కాదు తామే అని రెండు పార్టీల మధ్య ఒకటే రబస నడుస్తోంది. అప్పటికేదో రెండు పార్టీలకు తిరుపతి పార్లమెంటు స్ధానం పరిధిలో బ్రహ్మాండమైన బలం ఉన్నట్లు ఎవరికి వారు ఫీలైపోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీచేసిన బీజేపీకి వచ్చిన ఓట్లు 16 వేలు. ఇక జనసేన అయితే పోటీనే చేయకుండా బిఎస్పీ అభ్యర్ధికి మద్దతిచ్చింది. మొత్తానికి పంచాయితి ఎన్నికల లెక్కలను చూస్తే బీజేపీ కన్నా జనసేనే బలమైనదని అనుకోవాలా ?

మరింత సమాచారం తెలుసుకోండి: