కేసీఆర్ ప్రతిపక్ష లీడర్లను ఎలాంటి ప్రలోభాలు ఏరవేసి తన దారికి తెచ్చుకోవాలో అంచనావేయగల కౌటిల్యుడు కూడా!  అందుకే, ఏ ఎత్తును ఎప్పుడు ప్రదర్శించాలో తెలిసిన అభినవ శకుని కూడా! ఇప్పుడు మరోసారి ఆయన ఆలోచనతో ప్రతిపక్షాలను నిరుత్తరులను చేసారు.

అసలు చాణక్యం, కౌటిల్యం రెండు దేశ ప్రయాజనాలను ఆశించి చేసారు నాటి చాణక్యుడు. కానీ మన అపర చాణక్యుడు తన, తన కుటుంబ, తన పార్టీ ప్రయోజనాల కోసం చేస్తారు. 

అనూహ్య నిర్ణయాలు తీసుకోవటం కేసీఆర్ కు ఎప్పుడు అలవాటే. అయితే, ఇంతకాలం ఆయన ఏమనుకుంటే అదే జరిగేది. ఎన్నికల వేళ ఆయన వ్యూహ రచన చేస్తే తిరుగు ఉండటం అసంభవం.  కాలం కలిసి రావటంతో పాటు చుట్టూ ఉన్న పరిస్థితులు పరిణామాలు ఆయనకు అనువుగా ఉండేవి.

కానీ రాష్ట్రంలో అధికార పార్టీకి గతంలోలాగా అనుకూల వాతావరణం లేదు దుబ్బాక శాసనసభ ఎన్నికతో మొదలైన పతన ప్రవాహం కొనసాగుతూనే ఉంది  అది జిహెచ్ఎంసి ఎన్నికల దిశగా కదిలి టీఆరెస్ విజయాలను గంగలో కలిపేసింది నాగార్జున సాగర్ శాసనసభ ఎన్నికల ఫలితాలపైనా నమ్మకం లేని పరిస్థితి.

నిన్నా మొన్నటి వరకు హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌‌ - ఎమ్మెల్సీ స్థానాలకు అసలు టీఆర్‌‌ఎస్‌ పార్టీ నుండి అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశాలు లేవని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా తమ పార్టీ సైతం బరిలో నిలుస్తుందని కేసీఆర్‌‌ ప్రకటించేశారు. అంతేకాదు ఏకంగా అభ్యర్థిని కూడా ప్రకటించారు.

ఈ ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు కూతురు వాణిదేవి ని టీఆర్‌‌ఎస్‌ ఖరారు చేసింది. పీవీ నరసింహారావు వారసులంతా చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ అనూహ్యంగా పీవీ వారసులను తెరపైకి తేవడమే కాదు. తగిన విధంగా గౌరవిస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోపెట్టే ప్రయత్నం చేశారు.

మాదాపూర్‌‌ లోని శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజీ విద్యాసంస్థల వ్యవస్థాపకురాలైన సురభి వాణిదేవి విద్యారంగంలోనే కొనసాగుతుండడంతో పట్టభద్ర ఎమ్మెల్సీకి ఆమెనే సరైన అభ్యర్థి అవుతుందని కేసీఆర్ అంచనా వేసినట్లు తెలుస్తోంది. పీవీ నరసింహారావు కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోక పోవడంతో తానే గుర్తింపు కల్పించాలని నిర్ణయించినట్లు ప్రకటించుకున్న కేసీఆర్, పీవీ వారసులకు పెద్దపీట వేయడం ద్వారా కాంగ్రెస్ తోపాటు, బీజేపీని కూడా దెబ్బ తీయొచ్చని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన మంత్రిగా పని చేసిన నాయకుడి కుమార్తె వాణిదేవి. అందువల్ల కచ్చితంగా ఆ పార్టీ కాస్త ఇరుకున పడుతుంది. ఇక బీజేపీ సంగతి కూడా అలాగే ఉంది. బీజేపీ అంటే ఇష్టపడే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాణిదేవికి సహజంగా ఆ వర్గం నుంచి ఆదరణ ఉంటుంది.

అలాగే పీవీ నరసింహారావు అంటే వివిధ వర్గాల ప్రజలు పార్టీలకతీతంగా అభిమానిస్తారు. పట్టణ ఓటర్లు, నవ యువతలో కూడా పీవీ అంటే అభిమానించేవారు ఇప్పటికీ ఉన్నారు. వీరు సహజంగా బీజేపీ అంటే కూడా అభిమానంతో ఉంటారు. వీరందరినీ డైలామాలో పడేయడం లేదా ఈ ఓట్లలో చీలిక తీసుకరావడం కేసీఆర్ వ్యూహంగా చెప్పొచ్చు. కేసీఆర్ ఎత్తుగడ అయితే వేశారు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకప్పుడు మేధావులు, ఎక్కువ చదువుకున్న వారికి అవకాశం ఉండేది. ఇప్పుడంతా మారిపోయింది. అక్కడా కులాలు, మతాలు వీటి సమ తూకాలు లాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్‌‌ వేసిన ఎత్తులు ఏ మేరకు ఫలాలిస్తాయో చూడాలి.

.

అధికారంలో ఉన్నవేళ,  ప్రతి వెంట్రుక కీలకమే ముఖ్యమైనదే. మనకు వెంట్రుకలా అనిపించినా, చూసే వాళ్లకు అలా ఉండదన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోకూడదు.

తాజాగా జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఏ మాత్రం కలిసి రాని హైదరాబాద్రంగారెడ్డి - మహబూబ్ నగర్ జిల్లాల నుంచి పీవీ నరసింహారావు కుమార్తెను రంగంలోకి దించటం ద్వారా భారీ జూదానికి తెర తీశారు. మామూలు అభ్యర్థి గెలుపు ఓటములు ఒకలా ఉంటాయి. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె ను ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దించటం ఏమాత్రం తెలివైన పని కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

ఎందుకంటే, ఈ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ బలం అంతంత మాత్రమే. ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ఇలాంటివేళ, రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఎన్నికల బరిలోకి దించటం కేసీఆర్ కు సరికాదంటున్నారు. కేసీఆర్ అంటేనే వ్యతిరేఖత అధికంగా ఉన్న ఈ పట్టభద్రుల నియోజకవర్గం ఇంతటి గౌరవనీయ కుటుంబానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్సీగా నిలబెట్టటానికి సురక్షితం కాదు. అయినా కేసీఆర్ తనకే స్వంతమైన కచరా ఎత్తు వేశారు. గెలిస్తే నా మహిమ ఓడితే వాణీదేవి ఖర్మ అనుకునేలా! 

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయోగించే భావోద్వేగ అస్త్రాలకు పడిపోయే పరిస్థితుల్లో నేటి ప్రజలు లేరని, ఇలాంటి వేళ కేసీఆర్ కు తగిన సందేశాన్ని ఇచ్చేందుకే అయినా భిన్నమైన తీర్పువస్తే పరిస్థితి ఏమిటి?  అన్న దే ప్రధాన ప్రశ్న.

ఈ వాదనకు బలం చేకూరేలా కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ కుమార్తె కవితను ఎమ్మెల్సీగా ఎన్నుకోవటానికి పార్టీ ఎమ్మెల్యేలు ఉండాలి కానీ, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తెను ఎన్నుకోవటానికి మాత్రం ప్రజలు ఉండాలా? ఇదెక్కడి న్యాయం అంటూ కాంతి వేగంతో ప్రసరించే సమాచారం నుండి వస్తున్న సంకేతం లేదా సందేశం ఏమిటి?



మరింత సమాచారం తెలుసుకోండి: