తెలంగాణ భువి ఆసాంతం కలవకుంట్ల చంద్రశేఖర రావు ను పాలనను దుర్మార్గ పాలనగా కీర్తిస్తున్నారు. కారణం మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని రుణాలతో కునారిల్లే ఆర్ధిక రోగగ్రస్థ రాష్ట్రంగా మార్చేశారు. ఎక్కడ చూసినా అవినీతి, బంధుప్రీతి, చీకటి వ్యాపారాలు, భూకబ్జాలు, దోపిడీలు, అక్రమార్జనలే కాదు - రౌడీలు, గుండాలతో రాష్ట్రం నిండిపోయింది - బాజాప్తా రహదార్లపై మగువల మానానికి రక్షణ లేని పరిస్థితులు. మొత్తంగా టీఆరెస్ పార్టీవాళ్ల బాగస్వామ్యమే ఇందులో ఎక్కువగ బహిరంగంగానే ప్రస్ఫుటమౌతుంది.


అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకునే చందంగా - నేడు పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగే ఎమ్మెల్సీ - లెజిస్టేటివ్ కౌన్సిల్ సభ్యులు - ఎంపిక కొరకు జరిగే ఎన్నికలకు ముందు ఆయన కార్యరంగాన దూకారు. అయితే విద్యావంతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, జ్ఞానమున్న వారు - విజనరీ అంటే సమస్యలపై సదవగాహన కలిగిన "ప్రతిభావంతులు" పాల్గొనే ఎన్నికలను - "నీ కాల్మొక్కుతా బాంచన్ దొర" అనే సమూహం నుండి గెలిచే కచరా నాయకత్వం - విజయం సాధించగలదా?! అనేది ప్రధాన ప్రశ్న. గెలిస్తే ఆశ్చర్యార్ధకమే! పై వర్గాలన్నీ గత "ఏడెనిమిదేళ్ళ - పాలన" బాధితులే కదా! ఒంటరిగా ఉస్మానియాకు రాగలరా? అని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేని నాయకత్వం-స్థానాలు సాధించుకుంటే ఆశ్చర్య పోవాల్సిందే.

 

అయినా దీక్ష తీసుకున్నారు అంటే మన పరిభాషలో పట్టుపట్టారనే చెప్పాలి. ఇలాంటి కదన రంగంలోకి చివరి అస్త్రంగా మాజీ ప్రధాని అపార చాణక్యుడైన దివంగత పివి నరసింహారావుగారి ప్రియతనయ సురభి వాణీదేవి గారిని ముందువరసలో నిలబెట్టారు. కేసీఆర్ పట్టుబట్టారు.

సమర రంగాన సాయుధులై సాధించడానికి సమాయత్తమవుతున్నారు. అస్త్ర శాస్త్రాలతో సర్వశక్తులు యుక్తులు కూడగట్టుకుని చావో? బ్రతుకో? తేల్చుకోవాలన్నంతగా – అతిరధ, మహారధ, సమర రధులకు పనులు పురమాయించి – సార్వం సహా సార్వభౌముడే కుడి ఎడమల డాల్ కత్తులు మెఱయఁగ అన్నట్లు - సర్వసేనానై - ప్రస్తుతానికి ఫామ్-హౌస్ పరిసరాల్ని వదిలేసి, ప్రగతి భవన్ మీదుగా వీరకంకణం కట్టించుకుని, వీరతిలకం దిద్దించుకొని మేనల్లుడు దండనాయకుడుతోడు రాగా యుద్ధభూమికి చేరిన వేళ - విజయం సిద్ధించకుంటే తీవ్ర అవమానం. ఇంత చావు చచ్చి గెలిచినా ఓడినా ఒకటే అంటారు జన సామాన్యం.

అయితే గెలుపు కూడా అంత సులభం కాదు.. కేసీఆర్ - టీఆర్ఎస్ - పై పీకల్లోతు కోపంగా ఉన్న పట్టభద్రులు. దుబ్బాకలో ఇప్పటికే దారుణ పరాభవంతో కూడిన ఓటమి,  జీహెచ్ఎంసీలో గెలిచినా చచ్చినంత అవమానం మూటగట్టుకొని - పట్టభద్రుల ఎమ్మెల్సీ- ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఓడిపోతే 2023 లో ఇంటి సామాన్లు తట్టాబుట్టాతో సహా సర్దుకొని ప్రగతి భవన్ వదిలేసి ఫామ్ హౌజ్ బాటపట్టడమే. అందుకే కేసీఆరే రంగంలోకి దిగారు.

కష్టాల్లోనే కుటుంబసభ్యుల కంటే "కావలసిన వాళ్లే"  ఆత్మీయులవుతారన్నట్లు సీఎం కేసీఆర్ మళ్లీ”ట్రబుల్ షూటర్” హరీష్ రావు సన్నిధిని కరుణా కటాక్ష వీక్షణాల కోసం  ఆశ్రయించాడు.

పట్టభద్రుల విధాన పరిషత్ (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో “హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్” లో గెలుపు బాధ్యతను, తాను ధనుంజయుడుగా (మనసులో) భావించే సోదరి సుతుడు మంత్రి హరీష్ రావు భుజస్కంధాలపై పెట్టారు. మంత్రి గంగుల కమలాకర్, మరో మంత్రి ప్రశాంత్ రెడ్డిని తోడిచ్చి సమరానికి పంపారు. వీరు ముగ్గురు తలో జిల్లాకు గెలుపు బాధ్యత వహించి సాధించాలనేది దేవరవారి ఆదేశం. అక్కడ పట్టభద్రులను పాదాలు పెట్టైనా ఒప్పించి గెలిపించాల్సి ఉంటుంది. ఆ తరవాత మెడబట్టి గెంటేయటానికి కుమారుడు “క త రా” - కూతురు కవిత ఉండనే ఉన్నారనేది జనసామాన్యంలో వినిపించే మాట

ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక గెలుపు బాధ్యతను అక్కడి మంత్రిపుంగవులకు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించారు.

ఈసారి పట్టభద్రుల్లో తప్పకుండా గెలవాలని, నిర్లక్ష్యం వహించే మంత్రుల తోడికలు వలిచేసే శిక్షలు సిద్ధంగా ఉంటాయని కేసీఆర్ హెచ్చరించినట్టు సమాచారం. అందుకే కీలక బాధ్యతలను కీలక మంత్రులకు కేటాయించారు.

అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుండి ఉద్యోగ ప్రకటనలు వేయని కేసీఆర్ ప్రభుత్వంపై, కుటుంబంపై, మంత్రి సామంతులపై, దండనాధులపై చివరకు అధికారులపై నిరుద్యోగులు, ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే పట్టభద్రుల్లో గులాబీపార్టీ గెలవడం అంత సులభం కాదంటున్నారు. మరి “కేసీఆర్ గారి - ఈ కచరా పాచిక ఈసారి పారుతుందో?  లేదో? చూడటానికి కొద్దిరోజులు నిరీక్షించాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: