కింజరాపు అచ్చెన్నాయుడు తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ప్రస్తుతం ఎన్నికల వేడి బాగా రాజుకుంటోంది. నామినేషన్ల దాఖలుకు మంగళవారం ఆఖరు రోజు. కాబట్టి ఎక్కడికక్కడ అభ్యర్ధులకు బీ ఫాంలు ఇచ్చేస్తున్నారు. అయితే ఎంతమంది బీఫాంలతో నామినేషన్లు వేస్తున్నా ఒక్క టికెట్ కూడా అచ్చెన్న ఫైనల్ చేయలేకపోతున్నారు. రాష్ట్రంలోని చాలా మున్సిపాలిటీల విషయాలు ఎలాగున్నా విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి లాంటి ప్రధానమైన కార్పొరేషన్లలో పోటీ చేసే అభ్యర్ధుల టికెట్లు కూడా చంద్రబాబునాయుడే ఫైనల్ చేస్తున్నారట. పోటీ చేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్ధుల వివరాల జాబితా అచ్చెన్నను దాటుకుని చంద్రబాబు దగ్గరకు వెళుతోందట.




ఉదాహరణకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) లో ఓ డివిజన్ లో పోటీ చేయాల్సిన అభ్యర్ధిని కూడా చంద్రబాబే ఫైనల్ చేయాలట. జీవీఎంసీలో పోటీచేసే కార్పొరేటర్ అభ్యర్ధిని స్ధానిక ఎంఎల్ఏ కానీ లేదా మాజీ ఎంఎల్ఏనో ఫైనల్ చేయలేరా ? పోనీ అచ్చెన్న కూడా ఉత్తరాంధ్రప్రాంతం నేతే కదా. పైగా అచ్చెన్న కాపురం ఉండేది కూడా వైజాగ్ లోనే. కాబట్టి కొద్దో గొప్పో వైజాగ్ నగరంలో పార్టీ పరిస్ధితిపై అచ్చెన్నకు కూడా అవగాహన ఉంటుంది కదా. కాబట్టి డివిజన్లో పోటీ చేసే అభ్యర్ధిని స్ధానికంగానే ఫైనల్ చేసేయచ్చు. కానీ జాబితాలో పేరుపై చంద్రబాబు ముద్రపడితే కానీ అభ్యర్ధికి బీఫారం అందటం లేదు. 98 డివిజన్లున్న వైజాగ్ కార్పొరేషన్లో ఇప్పటికి ఫైనల్ అయ్యింది 90 డివిజన్లే. వీళ్ళందరు చంద్రబాబు ఆమోదముద్రతోనే బీఫారం దక్కించుకున్నారట.




పోటీచేసే అభ్యర్ధుల ఎంపికలో క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అచ్చెన్న డమ్మీ అని అర్ధమైపోతోంది. పేరుకు మాత్రమే బీసీ నేత అచ్చెన్నను అధ్యక్షుడిని చేసినట్లు చంద్రబాబు పదే పదే చెప్పుకుంటుంటారు. కానీ డివిజన్లో పోటీ చేసే కార్పొరేటర్ ను కూడా చంద్రబాబే ఆమోదముద్ర వేయాలి. ఇదే విషయాన్ని వైసీపీలో చూస్తే రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డే ఫైనల్ చేసేస్తున్నారు. స్ధానికంగా ఉండే నేతలతో సమావేశమై అభ్యర్ధులను కూడా వెంటనే డిసైడ్ చేసేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అభ్యర్ధుల ఎంపికను జగన్మోహన్ రెడ్డి డీ సెంట్రలైజ్ చేసేశారు. ఎక్కడికక్కడ మున్సిపాలిటిలు, కార్పొరేషన్లలోనే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు, ఇన్చార్జీలే ఫైనల్ చేసుకుంటున్నారు. జగన్ కు కావాల్సింది ఫలితం మాత్రమే. మరి జగన్లో ఉన్న క్లారిటి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబులో ఎందుకు కనబడటం లేదు, రాష్ట్ర అధ్యక్షునిగా అచ్చెన్న ఎందుకున్నట్లు ?

మరింత సమాచారం తెలుసుకోండి: