తనకు లేని అధికారాలను చేతిలోకి తీసుకున్న స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు వరుసబెట్టి షాకులిస్తోంది. బుధవారం ఒక్కరోజే రెండు కేసుల విషయంలో నిమ్మగడ్డకు పెద్ద షాక్ తగిలింది. రీ నామినేషన్లకు అవకాశం ఇస్తు నాలుగు రోజుల క్రితం నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలు చెల్లదని తీర్పుచెప్పింది. అలాగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వాలంటీర్ల ట్యాబులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని కమీషనర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలను ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం వ్యతిరేకించినా నిమ్మగడ్డ లెక్కచేయలేదు. దాంతో కోర్టులో ప్రభుత్వం కేసు వేసింది. ఈ కేసును మూడు రోజుల పాటు విచారించిన కోర్టు చివరకు నిమ్మగడ్డ ఆదేశాలు చెల్లదని తీర్పుచెప్పింది.




వాలంటీర్లు ఎప్పటినుండో పనిచేస్తున్నారని వారినుండి మొబైల్, ట్యాబులు తీసేసుకుంటే లబ్దిదారులకు కమ్యూనికేషన్ గ్యాప్ రావటంతో పాటు వాళ్ళ రోజువారి డ్యూటీలు చేయలేరని ప్రభుత్వం వాదించింది. ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించటంతో  నిమ్మగడ్డకు షాక్ తప్పలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఫోన్లు, ట్యాబులుంటేనే జనాలు వాలంటీర్లను గుర్తుంచుకుంటారా ? అవుంటేనే వాళ్ళు ఓటర్లను ప్రభావితం చేస్తారా ? అవిలేకపోతే వాళ్ళు జనాలను ప్రభావితం చేయలేరా ? వైసీపీకి ఓట్లేయాలని అనుకునే జనాలు వాలంటీర్లను చూసి వేస్తారా ? లేకపోతే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమపథకాల వల్ల ఓట్లేస్తారా ?  ఇంతచిన్న లాజిక్కును కూడా నిమ్మగడ్డ మరచిపోయారు.




ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి తాను ఎలాంటి ఆదేశాలిచ్చినా చెల్లుబాటవుతుందని నిమ్మగడ్డ భావిస్తున్నట్లున్నారు. అందుకనే రేషన్ సరుకులను తీసుకెళ్ళే వాహనాలను అడ్డుకున్నారు. వాహనంపై జగన్ తదితరుల ఫొటోలను తీసేస్తేకానీ, వైసీపీ రంగులను మారిస్తే కానీ వాహనంలో రేషన్ పంపిణీని అనుమతించేది లేదని కూర్చున్నారు. దీన్ని ప్రభుత్వం కోర్టులో చాలెంజ్ చేసి తన వాదనలను వినిపించింది. రెండువైపుల వాదనలు విన్న తర్వాత నిమ్మగడ్డ ఆదేశాలను కోర్టు కొట్టేసింది. ఈమధ్య కాలంలో నిమ్మగడ్డ ఏకపక్షంగా జారీచేసిన అనేక ఆదేశాలను కోర్టులు కొట్టేస్తున్నాయి. మొత్తానికి లేని అధికారాలను చేతిలోకి తీసుకుంటే కోర్టులు చూస్తు కూర్చోవని నిమ్మగడ్డ గ్రహిస్తే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: