జర్నలిస్టులకు ఇళ్లు.. ఇళ్ల స్థలాలు.. ఈ అంశంపై తెలంగాణ సర్కారు అనేక హామీలు ఇచ్చింది. స్వయంగా కేసీఆర్ జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తామని కొన్నేళ్ల క్రితమే ప్రకటించారు. అంతే కాదు.. రేపే వెళ్లి మీకు కావాలసిన భూములు వెదకండి.. రాసిచ్చేస్తా అంటూ హామీలు గుప్పించేశారు. ఈ కబుర్లు చెప్పి దాదాపు నాలుగైదేళ్లు గడిచిపోతున్నా.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఏళ్లూ పూళ్లు గడుస్తున్నా తెలంగాణ వచ్చినా కూడా తెలంగాణ జర్నలిస్టులకు కనీసం ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయిందీ కేసీఆర్ సర్కారు.


తెలంగాణ ఉద్యమంలో ముందుడి కొట్లాడిన వారిలో జర్నలిస్టులూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి మీడియా సపోర్ట్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అయినా తెలంగాణ వచ్చాక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయం మాత్రం మరుగునపడే ఉంది. ఇప్పుడు మరోసారి కేటీఆర్ జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అంటున్నారు.  జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖంగా ఉన్నారని తెలిపారు.


దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ సహకారంతో ప్రెస్ అకాడమీ జర్నలిస్టులకు పలు విధాలుగా అండగా ఉంటోందన్నారు. కరోనా వేళ ప్రెస్ అకాడమీ జర్నలిస్టులకు అండగా నిలిచిందని..బాధిత జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20వేల రూపాయలు అందించిందని తెలిపారు. తెలంగాణ ప్రెస్ అకాడమీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల చెల్లింపు, జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు, హైదరాబాద్ లోని జర్నలిస్టులకు ఇళ్లు, జవహర్ లాల్ నెహ్రు సొసైటీ కి పేట్ బషీరాబాద్ లోని స్థలాన్ని కేటాయించడం, చిన్న పత్రికల గ్రేడింగ్ తో పాటు పలు సమస్యలపై కేటీఆర్ జర్నలిస్టు నాయకులతో చర్చించారు.


గతంలో కేసీఆర్  జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల గురించి మాట ఇచ్చి మరిచారు.. మరి ఇప్పుడు కేటీఆర్ కూడా మరోసారి మాట ఇచ్చారు. మరి కేటీఆర్ అయినా మాట నిలబెట్టుకుంటారా.. కేసీఆర్ తరహాలోనే ఇచ్చిన మాట గాలికి వదిలేస్తారా.. అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: