తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తేవ‌డ‌మే త‌న ప్ర‌ధాన ల‌క్ష్య‌మంటూ ఖ‌మ్మంలో జ‌రిగిన సంకల్ప స‌భ వేదిక‌పై నుంచి టీఆర్ ఎస్ పార్టీపై ఎక్కుపెట్టారు. అయితే ఎవ‌రో ఎక్కుపెట్టిన బాణాన్ని కాద‌ని... తాను ప్ర‌జ‌ల త‌రుపున ప్ర‌శ్నించే ప్ర‌జాబాణాన్ని అంటూ ఘ‌నంగా ప్ర‌క‌టించుకున్నారు. వాస్త‌వానికి తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేసిన దానికంటే కూడా బ‌హిరంగ స‌భ‌కు జ‌నం త‌ర‌లిరావ‌డం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అంతే స్థాయిలో ఆమె తొణుకు బెనుకు లేకుండా సూటిగా, స్ప‌ష్టంగా టీఆర్ ఎస్‌పై అనేక బాణాల‌ను వ‌ద‌ల‌డం గ‌మ‌నార్హం. పార్టీ పేరు ప్ర‌క‌టించ‌కుండా ఒక్క‌టే ఆమె స‌స్పెన్స్‌లో పెట్టినా.. విధానంలో మాత్రం చాలా క్లారిటీగా ఉన్న‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. ప్ర‌జా పోరాటాల‌తోనే.. ప్ర‌జా నాడిని ప‌ట్టుకునేందుకు త్వ‌ర‌లోనే పాద‌యాత్ర కూడా చేప‌డ‌తాన‌ని, దీక్ష‌ల్లో పాల్గొంటాన‌ని కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించి స్పీడ్‌ను కూడా చాటేశారు.  సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరుపై షర్మిల విమర్శలు గుప్పించారు.


అయితే సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేయ‌డం వ‌ల‌నే ప్ర‌జ‌ల‌ను, రాజ‌కీయ నేత‌ల‌ను త‌మ వైపున‌కు తిప్పుకోగ‌ల‌మ‌ని ష‌ర్మిల బ‌లంగా న‌మ్ముతున్న‌ట్లుగా క‌న‌బ‌డుతోంది. శుక్రవారం ఖమ్మంలో వేలాది మంది సాక్షిగా సంకల్ప సభను నిర్వహించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు.  ఈ నెల 15 నుంచి ఇందిరాపార్క్ వద్ద షర్మిల దీక్ష చేస్తున్నట్లు ఆమె అనుచరులు ప్రకటించారు. 15వ తేదీ నుంచి మూడురోజులు పాటు షర్మిల దీక్ష చేయనున్నారు. లక్షా 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ష‌ర్మిల‌ తెలంగాణ రాజ‌కీయాల్లోకి ఘ‌న‌మైన ఎంట్రీ ఇచ్చార‌నే చ‌ర్చ ఇప్పుడు ప్ర‌జ‌ల్లో జ‌రుగుతోంది.


ఇదిలా ఉండ‌గా  తెలంగాణలో షర్మిల పార్టీ సక్సెస్ కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు జోస్యం చెప్పారు. విజయమ్మ రాయలసీమ రాజ్యం రావాలనుకుంటున్నారని, అందుకే ఎపిలో కొడుకును, తెలంగాణలో షర్మిలను ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌లు కూడా కాంగ్రెస్ నుండి వచ్చినవారేనని గుర్తించాలని, ఇక్కడ ప్రశ్నించడానికి తామున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు షర్మిల ఎక్కడున్నారని ప్రశ్నించారు. తాను నిర్వహించే సభల్లో వైఎస్, జగన్‌ల గురించి ఆమె ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. షర్మిల పార్టీ తెలంగాణలో నిలబడలేదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: