సోషల్ మీడియా.. ఆధునిక యుగంలో ఇదో కనిపించని ఆయుధం. మొదట్లో దీన్ని అన్ని పార్టీలు లైట్ గా తీసుకున్నా ఇప్పుడు దీని ప్రభావం గుర్తిస్తున్నాయి. అందుకే ప్రత్యేక టీమ్‌లను నియమించుకుని తమకు అనుకూలంగా.. ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే సోషల్ మీడియా విషయంలో వైసీపీ ఒకింత ముందుందనే చెప్పొచ్చు. 2019లో జగన్ సీఎం అయ్యేందుకు ఆయన సోషల్ మీడియా వింగ్ చేసిన కృషి కూడా ఓ కారణమనే చెప్పాలి.

అయితే..  సోషల్ మీడియా వింగ్‌లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార పక్షం పెద్దగా ప్రచారం చేసుకునే అవకాశాలు తక్కువ. కానీ విపక్షానికి విమర్శించే అవకాశం ఎక్కువ. అందుకే ఇప్పుడు విపక్ష సోషల్ మీడియాను జగన్ టీమ్ టార్గెట్ చేస్తోంది. ప్రత్యేకించి టీడీపీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారిని టార్గెట్ చేస్తోంది. తాజాగా తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ సోషల్‌ మీడియా దుష్ప్రచారం చేస్తోందంటూ వైసీపీ ప్రధాన కార్యద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. సాహో చంద్రబాబు ఫేస్‌బుక్ పేజీ నారా లోకేష్‌ స్వీయ పర్యవేక్షణలో న‌డుస్తుంద‌ని, కావాల‌నే వైయ‌స్ఆర్ సీపీపై దుష్ప్రచారం చేస్తున్నార‌ని  వైసీపీ నేతలు డీజీపీ దృష్టికి తీ‌సుకెళ్లారు.  

ఆ లేఖలో వారు ఏం చెప్పారంటే.. “ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వీయ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వేదికగా సాహో చంద్రబాబు పేరుతో వై.యస్.ఆర్.సి.పి. పార్టీ నాయకులైన మంత్రిపెద్దిరెడ్డి,  ఎంపీ వేమిరెడ్డి, కృష్ణపట్నం నుంచి సత్యవేడు వరకు, సెజ్ కోసం భూములు లాక్కుంటారు. మేము ఏమి చేయలేము. ఓడిపోతే వెనక్కి తగ్గుతారు” అని గూడూరు, సూళ్ళురుపేట, సత్యవేడు శాసనసభ్యులు తమ ప్రధాన అనుచరులకు చెబుతునట్లు తప్పుడు కథ‌నాలు ప్రచురించారని ఫిర్యాదు చేశారు.  అసలే అధికార పార్టీ.. మరి వారి ఫిర్యాదుకు పోలీసులు ఆగమేఘాల మీద కదలకుండా ఉంటారా..?


మరింత సమాచారం తెలుసుకోండి: