ఎట్టకేలకు తెలంగాణ సీఎం కేసీఆర్ కల నెరవేరింది. రాష్ట్రాన్ని కొత్త జోన్లుగా విభజిస్తూ ఆయన ఎప్పుడో తీసుకున్న నిర్ణయానికి ఎట్టకేలకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం తెలుపుతూ ఎట్టకేలకు కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమాన ఉద్యోగ అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఏపీ ఉన్న సమయంలో మొత్తం ఆరు జోన్లుగా ఉండేవి. అందులో 4 ఏపీ జిల్లాలకు చెందినవి కాగా.. 5,6 జోన్లు తెలంగాణకు చెందినవి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జోన్ల వ్యవస్థను కేసీఆర్ సర్కారు పునర్వవస్థీకరించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన జోనల్‌ విధానాన్ని రూపొందించింది. దాదాపు మూడేళ్ల క్రితమే ఈ కొత్త జోన్లను రూపొందించినా ఇన్నాళ్లూ కేంద్రం దాన్ని ఆమోదించలేదు. చివరకు ఎట్టకేలకు రాష్ట్రపతి..  తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఆర్డర్‌-2018కి ఆమోదముద్ర వేశారు. ఈ కొత్త జోన్ల వ్యవస్థ పోలీసు మినహాయించి మిగిలిన అన్ని విభాగాలకూ వర్తిస్తుంది.

మొదట 31 జిల్లాలకు జోనల్‌ విధానాన్ని రూపొందించారు. దానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 2018లో ములుగు, నారాయణపేట జిల్లాలు ఏర్పడ్డాయి. అందుకే  మొత్తం 33 జిల్లాల పరిధిలో జోనల్‌ విధానానికి ఆమోదం కోరుతూ 2019లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పుడు కేంద్రం ఆమోదించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త జోనల్‌ విధానంతో ఉద్యోగ నియామకాలే జరగలేదు.

విద్య, ఉద్యోగాలు అన్నీ పాత విధానమైన రెండు జోన్లు, 10 జిల్లాల ప్రకారంగానే చేపడుతున్నారు. ఇప్పుడు కొత్త జోనల్‌ విధానం ఆమోదంతో కొత్త ఉద్యోగ నియామకాలు కొత్త జోన్ల ప్రకారమే జరుగుతాయి. ఈ కొత్త జోన్ల ద్వారా  హైదరాబాద్‌, రంగారెడ్డి తదితర జిల్లాల మాదిరే ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ములుగు, భూపాలపల్లి సహా అన్ని జిల్లాల్లోని వారికి ఉద్యోగాలు దక్కుతాయి. విద్యాపరంగానూ అన్ని జిల్లాలకు ప్రవేశాలు దక్కుతాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: