తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరిపైనా ఒత్తిడి పెరిగిపోతోంది. 18 ఏళ్ళు నిండినవారు కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని కేంద్ర ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటినుండి వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలనుండి విపరీతమైన డిమాండ్లు పెరిగిపోతున్నాయి. 45-60 ఏళ్ళమధ్య వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారి అవసరాలకే వ్యాక్సిన్లు అందటంలేదు. వీళ్ళకి అదనంగా 18 ఏళ్ళు నిండినవారికి కూడా వ్యాక్సిన్లు అనేటప్పటికి ఫార్మా కంపెనీల మీదే కాకుండా కేంద్రప్రభుత్వం మీదకూడా ఒత్తిడి పెరిగిపోయింది. ఈ నేపధ్యంలోనే తాము తయారుచేస్తున్న కోవీషీల్డ్ వ్యాక్సిన ధరను సీరమ్ కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. కేంద్రానికి 150 రూపాయలు, రాష్ట్రాలకు రు. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రు. 600 అంటు ధరలను ప్రకటించింది. అప్పటినుండి దేశవ్యాప్తంగ గోల మొదలైపోయింది.




వ్యాక్సిన్ ధరల్లో తేడాలపై దేశంలో బాగా ఆరోపణలు, విమర్శలు పెరిగిపోతున్నాయి. వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళకు ఫ్రీగా వేయకుండా ధర పెట్టడం ఏమిటంటు మండిపోతున్నారు. వ్యాక్సిన్ కోసమని బడ్జెట్లో రు. 35 వేల కోట్లు కేటాయించిన కేంద్రం మళ్ళీ ఇపుడు ధరలు నిర్ణయించటంపై ప్రతిపక్షాలన్నీ తీవ్ర అభ్యంతరాలు చెబుతున్నాయి. ఈ నేపద్యంలోనే తమ రాష్ట్రాల్లో వయసుతో సంబంధంలేకుండా అందరికీ వ్యాక్సిన్లను ఉచితంగా వేయిస్తామంటు ప్రకటిచటం మొదలుపెట్టాయి.  మొదటగా అస్సాం చేసిన ప్రకటనను ఇపుడు దాదాపు 12 రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కేరళ, సిక్కిం, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ లాంటి రాష్ట్రాలు ఉచిత వ్యాక్సిన్ను ప్రకటించాయి.




దాంతో కేసీయార్, జగన్మోహన్ రెడ్డిపైనా అనివార్యంగా ఒత్తిడి పెరిగిపోతోంది. తెలుగురాష్ట్రాల్లో కూడా అందరికీ ఉచిత వ్యాక్సిన్లు వేయించాలంటు డిమాండ్లు పెరిగిపోతున్నాయి. వ్యాక్సిన్ల ధరల తేడాపై ఇప్పటికే తెలంగాణాలో కేటీయార్ తన ట్విట్టర్లో నిరసన ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటికే అవసరానికి సరిపడా వ్యాక్సిన్లు సరఫరా అవటంలేదు. అలాంటిది 18 ఏళ్ళు నిండిన వారికి కూడా వ్యాక్సిన్లంటే మొదటికే మోసం వచ్చేస్తుందేమో తెలీటంలేదు. ఏదేమైనా మిగిలిన రాష్ట్రాల నిర్ణయాల తర్వాత తెలుగురాష్ట్రాల్లో కూడా  ఉచితంపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: