వ్యాక్సిన్ మీరు మా దగ్గర కొనుక్కుని మీ ప్రజలకు ఇవ్వండి... ఇది కేంద్రం చేసిన ప్రకటన. ఈ ప్రకటన తర్వాత చాలా రాష్ట్రాలకు గుటక పడలేదు. చాలా మంది సీఎంలు ప్రధాని మోడీని తలుచుకుని ఊగిపోయారు. చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రమైనా సరే వ్యాక్సిన్ అందరికి ఇవ్వాలి అంటే... కనీసం రెండు వేల కోట్లు కావాల్సి ఉంటుంది. దీన్ని భరించే శక్తి ఇప్పటికిప్పుడు రాష్ట్రాలకు లేదు అనే మాట వాస్తవం. ఏపీ, తెలంగాణా, ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశా వంటి రాష్ట్రాలు ఆర్ధికంగా ఏమీ అనుకున్న విధంగా బలంగా లేవు.

ఏపీ అయితే అప్పుల మీదనే నడుస్తుంది. ఇప్పుడు 2 వేల కోట్లు ఖర్చు చెయ్యాలి అంటే జగన్ సర్కార్ కు కష్టమే. ముందు చెప్పిన విధంగా మీరు సగం మేము సగం అని ముందుకు వెళ్ళినా బాగానే ఉంటుంది. కాని మొత్తం మీరే అని రాష్ట్రాల మీద భారం వేసారు. ఒకే దేశం ఒకే పన్ను అన్నప్పుడు ఒకే దేశం ఒకే వ్యాక్సిన్ రేటు అని కూడా కేంద్రం మాట్లాడటం లేదు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉంది. ఒకపక్క ఆక్సీజన్ దెబ్బకు రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ తరుణంలో ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి వ్యాక్సిన్ వేయాలి.

వ్యాక్సిన్ వేయాలి అంటే దాన్ని కొనుక్కోవాలి... ప్రజలు అందరూ కొనుక్కుంటారా...? అన్ని రాష్ట్రాలు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తాయా...? అమ్మ ఒడి ఇచ్చారు కదా వ్యాక్సిన్ కూడా ఇవ్వండి అంటూ కొందరు ఏపీలో మాట్లాడుతున్నారు. ఆసరా పెన్షన్ లు ఇచ్చిన వాళ్ళు వ్యాక్సిన్ ఇవ్వలేరా అని తెలంగాణాలో మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు అనడం కాదు గాని టీకా కార్యక్రమం వివక్షపూరితంగానే ఉందనే మాట వాస్తవం. ఉత్తరాది రాష్ట్రాలకు ఒక విధంగా దక్షినాది రాష్ట్రాలకు మరో విధంగా వ్యవహరించే కేంద్రం... వ్యాక్సిన్ విషయంలో కూడా అదే చేస్తుంది.

వ్యాక్సిన్ ధరలు మార్కెట్ లో పెరుగుతున్నాయి. ప్రభుత్వం 400 కు అమ్మితే ప్రైవేట్ రంగం ఎంతకు అమ్మాలి...? వెయ్యికి అమ్మినా ఆశ్చర్యం లేదు.   జాతీయ మీడియా కూడా ఇదే చెప్పింది.  ఒక్క రోజు సినిమా హడావుడికే బ్లాక్ టికెట్ లు దొరికే మన దేశంలో ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ విషయంలో ఎంత బ్లాక్ మార్కెట్ ఉండవచ్చు. కరోనా ఔషధాలు, మాస్క్ లకే బ్లాక్ నడుస్తుంది. వ్యాక్సిన్ కూడా బ్లాక్ నడిస్తే...? ఆ వ్యతిరేకత వెళ్ళేది మోడీ మీదకే. ఇప్పటికే ఏమీ చేయకుండా కబుర్లు చెప్తారని కొందరు విపక్షాల నాయకులు అంటున్నారు.

అది ప్రజలు కూడా అనే పరిస్థితి రావొచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కేంద్రం గనుక రాష్ట్రాలకు అండగా నిలవకపోతే బిజేపి సిఎంలు కూడా మోడీపై ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ కోపంగా ఉన్నాయి, భవిష్యత్తులో మిగిలిన రాష్ట్రాలు కూడా ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏది చెప్పినా వినసొంపుగా చెప్పే మోడీ... వ్యాక్సిన్ విషయంలో కూడా అలాగే చెప్పారు. కేంద్రానికి ఆదాయం ఏమీ తగ్గలేదు. రాష్ట్రాలే ఇబ్బంది పడుతున్నాయి. దీనిపై మొండిగా ముందుకు వెళ్ళకుండా ఒకే దేశ ప్రజలు కాబట్టి వివక్ష లేకుండా వెళ్తే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: