కోవిడ్ సెకండ్ వేవ్ అన్నివ‌ర్గాల‌ను, అన్ని రంగాల‌ను సునామీలా తాకి వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి అమెరికా, ఐరోపా దేశాల్లో దీని తీవ్ర‌త అధికంగా ఉన్న స‌మ‌యంలో భార‌త్‌పై దీని ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌ద‌ని అంద‌రూ భావించారు. కానీ వాస్త‌వం దీనికి పూర్తి భిన్నంగా మారింది. ప్ర‌స్తుతం ఆదేశాల్లో శ‌ర‌వేగంగా వ్యాక్సినేష‌న్ పూర్తి చేస్తూ క‌రోనా బారినుండి ప‌రిస్థితులను అదుపులోకి తెచ్చుకుంటుండ‌గా.. ఇండియాలో అధిక జ‌నాభాకు తోడు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ నెమ్మ‌దిగా సాగుతుండ‌టంతో ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ప్ర‌స్తుతం భార‌త్ లో దీని తీవ్ర‌త ఏ స్థాయిలో ఉందంటే పలు దేశాలు భార‌త్ నుంచి త‌మ దేశాల‌కు ఎవ‌రినీ అనుమ‌తించ‌కుండా క‌ఠిన‌మైన ఆంక్ష‌లు అమ‌ల్లోకి తెచ్చాయి. వైర‌స్ వ్యాప్తి దీర్ఘ‌కాలం ఉంటే భార‌త్‌లో ప్ర‌మాద‌క‌ర‌మైన కొత్త వేరియంట్ లు పుట్టుకొచ్చే ప్ర‌మాదం ఉంద‌న్న వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌స్తున్నాయి.

దేశంలోని  ప‌లు ప‌ట్ట‌ణాల్లో ఆక్సిజ‌న్ లేక వైద్యం అంద‌క పెద్ద సంఖ్య‌లో జ‌నం చ‌నిపోతున్నార‌ని వ‌స్తున్న వార్త‌లు అంత‌ర్జాతీయ మీడియాలో శృతిమించి ప్ర‌చార‌మ‌వుతుండ‌టంతో ఇక్క‌డ ఉన్న త‌మ దేశ పౌరుల ఆరోగ్య భ‌ద్ర‌త గురించి ప‌లు దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. మ‌రోప‌క్క భార‌త్‌ను ఆదుకునేందుకు అగ్రరాజ్యం అమెరికాతో స‌హా ప‌లు దేశాలు త‌మ స‌హాయాన్ని అందించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాయి.  ఇదిలా ఉండ‌గా క్రికెట్‌ను మ‌తంగా భావించే  భార‌త్‌లో ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపును సాధించిన ఐపీఎల్ పోటీలు కూడా ఈ కోవిడ్ కార‌ణంగా అర్ధంత‌రంగా ర‌ద్ద‌య్యాయి. అంతేకాదు.. ఐపీఎల్ లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వ‌చ్చిన క్రికెట‌ర్లు ఇప్పుడు ప‌లు దేశాల‌కు విమాన స‌ర్వీసులు ర‌ద్దుకావ‌డం, ఆయా దేశాల ఆంక్ష‌ల కార‌ణంగా ఇక్క‌డే ఉండిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఆస్ట్రేలియా కూడా ఇండియా నుంచి ఎవ‌రైనా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో త‌మ‌దేశానికి వ‌స్తే వారికి భారీ జ‌రిమానా, జైలు శిక్ష త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ఆస్ట్రేలియా నుంచి వ‌చ్చిన  మాజీ ఆటగాడు మైకేల్ స్లాటర్ ఆ దేశ ప్ర‌భుత్వంపై  ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ రద్దవడంతో భార‌త్ లో ఉండిపోయిన‌ ఆస్ట్రేలియా ఆటగాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంద‌ని అత‌డు ఆక్రోశం వెలిబుచ్చాడు. భారత్‌ నుంచి వచ్చేవారిపై మే 15 వరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఈ సీజన్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన మైకేల్ స్లాటర్, ఆసీస్ ఆటగాళ్లు నేరుగా ఆస్ట్రేలియా వెళ్లడం కుదరడం లేదు. భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లి అక్కణ్నంచి ఆస్ట్రేలియా వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిస‌న్‌పై స్లాటర్ విరుచుకుప‌డ్డాడు. `మాన‌వ సంక్షోభం గురించి ఒక దేశ ప్రధానికి చెప్పాల్సి రావ‌డం ఆశ్చర్యంగా ఉంది. భారత్‌లో ఉన్న ప్రతీ ఆస్ట్రేలియ‌న్ భ‌యంలో ఉన్నాడన్నది నిజం. కావాలంటే మీరు మీ ప్రైవేట్ జెట్‌లో వెళ్లి అక్కడి వీధుల్లో ఉన్న శ‌వాల‌ను చూడండి. ఈ విషయంలో మీతో డిబేట్‌ చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటానని ట్వీట్ చేశాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: