మంత్రి వర్గం నుంచి తొలగించబడిన  ఈటల రాజేందర్‌కు ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క దారి.. కేసీఆర్ పై పోరాటం. లేకుంటే ఆయన కూడా గతంలో కేసీఆర్ చేత గెంటివేయబడిన జాబితాలో మరో నాయకుడిగా మిగిలిపోతారు. కానీ.. తాను అలా మిగిలిపోయే వాడిని కాదని ఈటల తనపై విచారణ ప్రారంభమైన తొలి రోజే తేల్చి చెప్పారు. చావనైనా చస్తాను కానీ.. ఆత్మ గౌరవం మాత్రం కోల్పోనని కుండబద్దలు కొట్టారు. అక్కడి వరకూ బాగానే ఉంది. కానీ. ఆ తర్వాత ఈటల వ్యవహారంలో జోరు కనిపించడం లేదు.

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ఇంకా తర్జన భర్జనలు పడుతూనే ఉన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా..టిఆర్ఎస్ కు రాజీనామా చేయవద్దని ఆయన అనుచరులు కొందరు చెబుతుండడమే  కారణంగా  భావిస్తున్నారు. ఈటల రాజేందర్ మాత్రం సరైన సమయంలో సరైన నిర్ణయం అని అంటున్నారు. నాలుగైదు రోజులుగా వేలాది మంది ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో మాట్లాడానంటున్నారు.

తన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఆయన ఇంకా ఏ నిర్ణయానికీ రాలేకపోతున్నారు. అయితే కేసీఆర్ వంటి బలమైన నాయకుడిని ఎదుర్కొనేటప్పుడు  ఆ మాత్రం ముందూ వెనుకా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో జోరు తగ్గిందన్న భావన రానీయకూడదు. ఈటల ఇటీవల ప్రెస్ మీట్లు పరిశీలిస్తే.. ఎందుకో అంతగా ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. దూకుడు స్వభావం ఏమాత్రం లేదు.

జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం ఎంత అవసరమో.. వేగంగా నిర్ణయం తీసుకోవడం కూడా అంతే అవసరం అన్న సంగతి ఈటల గుర్తించడం లేదేమో అనిపిస్తోంది. ఈ మాత్రం గ్యాప్‌లో కేసీఆర్ ఈటల అనుచర వర్గాన్ని ఆయనకు దూరం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. అధికార వర్గంలోనూ ఆయన మనుషులుగా పేరున్న అందరికీ షాకులు ఇస్తున్నారు. ఈటల ఇలా ఇంకా మీనమేషాలు లెక్కిస్తే కేసీఆర్ ఆయన్ను సులభంగా అణగదొక్కేయడం  ఖాయం అంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: