అవును సకాలంలో ఆసుపత్రులకు ఆక్సిజన్ కంటైనర్లు చేరుకోవాలన్నా, ఆసుపత్రుల్లోని ప్లాంట్లలో ఆక్సిజన్ను సకాలంలో నింపి రోగులప్రాణాలను కాపాడాలంటే గ్రీన్ క్యారిడార్ ఏర్పాటు చేయటం ఒక్కటే మార్గమని నిపుణులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. సోమవారం రాత్రి తిరుపతి రుయా ఆసుపత్రికి తమిళనాడులోని శ్రీపెరంబదూరు నుండి బయలుదేరిన ఆక్సిజన్ ట్యంకర్ సకాలంలో చేరుకోని కారణంగానే 11 మంది చనిపోయారు. హైదరాబాద్ లోని కోఠి ఆసుపత్రిలో ముగ్గురు చనిపోయారన్నా, కర్నాటక, మహారాష్ట్ర, భువనేశ్వర్ లో కూడా రోగులు ఆక్సిజన్ అందక చనిపోవటమే ప్రధాన కారణం. పై రాష్ట్రాల్లోని ఆసుపత్రులకు ఆక్సిజన్ను నింపటానికి ఉత్పత్తిప్లాంట్ల నుండి కంటైనర్లు బయలుదేరాయి.




అయితే చేరుకోవాల్సిన ఆసుపత్రులకు సకాలంలో చేరుకోకపోవటమే అసలైన కారణం. హైదరాబాద్, మహారాష్ట్ర, భువనేశ్వర్ ఆసుపత్రులకు సకాలంలో చేరుకోవాల్సిన కంటైనర్లు దారి తప్పటం వల్లే సకాలంలో ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా కాలేదు. అంటే మనకు అర్ధమవుతున్నదేమిటి అవసరమైనంత ఆక్సిజన్ ఉత్పత్తి-సరఫరా కూడా జరుగుతోంది.  కాకపోతే సకాలంలో అందని కారణంగానే సమస్యలు వచ్చాయి. ఇపుడు శ్రీపెరంబదూరులో బయలుదేరిన ట్యాంకర్ కూడా దారి తప్పిందేమో మనకు తెలీదు. మరి ఆక్సిజన్ ట్యాంకర్లు సకాలంలో దారితప్పకుండా డెలివరీపాయింట్ కు చేరాలంటే మార్గమేంటి ? ఇక్కడే నిపుణులు హెచ్చరిస్తున్న గ్రీన్ క్యారిడార్ వ్యవస్ధ ప్రాధాన్యత అర్ధమవుతోంది. ఏవేవో రాష్ట్రాల నుండి ఇంకో రాష్ట్రానికి ఆక్సిజన్ను తీసుకుని బయలుదేరిన ట్యాంకర్లు సకాలంలో చేరాలంటే అందుకు రాష్ట్రాల మధ్య సమన్వయం చాలా అవసరం.




రాష్ట్రాల మధ్య సమన్వయం గ్రీన్ క్యారిడార్ ద్వారా మాత్రమే సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ క్యారిడార్ అంటే ఏమిటంటే ఆక్సిజన్ ట్యాంకర్ బయలుదేరిన ప్రాంతంనుండి డెలవరీ పాయింట్ వరకు మధ్య ఉండే రూటులో ట్యాంకర్ ఎలాంటి ఆటంకాలు లేకుండా చేరుకోవటానికి ఏర్పాట్లు చేయటమే. బయలుదేరిన రాష్ట్రం నుండి చేరుకోవాల్సిన పాయింట్ వరకు మధ్యలోని రోడ్లలో కంటైనర్ కు ట్రాఫిక్ క్లియరెన్స్ కోసమని పోలీసు అధికారులు పైలెట్ గా పనిచేయాలి. ముఖ్యమంత్రులు, ప్రముఖుల ప్రయాణం విషయంలో ట్రాఫిక్ ను ఎలా క్లియర్ చేస్తారో అలాగన్నమాట. కంటైనర్ ఏ జిల్లాలో ప్రయాణిస్తుంటే ఆ జిల్లాలో రూటుమ్యాపుతో పాటు పైలెట్ గా పనిచేయాలి. చివరగా డెలివరీపాయింట్ జిల్లాలో కూడా ఇలాగే పోలీసుల ఎస్కార్ట్ గా ఉంటే సకాలంలో డెలివరీ చేయటమే కాకుండా దారితప్పే సమస్యే తలెత్తదు. ఇలాంటి ఏర్పాట్లనే గ్రీన్ క్యారిడార్ అంటారు. ఈ విషయంలో ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోకపోతే మరిన్ని అనర్ధాలు జరగటం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: