ఏపీ ప్ర‌జ‌లు ఇప్పుడు క‌ష్ట‌కాలంలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం త‌న సాధ్య‌మైనంత‌ మేర‌కు వైద్య స‌దుపాయాల‌ను అందిస్తోంది. అయితే వైర‌స్ తీవ్ర‌త అంత‌కంత‌కూ పెరిగిపోతున్న‌ స‌మ‌యంలో ప్ర‌భుత్వ చ‌ర్య‌లు స‌రిపోవ‌డంలేదన్న విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.రాష్ట్రంలో స‌రిప‌డా వ్యాక్సిన్లు అందుబాటులో లేని కార‌ణంగా ఉన్న కొద్దిపాటి వ్యాక్సిన్ల కోసం వైద్య కేంద్రాల వ‌ద్ద జ‌నం భారీ సంఖ్య‌లో క్యూ క‌డుతున్నారు. దీంతో అక్క‌డి ర‌ద్దీ కారణంగా కోవిడ్ వ్యాప్తి మ‌రింత పెరుగుతుంద‌న్న భ‌యంతో ఏపీ ప్ర‌భుత్వం తాత్కాలికంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను నిలిపివేసింది. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయింపులు, సరఫరాపై సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి తాజాగా లేఖ కూడా రాశారు. కొవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని సీఎం జగన్ త‌న‌ లేఖలో ప్ర‌ధానికి విజ్ఞప్తి చేశారు. 20 ఆక్సిజన్ ట్యాంకర్లను ఏపీకి మంజూరు చేయాలని కోరారు. కోవ్యాక్సిన్ ను భారీగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడిందని, తయారీ దారులు ముందుకు వస్తే, ఆ ఔష‌ధాన్ని ఉత్పత్తి చేసేందుకు వారికి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ చేసేలా చర్యలు తీసుకోవాలని జగన్ తన లేఖలో సూచించారు.

ఇదిలా ఉండ‌గా ఇలాంటి ఆప‌త్కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర‌ ప్ర‌తినిధులుగా కీల‌క పాత్ర పోషించాల్సిన‌ రాష్ట్ర‌ బీజేపీ నేతలు ఎక్కడా కాన‌రాక‌పోవ‌డంపై విస్మ‌య వ్య‌క్త‌మ‌వుతోంది. కరోనా సంక్షోభంలో ప్ర‌జ‌ల స్థైర్యం దెబ్బ‌తినకుండా అందుబాటులో ఉండ‌టం గాని, కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి అందాల్సిన సాయానికి సంబంధించి క‌నీస ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగానీ ఎక్కడా కనబడటంలేద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏవైనా ఎన్నిక‌లొస్తే చాలు..ఇక రాష్ట్ర రాజ‌కీయాల్లో త‌మ‌దే ప్ర‌ధాన పాత్ర అని, భవిష్య‌త్తులో అధికారంలోకి వ‌చ్చేది తామేన‌ని భారీ ఉప‌న్యాసాలిచ్చే నాయ‌కులెవ‌రూ ప్ర‌స్తుతం ప‌త్తా లేరు.

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల సమయంలో కేంద్రం నుండి అది తెప్పిస్తామని, ఇది తెప్పిస్తామని ఈ  నేత‌లు బోలెడు హామీలిచ్చారు. నిజానికి ఇలాంటి సంక్షోభ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిస్తే ఆ పార్టీ ప‌ట్ల ఆద‌ర‌ణ పెరిగే అవ‌కాశ‌ముంది కూడా. కేంద్రాన్ని మెప్పించి, ఒప్పించి అవ‌స‌ర‌మైన మేర‌కు టీకాలు, ఆక్సిజన్ తెప్పించవచ్చు. ఇత‌ర రాష్ట్రాల బీజేపీ నేత‌లు ఈ విధంగా కృషి చేస్తున్నట్టు వార్త‌లు వ‌స్తున్నా మ‌న రాష్ట్ర బీజేపీ నేత‌లు మాత్రం గ‌డప దాటి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఇక టీవీ డిబేట్ల‌లో ఊద‌ర‌గొట్టే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, పార్టీ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర నేత విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి వంటి నాయ‌కులు అప్ప‌డప్పుడూ ట్విట్ట‌ర్‌లో రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి వంటివారు ఏమిచేస్తున్నారో ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి. మ‌రి ఆ పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఏవిధంగా న‌మ్మ‌కం ఏర్ప‌డుతుందో ఆ దేవుడికి మాత్ర‌మే తెలియాల‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: