దేశవ్యాప్త రాజ‌కీయాల్లో ఇప్ప‌టిదాకా త‌మ‌దైన శైలి, వ్యూహాల‌తో అప్ర‌తిహ‌త విజ‌యాలు సాధిస్తూ వ‌స్తున్న మోదీషా ద్వ‌యానికి బెంగాల్‌లో ఎదురైన వ్య‌తిరేక‌ ఫ‌లితాలు ఇప్ప‌టికీ మింగుడుప‌డ‌టం లేద‌న్న విశ్లేష‌ణ‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతున్నాయి. ఇందుకు మ‌మ‌తాబెన‌ర్జీ ప్ర‌భుత్వాన్ని తొలిరోజు నుంచే ఇరుకున‌ పెట్టేలా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం చేస్తున్న ప‌దునైన విమ‌ర్శ‌లు, ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ చేస్తున్న వ్యాఖ్య‌లు, తీసుకుంటున్న చ‌ర్య‌లు కార‌ణం. మ‌మ‌తను ప్ర‌మాణ స్వీకార స‌భ‌లో అభినందిస్తూనే రాష్ట్రంలో ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం విప‌క్ష నేత‌ల‌పై, కార్య‌క‌ర్త‌ల‌పై జ‌రుగుతున్న హింసాకాండను త‌క్ష‌ణ‌మే అరిక‌ట్టాల‌ని గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్క‌ర్ ఆమెకు సూచించిన విష‌యం తెలిసిందే. నిజానికి బెంగాల్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌లు దుర‌దృష్ట‌క‌ర‌మైన‌వే. వాటినెవ‌రూ స‌మ‌ర్థించ‌రు. అయితే అవి ప్ర‌ణాళిక ప్ర‌కారం జ‌రిగిన‌వి కావ‌ని, స్థానిక ప‌రిస్థితులనుబ‌ట్టి తాత్కాలిక ఆవేశంలో జ‌రిగిన‌వ‌ని, రాజ‌కీయ దురుద్దేశంతోనే వాటిని మ‌రింత పెద్ద‌విగా చేసి చూపేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌న్న‌ది మ‌మ‌త పార్టీ వ‌ర్గాల వాద‌న‌. అందుకే గ‌వ‌ర్న‌ర్ సూచ‌న‌కు స్పంద‌న‌గా మ‌మ‌త మాట్లాడుతూ తాను ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత‌నే పాల‌న త‌మ చేతుల్లోకి వ‌చ్చింద‌న్న విష‌యం గుర్తుంచుకోవాల‌న్నారు. అప్ప‌టిదాకా జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌కు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ మాత్ర‌మే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని కాస్త క‌టువుగానే వ్యాఖ్యానించారు.
 
బెంగాల్‌లో తృణ‌మూల్ గెలుపు దేశ‌వ్యాప్తంగా విప‌క్షాలు ఐక్యంగా పోరాడే ప్ర‌య‌త్నాల‌కు ఊపిరిపోయ‌డంతోపాటు, స్వ‌యంగా మ‌మ‌త తానే ఢిల్లీ దాష్టీకంపై యుద్ధానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం మోదీ ప్ర‌భుత్వానికి కొరుకుడుప‌డ‌టం లేద‌ని చెప్పాలి. అంతేకాదు.. బెంగాల్ గెలుపును మోదీ షా ద్వ‌యం చాలా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. కేంద్రం త‌మ స‌ర్వ‌శ‌క్తులూ వినియోగించింది. ఆ రాష్ట్ర ఎన్నిక‌ల్లో గెలుపు కోసం దేశం మొత్తాన్ని క‌రోనా వైర‌స్ బారిన ప‌డేసింద‌నే విమ‌ర్శ‌ల‌ను సైతం ఎదుర్కొంటోంది. అయినా ఫ‌లితం ద‌క్క‌క‌పోవ‌డం మోదీ అహాన్ని గ‌ట్టిగానే దెబ్బ తీసింద‌ని బీజేపీలోనే అంత‌ర్గ‌త చ‌ర్చ న‌డుస్తోంది. బెంగాల్‌లో ఎన్నిక‌ల‌ముందు బీజేపీ "ఆక‌ర్ష్‌"కు లోనై మ‌మ‌త పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్లిన తృణ‌మూల్ నేత‌ల్లో ప‌లువురు ఇప్పుడు  మ‌ర‌లా సొంత పార్టీవైపు చూస్తున్నార‌న్న వార్త‌లు కూడా బీజేపీ అధిష్ఠానానికి కాక పుట్టిస్తున్నాయి.
 
అందుకే గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా బెంగాల్‌లో బీజేపీ త‌ర‌పున గెలిచిన ఎమ్మెల్యేలు 77 మందికి కేంద్ర బ‌ల‌గాలతో ర‌క్ష‌ణ క‌ల్పించ‌నున్న‌ట్టు కేంద్ర హోం శాఖ‌ ప్ర‌క‌టించింది. సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్ఎఫ్ బ‌లగాలు వీరి ర‌క్ష‌ణ బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌నున్నాయి. వీరిలో 61 మందికి ఎక్స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌, మిగిలిన‌వారికి వై కేట‌గిరీ భ‌ద్ర‌త ఉండ‌నుంది. ఇక ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ప్ర‌క‌టించిన సువేందు అధికారికి ఇప్ప‌టికే జెడ్ కేట‌గిరీ ర‌క్ష‌ణను కేంద్రం క‌ల్పించిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. రాష్ట్రంలో విప‌క్ష నేత‌లపై హింసాకాండ జ‌రిగిన కూచ్‌బీహార్ ప్రాంతంలో మే 13న తాను ప‌ర్య‌టించ‌నున్న‌ట్టు గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్క‌ర్ ప్ర‌క‌టించ‌డం కూడా రాజ‌కీయంగా వేడి పుట్టిస్తోంది. మొత్తంమీద తాజా ప‌రిణామాలు మ‌మ‌త ప్ర‌భుత్వంపై కేంద్రం భ‌విష్య‌త్తులో అనుస‌రించ‌బోయే వైఖ‌రినే స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంటున్నాయి. అయితే మ‌మ‌త కూడా ఇలాంటివాటికి ఏమాత్రం వెర‌వ‌ని మొండిఘ‌ట‌మే..పోరాటానికి స‌దాసిద్దంగా ఉండే రాజ‌కీయ యోధురాలే కావ‌డంతో బెంగాల్ ప‌రిణామాలు దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ క‌లిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: