ఏపీలో ఎన్440-కె వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. వైరస్ వేరియంట్ పై ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. ఆయన చేస్తున్న దుష్ప్రచారానికి కొంతమంది మీడియా అధినేతలు వత్తాసు పలుకుతున్నారంటూ వారిని కూడా విమర్శించారు. ఈ దశలో ఇతర రాష్ట్రాలు ఏపీపై ట్రావెల్ బ్యాన్ పెట్టడానికి కూడా కారణం చంద్రబాబేనంటూ ధ్వజమెత్తారు వైసీపీ నేతలు. అంతేకాదు, బాబుపై కేసులు పెట్టాలని, ఆయనకి ఎలాంటి శిక్ష విధించాలో ప్రజలే నిర్ణయించాలన్నారు.

కట్ చేస్తే, కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో, గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీస్ స్టేషన్లో, నరసరావుపేటలో కూడా చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి. అన్నిచోట్లా ఫిర్యాదు ఒకే రకంగా ఉంది. ఏపీలో కొత్త వేరియంట్ అంటూ చంద్రబాబు ప్రజల్ని భయాందోళనల్లోకి నెట్టేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు పెట్టారు. అదే సమయంలో బాబు వర్గం ఎదురు దాడికి దిగుతోంది. కేసులతో తమను భయపెట్టలేరని, కరోనాని కట్టడి చేయలేక, ఇలా కేసులతో వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై మండిపడుతున్నారు.

చంద్రబాబుపై కేసులు పెట్టడం వల్ల ఏంటి ఉపయోగం అనేదే ఇప్పుడు చర్చనీయాంశం. బాధ్యతగా ఉండాల్సిన ప్రతిపక్షం కొత్త వేరియంట్ అంటూ ఆరోపణలు చేయడం సరికాదని ప్రభుత్వం అంటోంది. అదే సమయంలో అసలా కొత్త వేరియంటే ఏపీలో లేదని కూడా వారు చెబుతున్నారు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తే.. అది కచ్చితంగా ఆయనకే వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. ఏపీలో పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతున్న వేళ, చంద్రబాబు చేస్తున్న ప్రచారంపై దృష్టిపెట్టకుండా, పరిస్థితి చక్కదిద్దడానికి ప్రభుత్వం కృషిచేస్తే మేలు. చంద్రబాబుపై నమోదవుతున్న కేసుల్ని చూసి, వైసీపీ నేతలు సంతోష పడితే ప్రయోజనం ఏముంటుంది? కేసులతో వేధిస్తున్నారు, ప్రజల ప్రాణాలు కాపాడాలని హెచ్చరిస్తే, తప్పుడు ప్రచారం అంటూ కప్పి పుచ్చుకుంటున్నారని ప్రతిపక్షాలు సింపతీ కొట్టేసే అవకాశం కూడా ఉంది. కరోనాపై ఏది అధికారిక సమాచారం, ఏది తప్పుడు సమాచారం అనే దాన్ని ఎవరు ధృవీకరిస్తారు. తెల్లవారితే సోషల్ మీడియా నిండా తిరుగుతోంది తప్పుడు సమాచారం కాదా? నిజానిజాలు నిగ్గుతేల్చే బదులు, అధికార ప్రతిపక్షాలు రెండూ ప్రజలకు అందాల్సిన వైద్య సౌకర్యాలపై దృష్టిపెడితే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: