ఇప్పుడు దేశం క‌రోనా మ‌హమ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఉన్న ఏకైక మార్గం ప్ర‌జ‌లంద‌రికీ వ్యాక్సిన్ ఇవ్వ‌డం. అమెరికా, ఐరోపా దేశాలు ఈ దిశ‌గానే కృషి చేసి వైర‌స్ వ్యాప్తిని నియంత్రించ‌గ‌లిగాయి. అయితే ఆ దేశాల జ‌నాభా త‌క్కువ‌. వైద్య స‌దుపాయాలు ఎక్కువ‌. దానికితోడు అక్క‌డి ప్ర‌జ‌ల్లో చైత‌న్యం, ఆరోగ్య స్పృహ కూడా ఇలాంటి అంశాల్లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. భార‌త్ ప‌రిస్థితి వేరు. ఇక్క‌డ మొద‌ట్లో వ్యాక్సిన్లు తీసుకునేందుకు పలు ఆపోహ‌ల‌తో చాలామంది వెనుకాడారు. ప్ర‌భుత్వం కూడా త‌గినంత ముందుచూపుతో వ్య‌వ‌హరించ‌లేదు. తీరా సెకండ్ వేవ్‌ తీవ్ర‌త అర్థ‌మ‌య్యాక ప్ర‌జ‌లు వ్యాక్సిన్ కోసం క్యూలు క‌డుతున్నారు. కాని దాదాపు 135 కోట్ల జ‌నాభా ఉన్న దేశానికి స‌రిప‌డా వ్యాక్సిన్లు ఒకేసారి ఇవ్వాలంటే అంత తేలిక కాదు. పైగా దేశంలో ప్ర‌స్తుతం రెండు సంస్థ‌లు మాత్ర‌మే వ్యాక్సిన్లు త‌యారీ చేస్తున్నాయి. రెండూ క‌లిపి చూసినా నెల‌కు 7 కోట్ల వ్యాక్సిన్ల త‌యారీ సామ‌ర్థ్యం మాత్ర‌మే క‌లిగి ఉన్నాయి. దీంతో ప్ర‌భుత్వాల‌పై అంత‌కంత‌కూ ఒత్తిడి పెరుగుతోంది. ప్ర‌జావ్య‌తిరేక‌త త‌మ‌పైకి మ‌ర‌ల‌కుండా చూసుకునేందుకు ప్ర‌భుత్వాధినేత‌లు కూడా త‌మ‌కు తోచిన వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌ల‌పైనా రాజ‌కీయ ఆరోప‌ణ‌లు చేస్తుండ‌టంతో ఆ సంస్థ‌ల యాజ‌మాన్యాలు గ‌తంలో ఎన్న‌డూ ఎదురుకాని ఈ ప‌రిస్థితికి విస్తుపోతున్నాయి.

ప్ర‌స్తుతం ఏపీలో ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సిన్ నిల్వలు మరీ తక్కువగా ఉన్నాయి. కొత్త వాళ్లకు తొలి డోస్ వేయడం సంగతలా ఉంచితే.. ఇప్పటికే ఫస్ట్ డోస్ వేసుకుని, సెకండ్ డోస్ వేసుకోవాల్సిన గడువు రావడంతో టీకా కేంద్రాలకు వెళ్తుంటే నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. దీనిపై స‌హ‌జంగానే విప‌క్ష టీడీపీ..ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ఐతే ఈ విషయంలో తమ వైఫల్యం ఏమీ లేదంటూ వైసీపీ స‌ర్కారు ప్ర‌స్తుత ప‌రిస్థితిని వివ‌రిస్తూ కేంద్రానిదే భార‌మ‌ని తేల్చింది. అయితే అక్క‌డితో ఊరుకోకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి మీద, మ‌రో ప్ర‌ముఖ మీడియా సంస్థ అధినేత మీద ఆరోప‌ణ‌లు చేస్తూ వ్యాక్సిన్ త‌యారీ సంస్థ భారత్ బయోటెక్ యాజ‌మాన్యంతో వారికి సంబంధ, బాంధవ్యాలు ఉన్నాయిని, కోవాగ్జిన్ నిల్వలు ఏపీకి రాకుండా వారు అడ్డుకుంటున్నారన్న అర్థం వచ్చేలా ప్ర‌భుత్వాధినేత స్వ‌యంగా ఆరోప‌ణ‌లు చేశారు.

దీంతో ఉరుమురిమి మంగ‌ళం మీద ప‌డిన‌ట్టు రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు తాము కేంద్రంగా మార‌డంతో భార‌త్ బ‌యోటెక్ యాజ‌మాన్యం త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో స్పందించింది. సంక్షోభ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు శ‌క్తికి మించి వ్యాక్సిన్ త‌యారీకి కృషి చేస్తున్న త‌మ‌పై దుష్ప్ర‌చారం భావ్యం కాదంటూ.. సంస్థ అధినేతల్లో ఒకరైన "సుచిత్ర ఎల్లా" స్పందించారు. నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరు ఎత్తకుండా.. పరోక్షంగానే తమకు దురుద్దేశాలు ఆపాదించడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ నెల 10న ప్రయారిటీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ సహా 18 రాష్ట్రాలకు కోవాగ్జిన్ డోసులను పంపామని.. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ డోసులను బట్టి చిన్న చిన్న షిప్‌మెంట్లే పంపించామని.. త‌మ‌పై రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డం చాలా బాధిస్తోందని ఆమె తెలిపారు. తమ సిబ్బందిలో కూడా 50 మంది దాకా కరోనా బారిన పడ్డారని.. అయినా వెర‌వ‌కుండా ఉద్యోగుల స‌హ‌కారంతో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నామ‌ని ఆమె ట్విట్టర్లో వివరించారు. మరోవైపు సంస్థ మరో అధినేత "కృష్ణా ఎల్లా" వ్యాక్సిన్ డోసులకు సంబంధించి తమకు లేఖ రాసిన ఢిల్లీ ప్రభుత్వానికి జవాబు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులు పంపుతున్నామని అందులో ఆయన స్పష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో క‌ష్ట‌కాలంలో ఔష‌ధ త‌యారీ సంస్థ‌ల‌పైనా రాజకీయ‌ ఆరోప‌ణ‌లు చేయ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: