టీకాల విషయంలో మన దేశంలో మొదటి నుంచి ఒక విధానం ఉంది. గత డెబ్బై సంవత్సరాలుగా భారత ప్రభుత్వం సార్వత్రిక రోగ నిరోధక పథకం..అంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ పద్ధతిని అమలు చేస్తోంది. దేశం మొత్తానికీ అవసరమైన వాక్సిన్లను ప్రభుత్వ, ప్రైవేటు ఉత్పత్తిదారుల నుంచి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చి సేకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా సరఫరా చేస్తుంది. ఈ పథకం శిశువులలో, చిన్నారులలో మరణాలను, మరణ అవకాశాలను తగ్గించడంలో ఎంత విజయం సాధించింది.


అవసరమైన వాక్సిన్లన్నిటినీ కేంద్ర ప్రభుత్వమే సేకరించడం వల్ల వాక్సిన్ సరఫరాదారులతో తక్కువ ధర గురించి బేరం ఆడడానికి వీలవుతుంది. కానీ ఇప్పుడు కేంద్రం ఎటువంటి కారణం చూపకుండానే వాక్సిన్లను ఒకేచోట కేంద్రీకృతంగా సేకరించే విధానాన్ని వదిలేసింది. ఆ విధానం వల్ల రాగల సదవకాశాలను కేంద్ర ప్రభుత్వం చేజేతులా వదులుకుంది. పైగా వాక్సిన్ సరఫరాదారులతో విడివిడిగా బేరం ఆడే వైపు రాష్ట్ర ప్రభుత్వాలను నెట్టింది. వేరు వేరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు తమలో తాము పోటీ పడేట్టు, మరొకవైపు ప్రైవేటు రంగ సంస్థలతో పోటీ పడేట్టు చేసింది.

 
ఇప్పటివరకూ ఉన్న కేంద్రీకృత సేకరణ విధానం వల్ల కొనుగోలుదార్ల మార్కెట్ గా ఉన్న వాక్సిన్ల మార్కెట్ ను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అమ్మకందార్ల మార్కెట్ గా మార్చివేసింది. వాక్సిన్ ఉత్పత్తి సంస్థలు రాష్ట్రప్రభుత్వాలకు అవసరమైనంత పరిమాణంలో వాక్సిన్లను అందజేస్తాయనే హామీ కూడా ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన కేటాయింపు కోటా తర్వాత వారి దగ్గర మిగిలిన యాబై శాతం వాక్సిన్లను వారు ఎవరు ఎక్కువ ధర ఇస్తే వారికి అనే ప్రాతిపదిక మీద ప్రైవేటు సంస్థలకు అమ్ముకోవచ్చు.


ఈ కొత్త విధానం రాష్ట్రాల మధ్య తీవ్రమైన అసమానతలకు దారి తీస్తుంది. బాగా వనరులున్న రాష్ట్రాలు తమకు అవసరమైన వాక్సిన్లను సంపాదించుకుంటాయి. పేద రాష్ట్రాలు వాక్సిన్లు సంపాదించలేక ఇబ్బంది పడతాయి. సంపన్నులు తమ కుటుంబాలకు సులభంగా వాక్సిన్ వేయించగలుగుతారు. బలహీన వర్గాల ప్రజలు అత్యవసరమైన వాక్సిన్ లేకుండానే గడపవలసి వస్తుంది. అంటే భారత పౌరులలో కొందరికి వాక్సిన్ అందుతుంది, కొందరికి అందదు. మరి మోదీ ఈ విధానంతో పేద రాష్ట్రాలను బలి చేస్తున్నారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: