గ‌తంతో పోలిస్తే దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో ప్ర‌ధాని మోదీ ప్ర‌తిష్ఠ బాగా దిగ‌జారిందా.. ఇప్ప‌టిదాకా భార‌త్‌లో తిరుగులేని నేత‌గా, అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన‌ నాయ‌కుడిగా ఆయ‌న‌పై ఉన్న‌ విశ్వాసం అంత‌కంత‌కూ స‌న్న‌గిల్లుతోందా..? లండ‌న్ నుంచి వెలువ‌డే ప్ర‌ముఖ ప‌త్రిక ఫైనాన్షియ‌ల్ టైమ్స్ క‌థ‌నం ఇదే వాస్త‌వ‌మ‌ని వెల్ల‌డించింది. క‌రోనా రెండో వేవ్ ప్రస్తుతం దేశంలో విల‌యం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. దేశంలో కేసులు పెరుగుతున్న ద‌శ‌లోనే దీని నివార‌ణ‌కు స‌మ‌ర్థ‌వంత‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన మోదీ ప్ర‌భుత్వం దీనికంటే.. బెంగాల్ ఎన్నిక‌ల వంటి అంశాలపైనే ఎక్కువ‌గా దృష్టిసారించింద‌ని ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. మ‌రోప‌క్క ల‌క్ష‌లాది మంది జ‌నం పాల్గొనే కుంభ‌మేళా నిర్వ‌హ‌ణ వంటి కార‌ణాలూ వైర‌స్ తీవ్ర‌త‌కు కార‌ణ‌మ‌ని కూడా వైర‌స్ బాధిత కుటుంబాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే గురువారం వెలువ‌డిన ఆ ప‌త్రిక క‌థ‌నంలో ఇలాంటి ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించింది. కోవిడ్ వైర‌స్ మ‌రోసారి దేశంపై విరుచుకుప‌డనుంద‌ని, నియంత్ర‌ణ‌కు స‌మ‌గ్ర చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని నిపుణులు ముందుగానే హెచ్చ‌రించినా మోదీ ప్ర‌భుత్వం ఏమంత ప‌ట్టించుకోలేద‌ని, ఇప్పుడు తాము ప్రాణాల కోసం పోరాటం చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొనేందుకు కార‌ణ‌మ‌య్యార‌ని అత్య‌ధిక శాతం ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని ఫైనాన్షియ‌ల్ టైమ్స్ క‌థ‌నం పేర్కొంది. దీనికి ఆధారంగా కోవిడ్ ముప్పు బారిన ప‌డిన‌ ప‌లువురు సామాన్యుల‌తోపాటు, ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌ల అనుభ‌వాల‌ను ఈ వ్యాసంలో ప్ర‌స్తావించారు. స‌రైన చికిత్స ల‌భించ‌క 67 ఏళ్ల త‌న తండ్రిని కోల్పోయిన‌ట్టు సాక్షాత్తూ దేశ రాజ‌ధాని ఢిల్లీకి చెందిన అన‌న్య అనే 30 ఏళ్ల మ‌హిళ ఆవేద‌నను ఈ వ్యాసం ప్ర‌త్యేకంగా పేర్కొంది.

వైర‌స్ వ్యాప్తిని నిలువ‌రించేందుకు కీల‌క‌మైన‌ వ్యాక్సిన్లను అవ‌స‌రం మేర‌కు స‌మ‌కూర్చుకునే వ్యూహాన్ని కూడా స‌రైన రీతిలో అమ‌లు చేయ‌లేక‌పోయింది, దీంతో అత్య‌ధిక జ‌నాభా ఉన్న దేశంలో వ్యాక్సిన్లకు కొర‌త ఏర్ప‌డింది. అంతేకాదు.. ఇప్ప‌టిదాకా త‌న ప‌నితీరుపై విదేశీ మీడియాలో వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను త‌న అనుకూల మీడియా సాయంతో తీవ్రంగా ప్ర‌తిఘ‌టిస్తూ వ‌చ్చిన భార‌త ప్ర‌భుత్వం ఇప్పుడు ఆ ప్ర‌య‌త్నాల‌ను విర‌మించుకున్నట్టు క‌నిపిస్తోంద‌ని కూడా ఆ ప‌త్రిక త‌న అభిప్రాయం వ్య‌క్తం చేసింది. ఇక ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ వైపునుంచి ఎదురైన అన్నిర‌కాల కుటిల రాజ‌కీయాల‌ను ఎదుర్కొని బెంగాల్‌లో మ‌మ‌తాబెన‌ర్జీ సాధించిన ఘ‌న‌విజ‌యం, దేశంలోని ప్రాంతీయ పార్టీల‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింద‌ని ఆ క‌థ‌నం పేర్కొంది. తాజా ప‌రిస్థితుల‌ను బ‌ట్టి దీర్ఘ‌కాలంలో మోదీకి ఎదుర‌య్యే రాజ‌కీయ స‌వాళ్ల‌ను కూడా ఈ వ్యాసంలో విశ్లేషించారు. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు మోదీ ప్ర‌భుత్వానికి కీల‌క ప‌రీక్ష‌గా నిలుస్తాయని ఫైనాన్షియ‌ల్ టైమ్స్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: