రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి విడివ‌డి కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ .. ఆర్థికంగా మిగులు రాష్ట్రంగా ఆవిర్భ‌వించింది. దీనికి కార‌ణం ఉమ్మ‌డి రాష్ట్ర రాజ‌ధానిగా అన్నిరంగాల్లోనూ మేటిగా ఎదిగిన హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం తెలంగాణ‌లో ఉండ‌ట‌మే. ఆ రాష్ట్రానికి ఇది వ‌రం. అందుకే తెలంగాణ సాధ‌న‌లో ప్ర‌ధాన పాత్ర పోషించి, ఆ రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రిగా ఎన్నికైన కేసీఆర్ తెలంగాణ సంపన్న రాష్ట్ర‌మ‌ని త‌ర‌చుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇటు ప‌ద‌హారు వేల కోట్ల‌కు పైగా ఆర్థిక లోటుతో ఏర్ప‌డిన ఏపీ ప్ర‌స్తుతం ఇంకా రాజ‌ధాని ఏదో తెలియ‌ని సందిగ్దావ‌స్థ‌లోనే కొట్టుమిట్టాడుతోంది. మ‌రోప‌క్క‌ మౌలిక సౌక‌ర్యాలు, చెప్పుకోద‌గిన పరిశ్ర‌మ‌లు లేక‌పోవ‌డం, వైసీపీ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాలకే ప్రాధాన్య‌మివ్వ‌డం కార‌ణంగా ఆర్థికంగా త‌గిన ఆదాయ‌ వ‌న‌రులు లేక అప్పులు చేస్తూ స‌త‌మ‌త‌మ‌వుతోంది. విడిపోయిన తొలినాళ్లలో మంద‌గ‌మ‌నంలో ప‌డిన హైదరాబాద్ రియ‌ల్ ఎస్టేట్ రంగం ఏపీలో అమ‌రావ‌తి నిర్మాణం ఆగిపోయాక ఒక్క‌సారిగా పుంజుకుంది. అందుకే అప్ప‌ట్లో స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ల శాఖ నుంచి 10 వేల కోట్ల అధిక ఆదాయం అంచ‌నా వేసుకోవ‌చ్చ‌ని ఆ రాష్ట్ర అధికారుల‌తో స‌మావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి కూడా.

అయితే ఊహించ‌నివిధంగా ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం కూడా ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం. ఇందుకు కార‌ణం ఏడాది కాలంగా దేశాన్ని కమ్ముకుని అత‌లాకుతలం చేస్తున్న క‌రోనా మ‌హమ్మారి. గ‌త ఏడాది వైర‌స్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా కేంద్రం విధించిన క‌ఠిన లాక్‌డౌన్ అన్నిరంగాల‌నూ తీవ్రంగా దెబ్బ‌తీసింది. ప‌లు రాష్ట్రాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల న‌డ్డి విరిచింది. తెలంగాణ కూడా దీనికి అతీతం కాదు. ఇప్పుడు మ‌రోసారి వైర‌స్ తీవ్ర‌త నేప‌థ్యంలో రాష్ట్రంలో మ‌ర‌లా లాక్‌డౌన్ పెట్ట‌క త‌ప్ప‌లేదు. అంటే తాత్కాలికంగానైనా వ్యాపారాలు నిలిచిపోవ‌డంతో రాష్ట్రానికి వ‌చ్చే ప‌న్నుల ఆదాయానికి భారీగా గండి ప‌డ‌క త‌ప్ప‌ద‌న్న‌మాట‌. ఈ నేప‌థ్యంలోనే పెరిగిన ఖ‌ర్చులు, పూర్తిగా ఆగిన రాబ‌డితో భ‌విష్య‌త్తు అవ‌స‌రాలు ఎలా తీర్చుకోవాలన్న అంచ‌నాల‌తో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్ర‌స్తుతం  త‌ల‌ప‌ట్టుకుంటోంది. కోవిడ్ ప్ర‌భావం త్వ‌ర‌గా నియంత్ర‌ణ‌లోకి రాని ప‌క్షంలో జూన్ నెల‌లో ఎలా నెట్టుకురావాల‌న్న ఆందోళ‌న ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే రాబ‌డి వ‌చ్చే శాఖ‌లపై లాక్‌డౌన్ ప్ర‌భావం తీవ్రంగా ప‌డింది. అప్పులు, బాండ్ల విక్ర‌యాల ద్వారా వ‌చ్చే నిధులు త‌ప్ప ఖ‌జానాకు రాబ‌డి క‌నిపించ‌డం లేదు.
వాణిజ్య ప‌న్నుల శాఖ ద్వారా 5వేల కోట్లు ఆదాయం రావాల్సి ఉండ‌గా ఇప్పుడు లాక్‌డౌన్ కార‌ణంగా దానికి భారీగా కోత ప‌డ‌నుంది. మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా వ‌చ్చే ఆదాయం మాత్ర‌మే కాస్త ఆశాజ‌న‌కంగా ఉంది.  స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ల శాఖ కార్యాల‌యాలు ఈ నెల 22 వ‌ర‌కు మూత‌ప‌డే ఉంటాయి. ఈ శాఖ ద్వారా వ‌చ్చే 900 కోట్ల ఆదాయంపై ఆశ వ‌దులుకోవాల్సిందే.  ర‌వాణా శాఖ నుంచి వచ్చే ఆదాయం కూడా భారీగా త‌గ్గ‌నుంది.

ఈ నేప‌థ్యంలో ఈ నెల చెల్లించాల్సిన వేత‌నాలు రూ. 3,500 కోట్లు, వ‌డ్డీ చెల్లింపులు రూ. 1150 కోట్లు, రుణాలు తీర్చేందుకు రూ. 1,300 కోట్లు, ఆస‌రా పింఛ‌న్ల‌కు రూ. 1,000 కోట్లు, ఉచిత బియ్యం కోసం 1,120 కోట్లు, స్థానిక సంస్థ‌లకు ఇవ్వాల్సిన‌ 500 కోట్లు, ఇత‌ర‌ నిర్వ‌హ‌ణ వ్య‌యాలు, కోవిడ్ నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ కోసం ఖ‌ర్చులు వంటివ‌న్నీ క‌లిపితే సుమారు రూ.12 వేల కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని ఆర్థిక శాఖ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో కేంద్రం నుంచి అందే సాయం అంతంత‌మాత్ర‌మే కావ‌డంతో ప్ర‌భుత్వం నిధుల స‌మీక‌ర‌ణ‌కు క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టింది. బాండ్ల విక్ర‌యం ద్వారా రూ. 1,000 కోట్లు, కేంద్ర నుంచి రావాల్సిన ప‌న్నుల వాటా రూ. 1,400 కోట్ల‌ను స‌మీక‌రించుకుని ఈ ప‌రిస్థితిని అధిగ‌మించే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మొత్తం మీద క‌రోనా వైర‌స్ పంజా విస‌ర‌డంతో సంపన్న రాష్ట్ర‌మైన‌ తెలంగాణ‌కు కూడా ఏపీ మాదిరే ఆర్థిక క‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌న్నమాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: