ప్రపంచమంతా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తో వణికిపోతుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం 10వ తరగతి విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. షెడ్యూల్ ప్రకారమే 10వ తరగతి పరీక్షలు నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా ప్రకటించటమే విచిత్రంగా ఉంది. ఒకవైపు కరోనా వైరస్ తీవ్రత రోజోరోజుకు పెరిగిపోతోంది. తీవ్రతను నియంత్రించటంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రెండూ చేతులెత్తేశాయి. కరోనా వైరస్ తగ్గాలంటే సంపూర్ణ లాక్ డౌన్ విధించటం, టీకాలు వేయించుకోవటం రెండే మార్గాలు. రెండో మార్గం ప్రభుత్వాల చేతిలో లేదు. కాబట్టి మొదటిమార్గానికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. పైగా రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదువుతున్నాయి. చిత్తూరు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళంలో పాజిటివిటి రేటు దాదాపు 30 శాతం ఉందంటే పరిస్ధితి ఎంత భయంకరంగా ఉందో అర్ధమైపోతోంది.




ఇలాంటి పరిస్ధితుల్లో కూడా 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఎందుకింత పట్టుదలకు పోతోందో ఎవరికీ అర్ధం కావటంలేదు. 6 లక్షలమంది విద్యార్ధులు పరీక్షలు రాయాల్సుంటుంది. ఒకసారి పరీక్షలు మొదలైతే పరీక్షల కేంద్రాల్లోకి విద్యార్ధులందరు గుంపులు గుంపులుగానే వెళతారు, బయటకు వస్తారు. పరీక్షరాసే విద్యార్ధుల్లో ఎవరికి కరోనా వైరస్ ఉందో ఎవరికీ తెలీదు. వైరస్ ఉన్నవాళ్ళు పరీక్షలకు హాజరైతే అది మిగితావాళ్ళకు సోకటానికి ఎంతోసేపు పట్టదు. అదే జరిగితే కరోనా వైరస్ సోకిన విద్యార్ధులకు ఏమైనా జరిగితే అప్పుడు ఎవరిది బాధ్యత ? పరీక్షలు లేకుండా స్కూళ్ళూ లేకుండా కూడా విద్యార్ధులకు కరోనా సోకే అవకాశాలున్నాయి. ఒకవేళ అప్పుడు కరోనా సోకితే అప్పుడు ప్రభుత్వాన్ని ఎవరు నిందించరు. కానీ పరీక్షల కారణంగానే విద్యార్ధులకు కరోనా వైరస్ సోకి ఏదైనా జరగరానిది జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సుంటుంది.




కరోనా సమస్య విద్యార్ధులతో మాత్రమే ఆగదు. వాళ్ళ కుటుంబాలకు కూడా పాకిపోతుంది. కరోనా సోకిన విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా హాలు కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పటంలో కూడా అర్ధంలేదు. ఒక హాలులో పరీక్షలు రాసే విద్యార్ధులందరు కరోనా వైరస్ సోకిన వాళ్ళే అని తెలిసిన తర్వాత ఆ గదిలో డ్యాటీలు చేయటానికి ఎవరైనా ముందుకొస్తారా ? పరీక్షల విషయంలో జగన్ చెబుతున్నది కూడా లాజిక్కుకు అందటంలేదు. మంచి కాలేజీల్లో సీటు కావాలంటే జస్ట్ పాస్ అని ఉంటే సరిపోదంటున్నారు. నిజమే అని ఒప్పుకుందాం కాసేపు. ఇలాంటి పరిస్ధితే దేశమంతా, అన్నీ కాలేజీల్లోను ఉంటుంది కదా. 10వ తరగతి తర్వాత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కాలేజీల్లో చేరే లక్షాలాదిమంది విద్యార్ధులందరికీ ఇలాగే ఉంటుంది కదా. జగన్ చెప్పే సమస్య ఒక్క ఏపికి మాత్రమే పరిమితంకాదు. యావత్ దేశమంతా ఇదే సమస్య అయినపుడు జగన్ లాజిక్కులో డొల్లతనం బయటపడుతోంది. కాబట్టి అనవసరమైన పంతాలకు పోకుండా జగన్ ప్రభుత్వం విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటమాడకుండా ఉంటే బాగుంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: