ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ రాజ‌ధాని ఢిల్లీలో కూడా ప్ర‌స్తుతం రాజ‌కీయంగా సంచ‌లనం సృష్టిస్తున్న హాట్ టాపిక్‌. వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌రాజు అరెస్టు. దీనిని త‌ప్పుల‌ను ప్ర‌శ్నిస్తే స‌హించ‌లేని ప్ర‌భుత్వ ద‌మ‌న నీతిగా కొంద‌రు, సొంత పార్టీపైనా, ముఖ్య‌మంత్రి పైనా రాజ‌కీయ దురుద్దేశంతో రాజు మొద‌లుపెట్టిన దుష్ప్ర‌చారానికి త‌గిన‌ ఫ‌లిత‌మని మ‌రికొంద‌రు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఇందులో ఏది నిజమ‌న్న అంశంపై నిష్పాక్షికంగా లోతైన విశ్లేష‌ణ జ‌ర‌గాల్సిన అవ‌స‌ర‌ముంది. వాస్త‌వానికి ర‌ఘురామ‌రాజు గ‌త ఎన్నిక‌ల‌ముందు చివ‌రి నిమిషంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరి పార్టీ టికెట్ తెచ్చుకుని వైసీపీ ప్ర‌భంజ‌నంలో ఎంపీగా గెలిచారు. తొలిసారి ఎంపీగా లోక్‌స‌భ‌లో అడుగుపెట్టారు. ఆ త‌రువాత త‌న‌కు పార్టీ అధినేత త‌గిన ప్రాధాన్యం, గౌర‌వం ఇవ్వ‌డం లేద‌న్న కార‌ణం చూపి వైసీపీకి క్ర‌మేణా దూరంగా జ‌రుగుతూ వ‌చ్చారు. అయితే ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీలో ఉంటూనే ప్ర‌భుత్వంపై శృతిమించిన విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. గ‌త కొద్దిరోజులుగా అవి వ్య‌క్తిగ‌త స్థాయికి కూడా చేరాయి. అంతేకాదు.. ఏకంగా సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ ర‌ఘురామ‌రాజు సీబీఐ కోర్టులో పిటిష‌న్ కూడా దాఖ‌లు చేయ‌డంతో పోరాటం మ‌రో ద‌శ‌కు చేరింది. నిజానికి పార్టీని, ప‌ద‌విని వీడి ఆ త‌రువాత‌ ఈ వైఖ‌రిని తీసుకుని ఉంటే అది ఆయ‌న వాద‌న‌కు ప్ర‌జ‌ల్లోనూ విశ్వ‌స‌నీయ‌త‌ చేకూర్చేది. అధికారంలో ఏ పార్టీ అయినా కూడా సొంత పార్టీ ఎంపీ ఇలా వ్య‌వ‌హ‌రిస్తే స‌హించ‌డం క‌ష్ట‌మే.
 
ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వంపై ర‌ఘురామ‌రాజు చేస్తున్న‌ పోరాటానికి స‌హ‌జంగానే ప్రతిపక్షాల నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది. ఇది వైసీపీ ప్ర‌భుత్వానికి పుండు మీద కారం చ‌ల్లిన‌ట్టైంది. దీంతో రాజు ప్ర‌తిప‌క్షాల‌తో చేతులు కలిపి, కుట్రపూరితంగా అసత్యాలు, అర్థసత్యాలు ప్రచారం చేస్తూ ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌రిచే ప్ర‌య‌త్నానికి పాల్ప‌డుతున్నారంటూ ఆయ‌న‌పై రాజ‌ద్రోహం, కులాల మ‌ధ్య విభేదాలు సృష్టించ‌డం వంటి ప‌లు కేసులు న‌మోదు చేసింది. ఇందుకు సాక్యాలుగా రఘురామకృష్ణంరాజు కొంత‌కాలంగా చేస్తూ వ‌చ్చిన‌ రచ్చబండ కార్యక్రమాల వీడియోలను చూపిస్తోంది. వీటిని చూస్తే ఎవ‌రికైనా రాజు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కుట్ర చేస్తున్నార‌ని అనిపించ‌క మాన‌దు. అయితే రాచ‌రికం,  బ్రిటిష్ కాలంనాటి రాజ‌ద్రోహం కేసును ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జాప్ర‌తినిధిపై పెట్ట‌డ‌మేమిట‌న్న‌ది ప్ర‌తిప‌క్షాల వాద‌న‌గా ఉంది.ఈ ఘ‌ట‌న‌లో రాజుపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించారనే ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న కుటుంబం వ్య‌క్తం చేస్తోంది. ఇది నిజ‌మ‌ని తేలితే ఏపీ సీఐడి కోర్టు ముందు స‌మాధానం చెప్పుకోక త‌ప్ప‌దు.

ఇదిలా ఉండ‌గా ఇది కులాల మ‌ధ్య స‌మ‌రంగా మార్చే ప్ర‌య‌త్నాలు కూడా ఇప్పుడు చురుగ్గానే సాగుతున్నాయి. క్ష‌త్రియ సామాజిక వ‌ర్గంపై వైసీపీ ప్ర‌భుత్వం కక్ష సాధింపు వైఖ‌రిని అనుస‌రిస్తోంద‌ని కొంద‌రు ప్ర‌చారం మొద‌లుపెట్టారు. దీనిని తొలిద‌శ‌లోనే అడ్డుకునే ల‌క్ష్యంతో ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు పెద్ద‌లు భీమ‌వ‌రంలో స‌మావేశ‌మై ర‌ఘురామ‌రాజు వైఖ‌రిని త‌మ సామాజిక‌వ‌ర్గంలో అత్య‌ధిక శాతం స‌మ‌ర్థించ‌డం లేద‌ని, తామెవ‌రూ ఆయ‌న వెన‌కలేర‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర క్షత్రియ సంఘం అధ్యక్షుడి హోదాలో ఉన్న గొట్టుముక్క‌ల ర‌ఘురామ‌రాజు మాత్రం ప్ర‌భుత్వ వైఖ‌రిని త‌ప్పు ప‌ట్టారు. క్ష‌త్రియుల‌పై ప్ర‌భుత్వం ద‌మ‌న‌నీతిని అనుస‌రిస్తోంద‌ని, వారంతా వైసీపీపై తిర‌గ‌బ‌డ‌తార‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ప్ర‌తి అంశానికి కులాన్ని ఆపాదించ‌డం ఈ మ‌ధ్య‌కాలంలో మరీ ఎక్కువైన వైనాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తుంచుకోవాలి. అత్యంత దుర‌దృష్ట‌క‌ర‌మైన ప‌రిణామ‌మిది. ఇలాంటి రాజ‌కీయ విధానాలు సామాజికంగా కులాల‌వారీ విభ‌జ‌నను సృష్టిస్తాయి. రాష్ట్ర భ‌విష్యత్తుకు ఇవి ఎంత‌మాత్రం మేలు చేయ‌వు. ఏ పార్టీ కూడా ఇందుకు మిన‌హాయింపు కాద‌ని చెప్పాలి.

దీనికీ స‌త్యం రామ‌లింగ‌రాజు ఉదంతానికీ సంబంధం ఏముంది..?
ఇక ఈ సంద‌ర్భంగా స‌త్యం రామ‌లింగ‌రాజు ఉదంతాన్ని ప‌లువురు తెర‌పైకి తెస్తున్నారు. ఇది కూడా అసంబ‌ద్ధ‌మైన విష‌యం. రామ‌లింగ‌రాజు స్థాపించిన స‌త్యం కంప్యూట‌ర్స్ భార‌త‌దేశంతో పాటు, అమెరిక‌న్ స్టాక్ ఎక్సేంజ్‌లోనూ లిస్ట‌యిన ఒక ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ వ్యాపార సంస్థ‌. ఆయ‌న వ్యాపారంలో చేసిన అవ‌క‌త‌వ‌క‌ల‌కు గాను కార్పొరేట్ మోసం కేసులో త‌ప్పిదాన్ని స్వ‌యంగా అంగీక‌రించి జైలుకు వెళ్లారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో ముఖ్య‌మంత్రిగా వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉన్నంత మాత్రాన ఆయ‌న‌కు దీన్ని అంట‌గ‌ట్టాల‌ని చూడ‌టాన్ని, దీనిని చూపించి జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై బుర‌ద చ‌ల్లే ప్ర‌య‌త్నాన్ని ఎవ‌రూ స‌మ‌ర్థించ‌లేరు. ఈ నేప‌థ్యంలోనే ర‌ఘురామ‌రాజు ఉదంతం మ‌రెన్ని మ‌లుపులు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: