పెట్రోల్‌ ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్ లీటర్ ధర సెంచరీ దాటేసింది. ప్రస్తుతం 100 నుంచి 102 రూపాయల వరకూ పెట్రోల్ ధరలు ఉన్నాయి. గత ఏడాది కాలంలో పెట్రోల్‌ రేట్లు 25 సార్లకు పైగా పెరిగాయి. ఒకప్పుడు 60-70 రూపాయలు ఉండే పెట్రోల్ ధర కొద్దికాలంలోనే సెంచరీ కొట్టేసింది. పెట్రోల్ ధరలు ఇంతగా పెరిగినా.. వాటికి కళ్లెం వేద్దామన్న స్పృహ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కించిత్ కూడా కనిపించడం లేదు.


పెట్రోల్‌ ధరలు పెరిగితే.. ఆ భారం ఒక్క వాహనదారులపైనో, రవాణ వాహనాలపైనో మాత్రమే పడదు. పెట్రోల్ ధరలు పెరిగితే.. సమాజంలోని అన్ని వర్గాలపై ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది. దేశంలో సామాన్యుడి జీవితం సాఫీగా సాగాలంటే.. అడుగడుగునా పెట్రోల్ ప్రభావం ఉంటుంది. పెట్రోల్‌ రేట్లు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీంతో కూరగాయల ధరలు, నిత్యావసరాల ధరలు పెరుగుతాయి.  


పెట్రోల్‌, డీజిల్ రేట్లు పెరిగితే వ్యవసాయం ఖర్చు పెరుగుతుంది.. ఇలా అన్ని రంగాలపైనా దీని ప్రభావం ఉంటుంది. అసలే కరోనా కాలం.. జనం ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వాలు మాత్రం తమ ఆదాయం కోసం పెట్రోల్‌ ధరలకు కళ్లెం వేయడం లేదు. పెట్రోల్ రేట్లు పెంచకపోతే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తాం అని సాక్షాత్తూ పెట్రోలియం శాఖ మంత్రే బదులిస్తుంటే.. ఇక పెట్రో ధరలను ఈ ప్రభుత్వాలు తగ్గిస్తాయని ఆశించడం అత్యాశే అవుతుందేమో.


అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తక్కువగానే ఉన్నా.. ధరలు తగ్గినా.. ఆ మేరకు పెట్రోల్ ధరలు తగ్గించిన దాఖలాలు లేవు. గతంలో పెట్రో ధరలు ఎప్పుడో 2,3 నెలలకు పెంచేవారు. ఇప్పుడు ఆ విధానం తీసేసి.. రోజువారీగా ధరలు నిర్ణయించుకునే స్వేచ్ఛ పెట్రోలియం సంస్థలకు కట్టబెట్టినప్పటి నుంచి ఈ ధరలకు పట్టపగ్గాలు లేకుండాపోతున్నాయి. ఇలా అడ్డదారుల్లో పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజల బాధ్యతల నుంచి కేంద్ర, రాష్ట్రాలు తప్పుకుంటున్నాయి. ప్రభుత్వాల పట్టింపులేనితనం సామాన్యుడి జీవితాన్ని మరింతగా కష్టాల్లోకి నెట్టేస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: