ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ హవాకు గండికొట్టాయి. బీజేపీ ప్రత్యర్థుల బలాన్ని పెంచాయి. పరోక్షంగా బీజేపీ మిత్ర వర్గంలో కూడా కలవరం మొదలైంది. కమలదళాన్ని అంటిపెట్టుకుని ఉండాలా, లేక కొత్త మార్గం అణ్వేషించాలా అనే డైలమాలో పడ్డాయి. వచ్చే ఏడాది జరగబోతున్న ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

పంబాజ్ మినహా వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీయే అధికారంలో ఉంది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతల వ్యవహారంతో పంబాజ్ పై ఆ పార్టీకి ఆశ లేదు. కీలకమైన యూపీలో కూడా ఈసారి టఫ్ ఫైట్ తప్పదనిపిస్తోంది. మిగతా రాష్ట్రాల్లో కూడా అధికారం నిలబెట్టుకోవడం బీజేపీకి తలకు మించిన భారంలా మారింది. ఈ ఎన్నికల్లో ఏమాత్రం బీజేపీకి వ్యతిరేక ఫలితాలొచ్చినా.. దేశవ్యాప్తంగా ఆ ప్రభావం కచ్చితంగా కనిపిస్తుంది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలే బీజేపీకి కీలకంగా మారబోతున్నాయి. ఏపీలో జనసేన, తమిళనాట అన్నాడీఎంకే సహా చాలా పార్టీలు ఈ ఎన్నికల ఫలితాలతోనే తమ భవిష్యత్తుని నిర్ణయించుకోబోతున్నాయి. బీజేపీ బలహీన పడితే..  2024 లోక్ సభ ఎన్నికల్లో తమదారి తాము చూసుకోవాలనుకుంటున్నాయి. యూపీలో బీజేపీ అధికారంలోకి రాకపోతే అప్నాదల్.. సోలోగా 2024 ఎన్నికల్ని ఎదుర్కోవడం గ్యారెంటీ. అసోం గణపరిషద్, మిజో నేషనల్ ఫ్రంట్ వంటి పార్టీలు కూడా బీజేపీకి ఎదురు తిరిగే అవకాశముంది. రాగా పోగా.. జేడీయూ లాంటి పార్టీలకు బీజేపీ సపోర్ట్ తప్పనిసరి కాబట్టి.. కేవలం అలాంటి వారు మాత్రమే కమలదళంతో కలసి ప్రయాణం చేస్తారు. అదే సమయంలో బీజేపీతో తటస్థంగా ఉన్న పార్టీలు కూడా మోదీకి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. వైసీపీ, టీఆర్ఎస్, బిజూ జనతాదళ్ కూడా ఇప్పటిలాగా బీజేపీకి అనుకూలంగా ఉంటాయని భావించలేం.

ఇక బీజేపీ ప్రత్యర్థి పార్టీల సంగతి చెప్పేదేముంది. కాంగ్రెస్ పై ఎలాగూ ఆశలు లేవు కాబట్టి, మమతా బెనర్జీ లేదా కేజ్రీవాల్ ఆధ్వర్యంలో జట్టుకట్టడానికి సిద్ధమవుతాయి. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయం ఉంటుంది కాబట్టి, వ్యూహాలు రచించడానికి అవకాశం ఉన్నట్టే. అంటే వచ్చే ఏడాది జరిగే ఆరు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు బీజేపీకి కీలకం అని చెప్పాలి. ఒకవేళ బీజేపీ ఐదురాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకుంటే.. వారి మిత్రుల సంఖ్య పెరుగుతుంది. ఏమాత్రం తేడాకొట్టినా.. శత్రు శిబిరం బలపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: