భావి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి 51 ఏళ్లు. రాజకీయాల్లో ఓనమాలు దిద్దే వయసు కాదిది, ఢక్కామొక్కీలు తిని రాటుదేలి కీలక పదవుల్ని చేజిక్కించుకునే వయసది. కానీ జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. బలమైన వారసత్వ రాజకీయాలను కొననసాగించడంలో ఎందుకో రాహుల్ వెనకబడిపోయారు. ఇంతా తల్లిచాటు బిడ్డ అనే ఇమేజ్ నుంచి బయటకు రాలేకపోతున్నారు.

కాంగ్రెస్ సారథ్యం తీసుకోడానికి భయమేంటి..?
ఏఐసీసీ అధ్యక్ష స్థానంలో కూర్చోవడానికి రాహుల్ వెనకడుగు వేయడం పెద్ద మైనస్ పాయింట్. పార్టీ బలపడాలి అంటే, బలమైన నాయకత్వం కావాలి. కాంగ్రెస్ సారధ్యాన్ని గాంధీ కుటుంబ వారసులు మినహా ఇంకెవరు చేపట్టినా పెద్దగా ఫలితం ఉండదనేది తెలిసిన విషయమే. అసంతృప్తులు, అలకలు, అన్నీ పెచ్చుమీరతాయి. ఈ దశలో అనారోగ్యంతో ఉన్న తల్లి బాధ్యతల్ని రాహుల్ పంచుకోడానికి వెనకడుగు వేస్తున్నారు. బీజేపీకి బలమైన ప్రత్యర్థి లేకుండా చేస్తున్నారు.

2024నాటికి పరిస్థితి ఎలా ఉండొచ్చు..?
వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏకి వరుసగా రెండేళ్లు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. కరోనా కారణంగా మోదీ ప్రభ మరింతగా మసకబారింది. అయితే సిసలైన ప్రత్యర్థి లేకపోవడం, పోటీ ఇచ్చే బలమైన ప్రతిపక్షం లేకపోవడం మోదీ ప్లస్ పాయింట్స్. ఇటీవల కాలంలో మమతా బెనర్జీ, కేజ్రీవాల్.. ఇద్దరూ మోదీని బలంగా ఢీకొంటున్నారు. తమ తమ రాష్ట్రాల్లో బలంగా పాతుకుపోవడమే కాదు.. పొరుగు రాష్ట్రాలవైపు చూస్తూ బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇలాంటి నేతల మధ్యలో రాహుల్ తట్టుకుని నిలబడగలరా అనేది తేలాల్సి ఉంది.

రంగంలోకి దిగాల్సిన సమయం ఇదే..
రాహుల్ గాంధీ రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చింది. వరుసగా రెండు దఫాలు యూపీఏ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఎన్డీఏకి అధికారం కట్టబెట్టారు. చాకచక్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఆ కూటమి.. ఈసారి దాన్ని నిలబెట్టుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా బలహీనపడుతూనే ఉంది. రాగా పోగా స్థానిక పార్టీలే ఎక్కడికక్కడ తమ సత్తా చూపిస్తూ బీజేపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ దశలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ సారథ్యం స్వీకరించి పార్టీతోపాటు, ప్రతిపక్షాలను కూడా కలుపుకొని ముందుకేళ్తే, మోదీని గద్దె దించే అవకాశం ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాహుల్ ఇంకా తడబడుతూనే నడుస్తుంటే మాత్రం.. వచ్చే ఎన్నికలనాటికి మూడో ప్రత్యామ్నాయం తెరపైకి రావడం ఖాయం. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి వారు ఆ ప్రత్యామ్నాయ కూటమికి సారథ్యం వహించి, కేంద్రంలో అధికారం చేపడితే.. కాంగ్రెస్ పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: