అధికార పార్టీ నేతలు ఆదేశించారో, లేక అధికారులే తమకి తాము నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ, రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ పేరుతో జరుగుతున్న నిరనస ప్రదర్శనల్లో అరెస్ట్ లు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. తాడేపల్లిలో సీఎం ఇంటి వద్ద ఆందోళనకు వెళ్తున్న టీడీపీ నేతల్ని, టీఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని అరెస్ట్ చేశారంటే దానికో అర్థముంది. అయితే జనసేన నాయకులు శాంతియుతంగా ఎంప్లాయ్ మెంట్ కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వడాన్ని కూడా అడ్డుకుంటే ఎలా..? ఇలాంటి అరెస్ట్ లతో జనాల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి..? జగన్ ప్రభుత్వంపై ప్రజలకు ఎలాంటి అంచనాలుంటాయి..?

జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రగడ జరుగుతోంది. లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తానంటూ పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్, తీరా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పేరుతో వేల పోస్ట్ లతో సరిపెట్టారని, మిగతా ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సచివాలయ ఉద్యోగాలు, వాలంటరీ పోస్ట్ లను ఎందుకు పరిగణలోకి తీసుకోరంటూ వైసీపీ లాజిక్ తీస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం కొత్త నోటిఫికేషన్లతో కూడిన కొత్త జాబ్ క్యాలెండర్ కావాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ ఎవరికి వారే విడివిడిగా ఆందోళనలు, నిరసనలు మొదలు పెట్టారు.

టీడీపీ నాయకులు జూమ్ కాన్ఫరెన్స్ ల ద్వారా యువతతో మాట్లాడుతూ, మరోవైపు ప్రత్యక్ష ఉద్యమానికి కూడా తెరతీశారు. టీడీపీ అనుబంధ విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనలు మొదలయ్యాయి. చలో తాడేపల్లి కార్యక్రమాన్ని పోలీసులు విజయవంతంగా అడ్డుకున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం జరుగుతోందని మండిపడ్డారు. నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఉద్యమాన్ని మొదలు పెట్టారు. జనసైనికులు జిల్లా ఉపాధి కార్యాలయాల్లో వినతిపత్రాలివ్వాలంటూ సూచించారు. అయితే ఈ వినతిపత్రాల కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా జనసేన నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. కరోనా కష్టకాలంలో జనం గుంపులుగా చేరకూడదని సర్ది చెబితే పర్లేదు కానీ, వినతిపత్రాలివ్వకుండా అడ్డుకోవడం మాత్రం దారుణం అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఉద్యోగాలు అడిగితే చేతికి సంకెళ్లు వేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నాయి. అరెస్ట్ ల వల్ల ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని అంటున్నాయి విద్యార్థి సంఘాలు. సంక్షేమ పథకాలతో జనం అభిమానాన్ని చూరగొన్న జగన్ కి, ఇలాంటి అరెస్ట్ ల వ్యవహారాలు జనంలో వ్యతిరేకత తీసుకొస్తాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: