కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి ఆహ్వానించే వేళ, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాస్త కలకలం రేపాయి. గతంలో తనకు ఎన్టీఆర్ అవకాశం ఇవ్వడం వల్లే ఎమ్మెల్యే కాగలిగానంటూ గుర్తు చేసుకున్నారు కేసీఆర్. అయితే హఠాత్తుగా సారు ఎన్టీఆర్ జపం చేయడం ఏంటా అని డైలమాలో పడ్డాయి టీఆర్ఎస్ శ్రేణులు. అయితే ఇది ఆయనకు బాగా అలవాటైన పనే. ఎన్నికలంటే చాలు కేసీఆర్ కి గత స్మృతులు మస్త్ గ గుర్తొస్తాయి. అలా ఇప్పుడో ఆణిముత్యం ఆయన నోటినుంచి జాలువారిందంతే.

జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కేసీఆర్ సెటిలర్లపై ఎంత ప్రేమ కురిపిస్తారో అందరికీ తెలిసిందే. సెటిలర్లను గుండెలో పెట్టుకుని చూసుకుంటామని చెబుతారు. నిజంగానే కేసీఆర్ కి ఏపీ, తెలంగాణ అనే భేదభావం లేకపోయినా.. గ్రేటర్ ఎన్నికలప్పుడు మాత్రం ఆ అభిమానం మరింత పెరుగుతుంది. వ్యతిరేక ఓటు లేకుండా చూసుకునేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నాలంటూ ఏవీ ఉండవు.

దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ లో ప్రారంభించడానికి కారణం ఏంటి..? ఉప ఎన్నికల వేళ కేసీఆర్ ఈ పథకాన్ని ఎందుకు హైలెట్ చేశారనే విషయం ఆయన రాజకీయ ప్రత్యర్థులకు బాగా తెలుసు. ఈటలను బయటకు సాగనంపిన తర్వాత కేసీఆర్ కి బీసీ నాయకులపై విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చింది. ఈటలకు ఆల్టర్నేట్ గా గంగులను బాగా దగ్గరకు తీశారు. ఇటీవల టీడీపీనుంచి ఎల్.రమణను టీఆర్ఎస్ లో చేర్చుకోడానికి కూడా కారణం బీసీ రాజకీయమేనని వేరే చెప్పక్కర్లేదు.

గతంలో ఉప ఎన్నికల వేళ దుబ్బాకపై వరాల జల్లు కురిపించారు, ఆ తర్వాత నాగార్జున సాగర్ ఎన్నికలప్పుడు కూడా అంతే. సాగర్ ప్రజలపై ఎక్కడలేని ప్రేమ చూపించారు. అభివృద్ధి అంతా అక్కడే ఉందనేలా సీన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు హుజూరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. పనిలో పనిగా టీడీపీ ఓటుని కూడా ఒడిసిపట్టేందుకు ఎన్టీఆర్ ని ఆకాశానికెత్తేశారు కేసీఆర్. గతంలో ఎప్పుడూ తనకు గుర్తురాని రాజకీయ గురవు, హఠాత్తుగా ఎన్నికలప్పుడే గుర్తుకు రావడం.. అది ఎన్టీఆర్ గొప్పదనం ఎంతమాత్రం కాదు, కేసీఆర్ గొప్పదనమే. ఈ విషయంలో కేసీఆర్ ని మించిపోయారు కేటీఆర్. సమయానుకూలంగా ఆయన కూడా ఇలాంటి ఇన్ స్టంట్ ప్రేమల్ని కురిపిస్తుంటారు. మొత్తమ్మీద ఎన్నికల వేళ, కేసీఆర్ కి మెల్ల మెల్లగా గత స్మృతులు గుర్తుకొస్తున్నాయనే విషయం స్పష్టమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: