ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. మంత్రుల కంటే ప్రభుత్వ సలహాదారులకే ఎక్కువ ప్రాముఖ్యత కనిపిస్తోంది. ఎందుకంటే- వైసీపీ సర్కారు తరఫున రాజకీయంగా కానీ, లేదా ప్రభుత్వ నిర్ణయాల పరంగా కానీ మీడియాకు వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వ సలహాదారులే ముందుంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాల్సినవారు.. వాటిపైనే ప్రధానంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అందరికంటే ముందున్నారనే చెప్పాలి. మామూలుగా ప్రభుత్వానికి నలుగైదురుగు సలహాదారులు ఉంటారు. కీలక రంగాలలో నిపుణులు సలహాలు తీసుకుని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ జగన్ ప్రభుత్వంలో ఏకంగా 44 మందిని సలహాదారులుగా నియమించడం, వారికి ఒక్కొక్కరికీ రెండు లక్షల చొప్పున నెలకు సుమారు కోటి రూపాయల వరకు జీత భత్యాలు రూపేణా చెల్లిస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకం చెల్లదన్న పిటిషన్‌పై జరిగిన విచారణలో.. రాష్ట్రానికి ఇంతమంది సలహాదారులా! అంటూ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేనప్పుడు ఇంతమంది సలహాదారులను ఎలా నియమించారని ప్రశ్నించింది.

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీకి సహకరించిన వారందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కల్పించడం, రాజకీయ పార్టీలకు ఆనవాయితీగా మారింది. ఇప్పుడు రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా తమకు సహకరించిన వారందరికీ, తెలిసిన వారి ద్వారా తమ దగ్గరకు వచ్చిన వారందరికీ సలహాదారుల పదవులు ఇచ్చేశారు. కొంతమందికి అయితే ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చారు. కారు, బంగ్లా, అటెండర్‌తో పాటు భారీగా జీత భత్యాలు కూడా చెల్లిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ కోసం పని చేసిన వారితో పాటు పార్టీకి పరోక్షంగా సహకారం అందించిన వారిని కూడా సలహాదారులుగా నియమించుకున్నారు. ఒక్కొక్కరికీ జీతభత్యాల రూపేణా నెలకు రెండు లక్షల రూపాయల పైబడి వేతనం చెల్లిస్తున్నారు. కొంతమంది అమెరికాలో ఉండి, ఇక్కడి నుంచి జీతాలు డ్రా చేస్తున్నారు. సలహాదారులు ఆయా రంగాలలో ప్రభుత్వానికి సలహాలు ఇస్తే పరవాలేదు గానీ, ఏకంగా రాజకీయ విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇక ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారునిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ విమర్శలు చేయడంపైనా జోరుగా చర్చ జరుగుతోంది. అసలు ప్రభుత్వ సలహాదారులు రాజకీయాలు మాట్లాడటం ఏమిటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఈ అంశంపైనే హైకోర్టు ప్రస్తావించి ఉంటుందని కూడా భావిస్తున్నారు. ప్రభుత్వ సలహాదారులు ఎటువంటి విధులు నిర్వహిస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. నాన్ రెసిడెంట్, తెలుగు ఎపైర్స్ డిప్యూటీ సలహాదారుడు మిడిలీస్ట్ దేశాల ప్రత్యేక ప్రతినిధి, పోలీసు శాఖలోని వివిధ విభాగాలకు సలహాదారులను కూడా నియమించారు.  కొంతమంది సలహాదారులు ఎవరో కూడా ఎవరికీ అంతుబట్డడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం 44 మంది సలహాదారులు ఉన్నారు. వీరి ఒక సమావేశం ఏర్పాటు చేయడం కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన సలహాలు ఇచ్చినట్లుగా కానీ నేటి వరకు ఎక్కడా దాఖలాలు కనిపించలేదు. నెల మొదటిలోనే జీత భత్యాలు మాత్రం ఠంచనుగా అందరికీ అందుతున్నాయని ప్రతిపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. మొత్తంమీద, అటు హైకోర్టు వ్యాఖ్యలు, ఇటు విపక్షాల విమర్శలతో.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల పాత్ర, వారి విధివిధానాలు, జీతభత్యాల అంశం ప్రజా బాహుళ్యంలో తీవ్ర చర్చనీయాయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: