"ఆరోజుల్లో చంద్రబాబు అనుమతివ్వకపోతే జగన్ పాదయాత్ర చేసేవారా..? అధికారంలోకి వచ్చేవారా..?" నారా లోకేష్ ఇటీవల కాలంలో కామన్ గా చెబుతున్న డైలాగులివి. అన్నీ చూస్తున్నాం.. వడ్డీతో సహా చెల్లిస్తాం అని కూడా వార్నింగ్ ఇస్తున్నారు లోకేష్. సొంత పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో ధైర్యం నింపేందుకు లోకేష్ ఇలాంటి డైలాగులు చెప్పడం బాగానే ఉంటుంది కానీ, ఓట్లు రాబట్టుకునేందుకు ఇవి ఎంతవరకు ఉపయోగం అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం.

టీడీపీ కార్యకర్తల్ని చంపుతున్నారు, తప్పుడు కేసులతో వేధిస్తున్నారు, నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారనేది లోకేష్ ప్రధాన ఆరోపణ. అలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారి కుటుంబాలను పరామర్శించడానికి వస్తున్న ఆయన, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రజా సమస్యలపై కార్యకర్తలు పోరాడాలని పిలుపునిస్తున్నారు.

అయితే ప్రజా సమస్యలపై నాయకుడు ముందుండి పోరాడాలన్న విషయాన్ని మాత్రం ఎందుకో లోకేష్ మరచిపోతున్నారు. జాబ్ క్యాలెండర్ వ్యవహారాన్ని కేవలం టీఎన్ఎస్ఎఫ్ నాయకులకు వదిలేశారు. ఆమధ్య నిరసన వారం పేరుతో వారం రోజులపాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి.. చివరి రోజు జూమ్ లో మీటింగ్ పెట్టి నిరాశపరిచారు టీడీపీ నేతలు. ప్రజా క్షేత్రంలో దూకేందుకు, ప్రజల తరపున ప్రజల్లో ఉండి పోరాడేందుకు మాత్రం లోకేష్ ఎందుకో వెనకాడుతున్నారు.

ఇదే అదనుగా వైసీపీ నేతలు పదే పదే పక్క రాష్ట్రంలో ఉండే నాయకులంటూ చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న మీకెందుకు ఏపీ సమస్యలు, అసలు మీ హయాంలో ఏం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఆశాజనకంగా లేదనే విషయం అందరికీ తెలుసు. చరిత్రలో ఎప్పుడూ ఎరుగని పరాభవం ఇప్పుడు ఎదురైంది. మరో మూడేళ్లలో ఎన్నికలున్నాయి. పార్టీనుంచి ఎమ్మెల్యేలు చేజారుతున్నారు కానీ, కొత్తగా పరిస్థితి మెరుగైన దాఖలాలు లేవు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కొన్నిచోట్ల అభ్యర్థులే కరువయ్యారు. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ చేసిన వ్యతిరేక ప్రచారం ఫలించలేదు. ఈ దశలో భవిష్యత్ కార్యాచరణపై లోకేష్ పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. నేరుగా ప్రజల్లోకి రావాలి, ప్రజల మధ్యే ఉండాలి. అలా చేయగలిగితేనే ఏపీలో టీడీపీ పుంజుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: