కొంతకాలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తీరు మారుతోంది. గతంలో ఎంత పెద్ద కార్యక్రమం ఉన్నా ఆయన ఫామ్ హౌజ్‌ నుంచి బయటకు వచ్చే వారు కాదు. ఎక్కువ కాలం ప్రగతి భవన్‌ కే పరిమితం అయ్యేవారు. పాపం.. మంత్రులకు కూడా ప్రగతిభవన్‌లోకి అనుమతి ఉండేది కాదు.. కానీ కొన్నిరోజులుగా ఆయన తీరు చాలా మారింది. ఇప్పుడు తరచూ జనంలోకి వస్తున్నారు. గ్రామాలకు వెళ్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలపై సమీక్షలు చేస్తున్నారు.


అంతే కాదు. కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారు. కొత్త హామీలు గుప్పిస్తున్నారు. అన్ని వర్గాలను తన వద్దకు పిలిపించుకుని మరీ మాట్లాడుతున్నారు. ఇలా కేసీఆర్‌ తీరులో చాలా మార్పు వచ్చింది. అయితే ఇదంతా ఎందుకు అన్న ప్రశ్నకు చాలా మంది చెప్పే సమాధానం హుజూరాబాద్ ఉపఎన్నిక. ఈటల రాజీనామా కారణంగా వచ్చిన ఈ ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకునే కేసీఆర్ జనంలోకి వస్తున్నారని భావిస్తున్నారు. అయితే ఇక్కడ అసలు కారణం వేరే ఉందన్న చర్చ కూడా మొదలైంది.


అదే 2023 అసెంబ్లీ ఎన్నికలు.. కేసీఆర్ రెండో విడత పాలనకు మూడేళ్లు పూర్తయ్యాయి. మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికల ఏడాదే.. అందుకే ఎన్నికల నేపథ్యంలోనే కేసీఆర్ చాలా మందుస్తుగా మేలుకున్నారని చెప్పాలి. దళిత బంధు కానీ.. రుణమాఫీ అమలు కానీ.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కానీ.. వీటన్నిటి లక్ష్యం ఈ హుజూరాబాద్ ఎన్నికల కాదు.. 2023 ఎన్నికలే.


2023 ఎన్నికలు కేసీఆర్‌కు చాలా కీలకం. అప్పటికే రెండు దఫాలు అధికారంలో ఉన్న పార్టీకి జనంలో సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. దీనికి తోడు ప్రత్యర్థులు బలంగా తయారవుతున్నారు. అందుకే కేసీఆర్ 2023 ఎన్నికల సమర శంఖం అప్పుడే పూరించారు. హ్యాట్రిక్ విజయానికి బాటలు వేసుకుంటున్నారు.. 2023 గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. అదీ కేసీఆర్ అసలు వ్యూహం.


మరింత సమాచారం తెలుసుకోండి: